AP TG Rain Alert : మరో అల్పపీడనం ముప్పు..! ఏపీకి భారీ నుంచి అతిభారీ వర్ష సూచన - ఈ జిల్లాలకు హెచ్చరికలు
04 September 2024, 14:17 IST
- తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉంది. పశ్చిమ మధ్య బంగాళఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఫలితంగా ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఏపీ తెలంగాణకు భారీ వర్ష సూచన..!
తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు ఉంచింది. రేపటికి పశ్చిమ మధ్య బంగాళఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణశాఖ హెచ్చరించింది. ఎన్టీఆర్, ఏలూరు, పల్నాడుకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది.
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తాజా బులిటెన్ ప్రకారం… ఇవాళ శ్రీకాకుళం,విజయనగరం,మన్యం, అల్లూరి,విశాఖ,అనకాపల్లి, కాకినాడ,కోనసీమ,ఉభయ గోదావరి, ఏలూరు,కృష్ణా,ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు నుండి వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడొచ్చని అంచనా వేసింది.
గోదావరికి స్వల్పంగా వరద ఉద్ధృతి పెరుగుతున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. భద్రాచలం వద్ద నీటిమట్టం 42.2 అడుగులకు చేరింది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో 3,05,043, ఔట్ ఫ్లో3,12,057 లక్షల క్యూసెక్కులుగా ఉందని పేర్కొంది. ప్రభావిత 6 జిల్లాల అధికార యంత్రంగాన్ని అప్రమత్తం చేసింది. గోదావరి పరివాహక ప్రాంతప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు…!
ఇక తూర్పు, ఉత్తర తెలంగాణలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, సూర్యాపేట, మహబూబబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
రేపు (గురువారం) భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. ఇక ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కొత్తగూడెం జిల్లాల్లో భారరీ వర్షాలు పడుతాయని అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.
తెలంగాణలోని పలు జిల్లాల్లో సెప్టెంబర్ 8వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.