Konda surekha vs KTR : కేసీఆర్ కనపడట్లేదు.. కేటీఆర్ గొంతు పిసికి చంపిండేమో : కొండా సురేఖ
03 October 2024, 16:48 IST
- Konda surekha vs KTR : మంత్రి కొండా సురేఖ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. కేటీఆర్‌పై తీవ్రంగా ఫైర్ అయ్యారు. కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. అదే సమయంలో.. కేసీఆర్ కనపడటం లేదు.. కేటీఆర్ గొంతు పిసికి చంపేశాడేమో అని సంచలన ఆరోపణలు చేశారు.
కొండా సురేఖ
మంత్రి కొండా సురేఖ.. కేటీఆర్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్లుగా ఉన్న అధికారం కోల్పోవడంతో.. ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడంలేదని కొండా సురేఖ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీపై విష ప్రచారం చేస్తున్నారన్న మంత్రి.. బీఆర్‌ఎస్ ఓటమికి కేటీఆరే కారణం అని విమర్శించారు.
'కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. మంచి ఆలోచనతో ప్రతిపక్ష నేతగా సలహాలు ఇవ్వాలి. ప్రభుత్వ పనులకు అడ్డుపడితే ప్రజలు ఊరుకోరు. కేసీఆర్‌ను పక్కనపెట్టి సీఎంలా కేటీఆర్ వ్యవహరించారు. కేటీఆర్ ఎన్నో కుంభకోణాలు చేశారు. పనికిమాలిన పనులు చేసి బీఆర్ఎస్‌కు చెడ్డపేరు తెచ్చారు' అని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు.
'అసలే కేటీఆర్‌కు పదవీ కాంక్ష ఎక్కువ. లోపల ఎమన్నా బొండిగె పిసికి సావగొట్టిండో.. తలకాయ పగలగొట్టిండో తెల్వది. మనిషి కనపడకపోతే అనుమానపడాల్సిన పరిస్థితి వస్తది కాబట్టి.. మనమందరం కూడా పాపం కేసీఆర్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆయన బాగుండాలని కోరుకుందాం' కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొండా సురేఖ బుధవారం చేసిన కామెంట్స్‌పై ఇంకా రచ్చ తగ్గలేదు. ఈ నేపథ్యంలో.. మళ్లీ కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ.. విమర్శలు చేశారు. అక్టోబర్ 2న కూడా.. కేటీఆర్‌పై కొండా సురేఖ ఎవరూ ఊహించని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో.. మంత్రి కొండా సురేఖపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో బీఆర్‌ఎస్ మహిళా కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా నిరాధారమైన ఆరోపణలు చేసిన కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
'ఆవేదనతోనే విమర్శలు చేశా. నాకు ఎవరిపై వ్యక్తిగత ద్వేషం, కోపం లేదు. అనుకోకుండా ఓ కుటుంబంపై మాట జారాను. నేను చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా బాధపడ్డా. అందుకే నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నా. కేటీఆర్ విషయంలో వెనక్కి తగ్గేదిలేదు. పరువు నష్టం దావా వేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటా. కేటీఆర్ తప్పనిసరిగా క్షమాపణ చెప్పాలి' అని మంత్రి కొండా సురేఖ గురువారం ఉదయం వ్యాఖ్యానించారు.
కొండా సురేఖకు మతిభ్రమించిందని కేఏ పాల్ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. 72 గంటల్లో కొండా సురేఖ రాజీనామా చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. సమంత, నాగార్జున ఇంటికి వెళ్లి క్షమాపణ చెప్పాలనన్నారు. కొండా సురేఖ రాజీనామా చేయకపోతే.. కేసు వేస్తానని కేఏ పాల్ హెచ్చరించారు. కొండా సురేఖ కామెంట్స్‌పై ఇటు సినీ, అటు రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు.