Ambedkar Jayanti: అంబేడ్కర్‌ ఆ వర్గాలకే పరిమితమా..?-chief minister jaganmohan reddy paid tributes to ambedkar along with dalit public representatives ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ambedkar Jayanti: అంబేడ్కర్‌ ఆ వర్గాలకే పరిమితమా..?

Ambedkar Jayanti: అంబేడ్కర్‌ ఆ వర్గాలకే పరిమితమా..?

HT Telugu Desk HT Telugu
Apr 14, 2023 12:49 PM IST

Ambedkar Jayanti: జాతీయ నాయకులకు నివాళులు అర్పించే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలి కాలంలో వ్యవహరిస్తున్న చర్చనీయాంశంగా మారింది. జాతీయ నాయకులకు సామాజిక వర్గాలను ఆపాదించేలా అయా వర్గాలకు చెందిన ప్రజా ప్రతినిధులతో కార్యక్రమాలను చేపడుతున్నారు.

దళిత ప్రజా ప్రతినిధుల సమక్షంలో సిఎం జగన్ నివాళులు
దళిత ప్రజా ప్రతినిధుల సమక్షంలో సిఎం జగన్ నివాళులు

Ambedkar Jayanti: సామాజిక న్యాయానికి, స్వేచ్ఛా సమానత్వాలకు రాజ్యాంగం ద్వారా ఊపిరిలూదిన అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు చర్చనీయాంశం అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొనే కార్యక్రమాల్లో అయా సామాజిక వర్గాల ప్రజాప్రతినిధులు, మంత్రులను ఎంపిక వారి సమక్షంలో కార్యక్రమాలను నిర్వహిండం అలవాటుగా మారింది. ముఖ్యమంత్రికి స్వయంగా ఈ తరహా ఆలోచనలు, ఉద్దేశాలు లేకపోయినా అయా కార్యక్రమాలకు రూపకల్పన చేసి, ఎవరు పాల్గొనాలో నిర్ణయించే అధికారుల ఆలోచనా ధోరణితో ఈ పరిస్థితి వస్తోంది.

జాతీయ నాయకులకు సామాజిక వర్గాలను అంటగట్టి నివాళులు అర్పించే ఈ తరహా కార్యక్రమాలు చంద్రబాబు ప్రభుత్వ హయంలోనే మొదలయ్యాయి. మూస ధోరణిలో నివాళుల కార్యక్రమాలను నడిపేవారు. వాటినే ఇప్పటికీ ఆనవాయితీగా అమలు చేస్తున్నారు. ఒక్కో జాతీయ నాయకుడికి ఒక్కో వర్గాన్ని ఆపాదించేసి వారి సమక్షంలో నమస్కారాలు పెట్టే కార్యక్రమం నడపడం అలవాటై పోయింది. ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా పొట్టి శ్రీరాములుకు నివాళులు అర్పించే క్రమంలో వైశ్య ప్రజా ప్రతినిధులను ముఖ‌్యమంత్రి కార్యాలయానికి ఆహ్వానించి నివాళులు అర్పించే కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఇటీవల జరిగిన జగజ్జీవన్ జయరాం జయంతికి ఓ సామాజిక వర్గానికి చెందిన మంత్రి, ఎంపీలను ఆహ్వానించారు. ఆ తర్వాత ఫూలే జయంతి సందర్భంగా బీసీ మంత్రులు జోగి రమేష్‌, చెల్లుబోయిన సమక్షంలో మరికొందరు నాయకులతో నివాళులర్పించారు. ఆ మధ్య జైన తీర్థంకుడికి సంబంధించిన కార్యక్రమంలో ఆ వర్గానికి చెందిన నాయకులతోో కార్యక్రమం నిర్వహించారు.

తాజాగా అంబేడ్కర్ జయంతి సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్, నందిగం సురేష్, కైలే అనిల్, విశ్వరూప్‌, జూపూడి ప్రభాకర్‌ల సమక్షంలో ముఖ్యమంత్రి రాజ్యాంగ నిర్మాతకు నివాళులు అర్పించారు. అంబేడ్కర్‌ కేవలం అయా వర్గాలకు చెందిన వారికే నాయకుడా, మిగిలిన వారికి ఏమి సంబంధం లేదా అనే సందేహాలు తలెత్తాయి.

కులమతాలకు అతీతంగా నిర్వహించాల్సిన కార్యక్రమాల్లో అయా వర్గాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పుకునే ప్రయత్నాలకు సిఎంఓ ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది. అయా వర్గాలకు ప్రభుత్వాలు ప్రోత్సహించడం మంచి పరిణామమే అయినా, ఫూలే, అంబేడ్కర్‌, జగజ్జీవన్ రామ్ వంటి నాయకుల్ని కేవలం సామాజిక కోణంలో అయా వర్గాలకు మాత్రమే పరిమితం చేయడమే వారిని నొచ్చుకునేలా చేస్తోంది.

జాతీయ నాయకులకు నివాళులు అర్పించడాన్ని మొక్కుబడి కార్యక్రమంగానో, రాజకీయ ఉద్దేశాలతోనే కాకుండా నిజాయితీగా వ్యవహరించాల్సిన అవసరాన్ని రాజకీయ పార్టీలు ఉద్దేశపూర్వకంగానే మర్చిపోతున్నాయి. అధికారంలో ఉన్న వారితో పాటు విపక్షాలది సైతం ఇదే తీరులో సాగుతున్నాయి. అయా సామాజిక వర్గాల వారికి తమ పార్టీల్లో ప్రాధాన్యత ఇస్తున్నామనే భావన కల్పించడానికి ఎక్కువ తాపత్రయ పడుతుండటం గమనార్హం

Whats_app_banner