ఆ పార్టీలకు యూపీ ఓటర్లు గట్టి షాక్.. ‘నోటా’ కంటే తక్కువ ఓట్లు!
యూపీ ఎన్నికల్లో కమలం వికసించింది. ప్రత్యర్థి పార్టీలు.. పరేషాన్లో పడ్డాయి. ప్రధాన ప్రత్యర్థి ఎస్పీ.. 125 సీట్లతో సరిపెట్టుకోగా.. మిగతా పార్టీలు పూర్తిగా చతికిలపడ్డాయి. కేవలం సీట్లలోనే కాదు.. ఓట్ల శాతంలో కూడా..! గమ్మతైన విషయం ఏంటంటే.. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.
ఉత్తరప్రదేశ్ ఫలితాలు వచ్చేశాయి. యోగి మరోసారి సీఎం పీఠాన్ని నెలబెట్టుకున్నాడు. అధికారంలోకి వస్తామన్న సమాజ్ వాదీ ఆశలు.. ఆవిరయ్యాయి. ఎంఐఎంతో కలిసి బరిలోకి దిగిన బీఎస్పీకి భారీ షాకే తగిలింది. ఇదంతా సీట్ల లెక్క..! మరీ ఓట్ల లెక్కలు చూడాలి కదా..! ఇందులో పలు ప్రముఖ పార్టీలకు గట్టి షాక్ ఇచ్చారు ఉత్తరప్రదేశ్ ఓటర్లు..!
నోటాకే ఎక్కువ ఓట్లు...
గురువార వెలువడిన యూపీ ఫలితాల్లో పలు ప్రముఖ పార్టీల కంటే.. నోటా(NOTA) కే ఎక్కువ ఓట్లు రావటం ఆసక్తిగా మారింది. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం.. నోటా 0.69 శాతం ఓట్లను పొందింది. అయితే ఇక్కడ బీఎస్పీతో కలిసి పోటీ చేసిన ఎంఐఎం కేవలం 0.47 శాతం ఓట్లు సాధించింది. జేడీయూ 0.11, సీపీఐ 0.07శాతం, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్) ఎల్జేపీలు 0.01 శాతం చొప్పున ఓట్లు పడ్డాయి.
ఆప్ సంగతీ అంతే...
పంజాబ్‌లో అధికారాన్ని కైవసం చేసుకున్న ఆమ్ ఆద్మీ.. గోవాలో రెండు సీట్లతో రేస్‌లో నిలిచింది. కానీ ప్రతిష్టాత్మకమైన యూపీలో మాత్రం.. పూర్తిగా లైన్ తప్పింది. ఒక్కసీటు కూడా సాధించని ఆప్.. కేవలం 0.35 శాతం ఓట్లను సాధించింది. ఈ పరిణామం ఆ పార్టీ నేతలకు క్లిష్టంగా మారింది.
ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ.. 41శాతానికి పైగా ఓటు బ్యాంక్‌ను సాధించింది. ఇక సెకండ్ ప్లేస్‌లో ఉన్న ఎస్పీ.. 32 శాతం ఓట్లతో సరిపెట్టుకుంది. మాయవతి నేతృత్వంలోని బీఎస్పీకి 12.8శాతం, ఆర్ఎల్డీ (రాష్ట్రీయ లోక్‌దళ్) కి 3.02శాతం వచ్చాయి. ఇక హస్తం పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. కనీసం ఖాతా తెరవని ఆ పార్టీకి కేవలం 3.02 శాతం ఓట్లే వచ్చాయి.
2017లో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 39.67 శాతం ఓట్లతో 312 సీట్లు గెలుచుకుని చరిత్ర సృష్టించింది. అదే సమయంలో సమాజ్‌వాదీ పార్టీ 47 సీట్లతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి) 19, కాంగ్రెస్‌కు ఏడు స్థానాలు మాత్రమే దక్కాయి.