Rahul Gandhi caste: రాహుల్ గాంధీ కులంపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ అనుచిత కామెంట్స్; మండిపడిన ప్రియాంక గాంధీ
కుల గణనకు సంబంధించి మాట్లాడుతూ లోక్ సభలో మాజీ కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత జనాభాలో 80 శాతం మందిని పార్లమెంటులో అవమానించారని రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ మండిపడ్డారు.
Rahul Gandhi caste: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి లోక్ సభలో మాజీ కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.అనురాగ్ ఠాకూర్ రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే, తాను ఎవరి పేరును ప్రస్తావించలేదని, క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదని అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు.
ప్రియాంక గాంధీ మండిపాటు
తన సోదరుడు, ఎంపీ రాహుల్ గాంధీని కులం ప్రస్తావన తెచ్చి అవమానించారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ మండిపడ్డారు. దేశంలోని 80 శాతం మంది ప్రజలను పార్లమెంటులో అవమానించారని ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. లోక్ సభలో కేంద్ర బడ్జెట్ (budget 2024) పై చర్చ సందర్భంగా అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. కులం ఏంటో తెలియని వారు కుల గణన గురించి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ‘‘తమ కులం ఏంటో తెలియని వారు కుల గణన గురించి మాట్లాడతారు. ఈ సభలోనే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకించిన విషయాన్ని స్పీకర్ కు గుర్తు చేయాలనుకుంటున్నాను’’ అన్నారు. ఆయన వ్యాఖ్యలు దుమారం రేపడంతో తాను ఎవరి పేరునూ ప్రస్తావించలేదని స్పష్టం చేశారు.
80 శాతం ప్రజలను అవమానించారు..
‘‘సామాజిక, ఆర్థిక కుల గణన అనేది ఈ దేశంలోని 80 శాతం మంది ప్రజల డిమాండ్. కులం తెలియని వారు కుల గణన గురించి మాట్లాడుతున్నారని ఈ రోజు పార్లమెంటులో మాజీ కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ అన్నారు. ఇది 80% ప్రజలను అవమానించడమే’’ అని ప్రియాంక గాంధీ ఎక్స్ లో ఒక పోస్ట్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత జనాభాలో 80 శాతం మందిని ఇప్పుడు పార్లమెంటులో అవమానిస్తారా? అని ఆమె ప్రశ్నించారు. అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ సమర్ధిస్తున్నారా? అని ప్రశ్నించారు.
అమరత్వం వారి కులం..
కాంగ్రెస్ మీడియా, పబ్లిసిటీ విభాగాధిపతి పవన్ ఖేరా మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ (rahul gandhi) కుటుంబం కులం అమరత్వం’ అన్నారు. ‘‘బీజేపీ నిజస్వరూపం బయటపడింది. అమరవీరుల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ని ఉద్దేశించి ఇలాంటి దూషణలు చేయడం బీజేపీకి మాత్రమే సాధ్యమవుతుంది. మీ కులం తెలియదని మీరంటున్నారు. అతని కులం ఏమిటో చెబుతాం. రాహుల్ గాంధీ తండ్రి అమరవీరుడు. వారి కుటుంబం కులం అమరత్వం. ఇది ఆరెస్సెస్, బీజేపీ, ఠాకూర్ ఎప్పటికీ అర్థం చేసుకోలేరు ’’ అని పవన్ ఖేరా వ్యాఖ్యానించారు.
బీజేపీ ఎంపీ అవమానించారు..
బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ తనను అవమానించారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆదివాసీలు, దళితులు, వెనుకబడిన వారి సమస్యలను ఎవరు లేవనెత్తినా వారిని బీజేపీ వారు దూషిస్తున్నారన్నారు. ‘‘ఈ దూషణలను సంతోషంగా స్వీకరిస్తాను... అనురాగ్ ఠాకూర్ నన్ను దూషించారు, అవమానించారు. కానీ నేను ఆయన నుంచి క్షమాపణలు కోరుకోవడం లేదు' అని రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ గాంధీ కులం గురించి అనురాగ్ ఠాకూర్ ఎలా అడుగుతారని రాహుల్ గాంధీ మిత్రపక్షమైన సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు.