తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nalgoda Brs Office : నల్గొండలో బీఆర్ఎస్ ఆఫీసు వివాదం, కూల్చివేయాలని మంత్రి కోమటిరెడ్డి హుకుం

Nalgoda BRS Office : నల్గొండలో బీఆర్ఎస్ ఆఫీసు వివాదం, కూల్చివేయాలని మంత్రి కోమటిరెడ్డి హుకుం

HT Telugu Desk HT Telugu

05 August 2024, 22:46 IST

google News
    • Nalgoda BRS Office : నల్గొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ ఆఫీసు చుట్టూ వివాదం నెలకొంది. బీఆర్ఎస్ అక్రమంగా ఆఫీసు నిర్మించిందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తుంది. బిల్డింగ్ కూల్చేస్తామని మంత్రి కోటమిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.
నల్గొండలో బీఆర్ఎస్ ఆఫీసు వివాదం, కూల్చివేయాలని మంత్రి కోమటిరెడ్డి హుకుం
నల్గొండలో బీఆర్ఎస్ ఆఫీసు వివాదం, కూల్చివేయాలని మంత్రి కోమటిరెడ్డి హుకుం

నల్గొండలో బీఆర్ఎస్ ఆఫీసు వివాదం, కూల్చివేయాలని మంత్రి కోమటిరెడ్డి హుకుం

Nalgoda BRS Office : నల్గొండ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య కొత్త వివాదం నడుస్తోంది. నల్గొండ టౌన్ లో అత్యంత విలువైన ప్రాంతంగా పేరుపడ్డ హైదరాబాద్ రోడ్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించడమే ఈ వివాదానికి ప్రధాన కారణం. ఆగ్రోస్ ఇండస్ట్రీస్ కు చెందిన విలువైన భూమిలో ఎకరా స్థలాన్ని బీఆర్ఎస్ 99 ఏళ్లకు లీజుకు తీసుకుంది. అది కూడా గజానికి కేవలం రూ.100 మాత్రమే ఏడాదికి చెల్లించేలా అతి తక్కువ అమౌంట్ కు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, జిల్లా బీఆర్ఎస్ జిల్లా శాఖకు లీజు ఇచ్చింది. వరంగల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి బీఆర్ఎస్ నిర్మించిన పార్టీ కార్యాలయం నిర్మించిందని ఆ స్థలంపై అక్కడి కార్పొరేషన్ లో వివాదాం జరుగుతున్నట్టే.. నల్లగొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఎలాంటి మున్సిపల్ అనుమతులు లేకుండా భవన్నాన్ని నిర్మించిందని వివాదం జరుగుతోంది.

ఆగ్రోస్ నుంచి లీజుకు తీసుకున్న ఎకరా స్థలం కంటే ఎక్కువ స్థలాన్ని బీఆర్ఎస్ వినియోగించుకుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ముఖ్యమైన ప్రాంతంలో, విలువైన భూమిని ప్రభుత్వ ప్రజోపయోగ కార్యక్రమాలకు ఉపయోగిస్తామని జిల్లా మంత్రి, నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపిస్తున్నారు. మార్కెట్ రేటు ప్రకారం బీఆర్ఎస్ ఆఫీసు నిర్మించిన స్థలం విలువ రూ.2 కోట్ల పైమాటే. స్థానిక మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఆఫీసును కూల్చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జిల్లా కలెక్టర్ కు, మున్సిపల్ అధికారులకు బహిరంగంగానే పేర్కొనడం ఇరు పార్టీల మధ్య వేడి పుట్టించింది. ‘‘ నేను అమెరికా వెళ్లొచ్చేలోగా ఈనెల 11 వ తేదీ నాటికి ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతుల్లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ ఆఫీసును కూల్చాలి..’’ అంటూ మంత్రి కోమటిరెడ్డి తాజా హుకుం జారీ చేయడంతో బీఆర్ఎస్ వర్గాలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కు మున్సిపల్ అధికారులు ఫైనల్ నోటీసులు కూడా ఇచ్చేశారు.

రాజకీయ వివాదంగా బిల్డింగ్ కూల్చివేత ఆదేశాలు

జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఏక పక్షంగా విలువైన భూమిని లీజు కింద తీసేసుకుందన్న ఆరోపణలు మొదటి నుంచీ ఉన్నాయి. వాస్తవానికి నల్గొండ టౌన్ లో టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎంలకు సొంత ఆఫీసు భవనాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి స్థానిక ప్రకాశం బజారులో పాత బస్టాండు సమీపంలో భూమి ఉన్నా పార్టీ కార్యాలయ నిర్మాణం అరకొర పనుల తర్వాత నిలిచిపోయింది. అయితే, బీఆర్ఎస్ మొదటి నుంచీ తన పార్టీ కార్యాలయాన్ని అద్దె భవనంలోనే కొనసాగించింది. 2014లో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పడిన తొలి ప్రభుత్వం హయాంలో పార్టీ కార్యాలయాలకు భూముల కేటాయింపు జరగలేదు. 2018లో రెండో సారి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు భూముల కేటాయింపు, భూమి పూజలు, భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 2023లో మూడో సారి తెలంగాణ రాష్ట్రానికి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ చేతి నుంచి కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంది.

దాదాపు అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన భూ కేటాయింపులపై వివరాలు సేకరిస్తున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఆగ్రోస్ సంస్థకు ఉన్న విలువైన భూమిలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఒక పెట్రోల్ బంక్ ఏర్పాటు చేశారు. మిగిలిన భూమిలో బీఆర్ఎస్ కు ఎకరం స్థలాన్ని 99 ఏళ్లకు అతి తక్కువ లీజ్ అమౌంట్ కు ఇవ్వడంపై మొదట్లోనే విమర్శలు, వ్యతిరేకత వచ్చింది. అయితే, అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉండడం, జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యేతో పాటు, నల్గొండ మున్సిపాలిటీ కూడా బీఆర్ఎస్ చేతిలోనే ఉండడంతో భూ కేటాయింపులు తేలిగ్గా జరిగిపోయాయి. 2023 ఎన్నికల తర్వాత నల్లగొండ ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజయం సాధించడం, ఇప్పుడు రాష్ట్ర కేబినెట్ లో ఆర్ అండ్ బి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తుండడం, నల్గొండ మున్సిపల్ చైర్మన్ పై ఆవిశ్వాసం నెగ్గి, కాంగ్రెస్ చేతిలోకి మున్సిపాలిటీ వెళ్లిపోవడం వంటి పరిణామాలు జరిగాయి. దీంతో విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునేందుకు నల్గొండ మున్సిపాలిటీ సిద్ధమైంది. దీనికి మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు తోడుకావడంతో ఇది రాజకీయ రంగును పులుముకుంది.

మున్సిపల్ యాక్టును ఫాలో అవుతాం : బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ ఛైర్మన్

‘‘ రాష్ట్రంలో కొత్త మున్సిపల్ చట్టాలను చేసింది, తెచ్చింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వమే. మున్సిపల్ యాక్ట్ – 2019 లోని సెక్షన్ 174 కు లోబడి, అనుమతుల్లేని అక్రమ నిర్మాణాల కూల్చివేతకు అధికారం కల్పించింది. జిల్లా కలెక్టర్, డీఎస్పీ, ఫైర్ ఆఫీసర్, ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు సభ్యులుగా ఉన్న టాస్క్ ఫోర్స్ కమిటీ ఈ అంశాన్ని పరిశీలించి సిఫారసు చేస్తుంది. నిర్మాణం అక్రమమని ఈ కమిటీ తేల్చితే, కచ్చితంగా కూల్చాల్సిందే...’’ - బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ ఛైర్మన్

చట్టపరంగా ఎదుర్కొంటాం : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

‘‘నిబంధన మేరకే తమ ప్రభుత్వం ఎకరం భూమి పార్టీ కార్యాలయం కోసం కేటాయించింది. కార్యాలయ నిర్మాణానికి మున్సిపల్ కార్యాలయంలో తాము ఆనాడే దరఖాస్తు చేశాం. కానీ ఏ పార్టీ కార్యాలయానికీ మున్సిపల్ అధికారులు గతంలో అనుమతులు మంజూరు చేయలేదు. ఆ కారణంగానే అప్పటి మున్సిపల్ అధికారులు కార్యాలయం నిర్మాణ అనుమతికి జాప్యం చేశారు. అయినా, తాము నెల రోజుల కిందటే జిల్లా కలెక్టర్ కు మున్సిపల్ కమిషనర్ కు, నిబంధనల మేరకు 33 శాతం ఫైన్ చెల్లిస్తామని, ఇప్పటికైనా అనుమతి ఇవ్వాలని రాతపూర్వకంగా తెలియజేశాం. నిబంధనల మేరకు 15 రోజుల్లో అనుమతి ఇవ్వాల్సి ఉన్నా అధికారులను మంత్రి కోమటిరెడ్డి బెదిరించి అనుమతి ఇవ్వకుండా చూస్తున్నారు. ఇది కేవలం రాజకీయ కక్షతోనే తమ పార్టీ కార్యాలయం కూలగొట్టాలని చూస్తున్నారు. చట్టపరంగానే దీనిని ఎదుర్కొంటాం..’’ - మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ ప్రతినిధి )

తదుపరి వ్యాసం