Hyderabad Rains : అర్ధరాత్రి వేళ హైదరాబాద్‌లో కుండపోత వర్షం - లోతట్టు ప్రాంతాలు జలమయం..!-sudden heavy rain in several parts of hyderabad on the late night hours of tuesday ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Rains : అర్ధరాత్రి వేళ హైదరాబాద్‌లో కుండపోత వర్షం - లోతట్టు ప్రాంతాలు జలమయం..!

Hyderabad Rains : అర్ధరాత్రి వేళ హైదరాబాద్‌లో కుండపోత వర్షం - లోతట్టు ప్రాంతాలు జలమయం..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 04, 2024 01:05 AM IST

హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం అర్ధరాత్రి వేళ పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. చాలా చోట్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.

హైదరాబాద్ లో భారీ వర్షం
హైదరాబాద్ లో భారీ వర్షం

Hyderabad Rains : హైదరాబాద్ లో నగరంలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా జడివాన మొదలైంది. దీంతో పలు ప్రాంతాల్లోని రోడ్లన్నీ జలమయమయ్యాయి.

లింగంపల్లి, పటాన్ చెరు, చందానగర్. కొండాపూర్, గచ్చిబౌలి, మల్కాజ్ గిరి, చర్లపల్లి, కీసర, కాప్రా, నాగారం, దమ్మాయిగూడ, తిరుమలగిరి, సికింద్రాబాద్, బోయిన్ పల్లి, జీడిమెట్ల, కూకట్ పల్లి, ప్రగతి నగర్, బేగంటపేట, అమీర్ పేట, బంజారాహిల్స్, పంజాగుట్ట, సైదాబాద్, మలక్ పేట, కోఠి, అబిడ్స్, ఎల్బీ నగర్, హయత్ నగర్ తో పాటు పలు శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.

భారీ వర్షంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కాలనీల్లో వరద ఇబ్బందులు లేదా విపత్కర పరిస్థితులు ఉంటే 040-21111111 లేదా 9000113667 నెంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.

మరోవైపు సెప్టెంబర్ 5న పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంను ఆనుకొని మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రుతుపవన ద్రోణి ప్రభావంతో కోస్తా మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావంతో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మధ్య విదర్భ పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం ప్రస్తుతం బలహీనపడి పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతం వైపు పయనిస్తుందని తెలిపింది. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు ఆవరించిన ఉందని అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర, యానాం పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి 3.1 నుంచి 5.8 కి.మీ వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని పేర్కొన్నారు.

ఇవాళ( బుధవారం) కొమురంభీం ఆసిఫాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీచేసింది.

టాపిక్