Manikkam Tagore Resigned: వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్..! ఇక ఆ పదవి నుంచి ఠాగూర్ ఔటేనా..?
04 January 2023, 20:09 IST
- Telangana Congress News: టీ కాంగ్రెస్ లో మరో పరిణామం చోటు చేసుకుందా..? ఇంఛార్జ్ బాధ్యతల నుంచి ఠాగూర్ తప్పుకున్నారా..? ప్రస్తుతం ఈ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో అసలు తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది.
మాణిక్యం ఠాగూర్ రాజీనామా..?
Manikkam Tagore Resigned From TPCC Incharge: తెలంగాణ కాంగ్రెస్... గత కొంత కాలంగా అంతర్గత కుమ్ములాటలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. సీనియర్లు, జూనియర్లు అనటమే కాదు.. ఏకంగా సేవ్ కాంగ్రెస్ అనే నినాదం వచ్చే వరకు వచ్చింది కథ..! ఇంతలోనే ఢిల్లీ నుంచి డిగ్గీరాజా వచ్చినప్పటికీ పరిస్థితిలో పెద్ద మార్పులు లేనట్లే కనిపించింది. ఇక శిక్షణ తరగతులకు దాదాపు సీనియర్లు అంతా డుమ్మా కొట్టారు. ఇదిలా ఉండగానే... మరో వార్తల తెగ చెక్కర్లు కొడుతున్నాయి. టీపీసీసీ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి మాణిక్యం ఠాగూర్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ వాట్సాప్ గ్రూప్ నుంచి మాణిక్యం ఠాగూర్ వైదొలగినట్లు ప్రచారం సాగుతోంది. వాట్సాప్ గ్రూప్‌లోనే ఉన్నారని కొందరు నేతలు బయటికి చెబుతున్నప్పటికీ.. మరికొంత మంది కొద్దిరోజుల క్రితమే సాంకేతిక సమస్య వల్ల ఎగ్జిట్ అయ్యారని నేతలు అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతానికైతే మాణిక్కం ఠాగూర్ తెలంగాణ ఇంచార్జి పదవి నుంచి తప్పుకోలేదు. కేవలం వాట్పప్ గ్రూప్‌ల నుంచి మాత్రమే నిష్క్రమించారని సమాచారం. ఈ విషయాన్ని ఠాగూర్ కూడా ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. అయితే తాజా పరిస్థితులను చూస్తుంటే.. ఇవాళే రేపో ఆయన తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి పదవికి రాజీనామా చేయటం ఖాయంగానే కనిపిస్తోంది. దీనిపై హస్తం పార్టీ నుంచి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ వార్తలన్నీ నిజమేనా అనేది తేలాల్సి ఉంది.
నిజానికి సీనియర్లంతా ఠాగూర్ తీరును వ్యతిరేకిస్తూ వస్తున్నారు. రేవంత్ రెడ్డి చేతిలో ఠాగూర్ కీలుబొమ్మలా మారారని ఆరోపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ మధ్య ఢిల్లీ దూతగా వచ్చిన డిగ్గీ రాజాకు కూడా నేతలు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిసిందే. మరోవైపు నేటి కాంగ్రెస్ శిక్షణ తరగతులకు సీనియర్ నేతల్లో భట్టి విక్రమార్క, కోదండరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కీ, హనుమంత రావు, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, మహేశ్వర్ రెడ్డి, రాజనర్సింహ వంటి నేతలు రాలేదు. తాజా పరిణామాలను బట్టి చూస్తుంటే... టీ కాంగ్రెస్ లో కీలక మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.