Komatireddy Venkat Reddy : వచ్చే నెల నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ అమలు- మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Komatireddy Venkat Reddy : 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీని వచ్చే నెల అమలుచేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ సర్కార్ దోపిడీ కారణంగానే హామీల అమల్లో జాప్యం అవుతుందన్నారు.
Komatireddy Venkat Reddy : 100 రోజుల్లో ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ సర్కార్ రాష్ట్ర ఖజానాను గుల్ల చేసిందని ఆరోపించారు. అందుకే హామీ అమలు ఆలస్యం అవుతుందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు వచ్చే నెల నుంచి ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ అమలవుతుందని మంత్రి స్పష్టం చేశారు. మంగళవారం గాంధీభవన్ లో మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ త్వరలోనే అమలుచేస్తామన్నారు. బీఆర్ఎస్ నేతల్లాగా తాము ప్రజల్ని రెచ్చగొడితే ఫామ్ హౌస్ దాటకపోయే వారని హెచ్చరించారు. కాళేశ్వరంతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల్లో అక్రమాలపై విచారణ కొనసాగుతుందన్నారు. హామీల అమలుపై ఇవాళ సమీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
జగదీష్ రెడ్డి జైలుకే!
నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూం ఇండ్ల వరకు అన్ని హామీలను బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదన్నారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. జగదీష్ రెడ్డి చావు తప్పి కన్ను లొట్టపోయి గెలిచారన్నారు. ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోలేని అసమర్థుడు జగదీష్ రెడ్డి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముగ్గురుని హత్య చేసిన కేసులో జగదీష్ రెడ్డి నిందితుడని ఆరోపణలు చేశాడు. రేపో మాపో జగదీష్ రెడ్డి జైలుకు పోవడం ఖాయమన్నారు. కోవర్టు అంటూ తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడటం వెస్ట్ అంటూ మంత్రి ఫైర్ అయ్యారు. జగదీష్ రెడ్డికి సూర్యాపేట కలెక్టరేట్ చుట్టూ 150 ఎకరాల భూములు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. 80 ఎకరాల్లో ఫామ్ హౌస్ ఎలా కట్టారన్నారు.
నిరుద్యోగులను కేసీఆర్ ఇంటికి పంపాలా?
ఉచిత విద్యుత్ పై బీఆర్ఎస్ కావాలనే హడావుడి చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేసి తీరుతామన్నారు. 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్ హామీని 100 రోజుల్లో నిలబెట్టుకుంటామన్నారు. కాంగ్రెస్ గ్యారంటీలపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని హామీలు నిలబెట్టుకుందో చెప్పాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో దళితుణ్ణి సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్..ఎందుకు మాటతప్పారని ప్రశ్నించారు. దళితుణ్ణి సీఎం చేయకపోతే తల నరుక్కుంటానన్న కేసీఆర్... 9 ఏళ్ల పాలనలో ఎన్నిసార్లు తల నరుక్కున్నారని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఇస్తానని నిరుద్యోగులను మోసం చేశారన్నారు. నిరుద్యోగులను కేసీఆర్ ఇంటికి పంపాలా? కేటీఆర్ ఇంటికి పంపాలా? అని ప్రశ్నించారు. పదేళ్లలో ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. కేసీఆర్ సర్కార్ దోపిడీ వల్లే హామీలు వెంటనే అమలు చేయలేని పరిస్థితి వచ్చిందన్నారు.
200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అయితే ఈ హామీని వెంటనే అమలు చేయాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. జనవరి నెల కరెంట్ బిల్లులు ఎవరూ కట్టవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. విద్యుత్ బిల్లులను సోనియా గాంధీకి పంపాలన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.