KA Paul : జగన్ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే శపిస్తా, మాజీ సీఎం అవుతారని కేఏ పాల్ హల్చల్!-vijayawada news in telugu ka paul creating nuisance at tadepalli cm camp office ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ka Paul : జగన్ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే శపిస్తా, మాజీ సీఎం అవుతారని కేఏ పాల్ హల్చల్!

KA Paul : జగన్ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే శపిస్తా, మాజీ సీఎం అవుతారని కేఏ పాల్ హల్చల్!

Bandaru Satyaprasad HT Telugu
Jan 09, 2024 10:36 PM IST

KA Paul : తాడేపల్లి సీఎం క్యాంపు ఆఫీస్ వద్ద కేఏ పాల్ హల్ చల్ చేశారు. క్యాంపు ఆఫీసులో వెళ్లేందుకు ప్రయత్నించిన కేఏ పాల్ ను పోలీసులు అడ్డుకున్నారు.

కేఏ పాల్
కేఏ పాల్

KA Paul : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద హల్ చల్ చేశారు. సీఎం జగన్ కలిసేందుకు కేఏ పాల్ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. అయితే సీఎం అపాయింట్మెంట్ లేకపోవడంతో కేఏ పాల్ ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కేఏ పాల్ క్యాంప్ ఆఫీస్ సమీపంలో కూర్చున్నారు. ఈరోజంతా సీఎం జగన్ అపాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తానని భీష్మించుకుని కూర్చున్నారు. సీఎం జగన్ అపాయింట్మెంట్ ఇస్తే దీవిస్తానని, లేదంటే శపిస్తానన్నారు. కాసేపు ఎదురుచూసిన కేఏ పాల్‌ అనంతరం అక్కడి నుంచి వెనుదిరిగారు.

జగన్ మాజీ సీఎం అవుతారు

వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేద్దామని చెప్పేందుకే తాను క్యాంప్ ఆఫీసుకు వచ్చానని కేఏ పాల్ తెలిపారు. ఇవాళ, రేపు విజయవాడలోనే ఉండి సీఎం అపాయింట్మెంట్ కోసం వేచి చూస్తానన్నారు. తనను కలిసేందుకు జగన్ అనుమతి ఇవ్వకపోతే ఆయన కూడా మాజీ సీఎం అవుతారని ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 175 సీట్లు గెలుస్తుందో, 75 లేదా 25 సీట్లు గెలుస్తుందో తనకు తెలియదన్నారు. కానీ ఎంతో మంది దేశాధినేతలు, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కూడా తాను అడగ్గానే అపాయింట్మెంట్‌ ఇచ్చారన్నారు.

షర్మిలపై విమర్శలు

కేఏ పాల్ తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ...కీలక నేతలపై తరచూ విమర్శలు చేస్తుంటారు. ముఖ్యంగా ఏపీలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ విమర్శలు చేస్తూ... వార్తల్లో నిలుస్తుంటారు. కేఏ పాల్ ఏం మాట్లాడిన తెగ వైరల్ అవుతుంది. ఇటీవల వైఎస్ షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విషయంపై కేఏ పాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి చాలా పెద్ద తప్పుచేశారన్నారు. ఆస్తులు, పదవి కోసం కాంగ్రెస్ కు షర్మిల తన పార్టీని అమ్మేశారన్నారు. షర్మిలా నీకు రాజకీయాలు అవసరమా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజారెడ్డి, వైఎస్ఆర్ ఆత్మలతో తాను కమ్యూనికేట్ చేస్తున్నారన్నారు. వారు బతికి ఉంటే షర్మిల కాంగ్రెస్ లో చేరడాన్ని అడ్డుకునేవారన్నారు. సీఎం జగన్‌ను తిట్టడం, ఏపీని నాశనం చేయడం షర్మిల పని అంటూ కేఏ పాల్ విమర్శించారు.

ఒక్కొసారి కేఏ పాల్ మరింత వింతగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల సినీ హీరో వెంకటేశ్ తాజా చిత్రం సైంధవ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ విశాఖలో జరిగింది. ఈ ఫంక్షన్ వద్ద కేఏ పాల్ హల్చల్ చేశారు. ఆ ఫంక్షన్ కు తనను పిలవలేదని, అయినా లోపలికి వెళ్తానని కాసేపు గందరగోళం సృష్టించారు. అయితే బౌన్సర్లు ఆయనను లోపలకు అనుమతించలేదు. అంతకు ముందు తనపై విష ప్రయోగం జరిగిందని పది రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్నానని ఓ వీడియో రిలీజ్ చేశారు.

Whats_app_banner