Munugode Houses Rent : తప్పదు మరి.. మునుగోడులో ఇంటి అద్దే రూ.75 వేలు
17 October 2022, 14:16 IST
- Munugode Bypoll Effect Houses Rent Rises : ఇప్పుడు మునుగోడు వెళ్తే.. అంతా కాస్ట్లీ.. కాస్ట్లీ. ఏది ముట్టుకున్నా ధర చుక్కులు చూపిస్తోంది. ఇక ఇంటి అద్దెల విషయం మాత్రం మరి ఘోరంగా ఉంది. హైదరాబాద్ లో కూడా తక్కువే. తప్పదు మరి.. అసలే ఎన్నికలు.
ప్రతీకాత్మక చిత్రం
అవకాశం వచ్చినప్పుడే సంపాదించుకోవాలి. తర్వాత ఎంత ఎదురుచూసినా నో యూజ్. ఇప్పుడు మునుగోడు(Munugode)లోని కొంతమంది ఇంటి యజమానులు ఇదే సూత్రం పాటిస్తున్నారు. ఏడాదికి సరిపడా అద్దెను నెలకే వసూలు చేస్తున్నారు. ఇంకొంతమందైతే.. 15 రోజులకే పెద్ద మెుత్తంలో ఛార్జ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని కీలక నేతలంతా మునుగోడులో అడ్డా వేయడం, ఇళ్లు సరిగా దొరకపోవడంతో ఇక ఇంటి ఓనర్లు పండగ చేసుకుంటున్నారు.
మునుగోడు వస్తున్న నేతలంతా.. తక్కువలో తక్కువ నెలరోజులైనా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఒకవేళ వాళ్లు అటు ఇటు వెళ్లినా.. తమతో వచ్చిన బ్యాచ్ కు మర్యాద ఏ మాత్రం తగ్గకుండా చూసుకుంటున్నారు. దీంతో అద్దె ఇళ్లు(House Rent) ఖాళీగా లేవు. ఒకవేళ ఇళ్లు దొరికినా.. భారీగా అద్దె వసూలు చేస్తున్నారు. అలా అని ఓన్లీ ఇంటి కిరాయిలే మాత్రం కాదు.. మాంసం, మందు.. ఇలా ఏది ముట్టుకున్నా.. మునుగోడులో చేతులు కాలిపోయేలా ఉంది.
మునుగోడు వెళ్లి చూస్తే.. నేతల కంటే ప్రజలే తెలివైన వారని ఈజీగా అర్థమవుతోంది. అందివచ్చిన ఏ అవకాశాన్ని అక్కడ జనాలు వదులుకోవట్లేదు. ఓటర్లు(Voters), వ్యాపారులు, ఇళ్లు అద్దెకు ఇచ్చేవాళ్లు... రాజకీయ పార్టీల అవసరాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. ఇంటి అద్దెల పరిస్థితైతే దారుణంగా ఉంది. ఎన్నిక దగ్గర పడుతుండటంతో ముఖ్యనేతలు, వారి అనుచరులు మునుగోడులో వాలిపోయారు. దీంతో ఇల్లు అద్దెకు దొరికే పరిస్థితి లేదు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన కొందరు ముఖ్య నేతలు సైతం ఫంక్షన్ హాల్స్ లో బస చేసే పరిస్థితి వచ్చింది.
ఇప్పుడు మునుగోడులో ఇళ్లు అద్దెకు దొరకడం అంటే పుణ్యక్షేత్రంలో మంచి విల్లా దొరికినట్టే అని ఫీలవుతున్నారు. అక్కడ సింగిల్ బెడ్రూం(Single Bed Room) ఇల్లు నెలకు రూ.30 వేల నుంచి 50 వేల వరకు తీసుకుంటున్నారు. ఇక డబుల్ బెడ్రూం(Double Bed Room) ఇల్లు అద్దె రూ.75 వేలకు ఒక్క రూపాయి తగ్గట్లేదు. వచ్చేది కూడా పెద్ద పెద్ద నేతలే.. దీంతో వసూలు చేస్తే వచ్చే సమస్య ఏంటి అని ఇంటి ఓనర్లు చెబుతున్నారు. ఇక ప్రచారానికి వెళ్లే వారైతే గట్టిగా సంపాదిస్తున్నారు.
'సాధారణ సమయంలో సింగిల్ బెడ్రూం కు రూ.4 వేల నుంచి 6 వేల వరకూ వసూలు చేసేవాళ్లం. ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఒక్కసారిగా మునుగోడులో వాలిపోయారు. ముందు కాస్త తక్కువే పెంచాం. కానీ ఒకరిని చూసి.. ఒకరం ఇప్పుడు వేలల్లో పెంచేశాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్లీ సాధారణ స్థితిలోకే వస్తుంది. డిమాండ్ ఉన్నప్పుడే సంపాదించుకోవాలి.' అని ఓ ఇంటి ఓనర్ చెప్పాడు.
మునుగోడు బైపోల్(Munugode Bypoll) ను ప్రధాన పార్టీలు చాలా సీరియస్ గా తీసుకున్నాయి. ఎలాగైనా గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. డబ్బు ప్రవాహం కూడా ఎక్కువగానే ఉందని.. విమర్శలు ఉన్నాయి. మరోవైపు ఓటర్లు కూడా ఈ అవకాశాన్ని వదులుకోవద్దనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఓటు కోసం వచ్చిన నేతలతో నేరుగానే మాకేంటి అని అడుగుతున్నారట. ఇక పోలింగ్ దగ్గరకు వచ్చే సమయంలో పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి.