Telangana Congress : టీఆర్ఎస్ టార్గెట్ 100 ! బీజేపీ మిషన్ 90 ! మరి కాంగ్రెస్.. ?-telangana congress far behind brs and bjp in political race ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Congress : టీఆర్ఎస్ టార్గెట్ 100 ! బీజేపీ మిషన్ 90 ! మరి కాంగ్రెస్.. ?

Telangana Congress : టీఆర్ఎస్ టార్గెట్ 100 ! బీజేపీ మిషన్ 90 ! మరి కాంగ్రెస్.. ?

HT Telugu Desk HT Telugu
Dec 30, 2022 02:56 PM IST

Telangana Congress : టీఆర్ఎస్ టార్గెట్ 100 + అంటోంది. బీజేపీ మిషన్ 90 లక్ష్యమంటోంది. కానీ.. కాంగ్రెస్ మాత్రం ఇంకా అంతర్గత సమస్యలతోనే సతమతం అవుతోంది. పొలిటికల్ రేసులో వెనకబడ్డ హస్తం పార్టీ.. వేగం పుంజుకునేనా ?

కాంగ్రెస్ తీరు మారేనా ?
కాంగ్రెస్ తీరు మారేనా ?

Telangana Congress : తెలంగాణలో రెండు పార్టీల్లో జోష్ కనిపిస్తోంది. మళ్లీ అధికారం నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్.. ఎలాగైనా ప్రగతి భవన్ లో పాగా వేసేందుకు బీజేపీ.. పోటా పోటీ విమర్శలు, వ్యూహ ప్రతివ్యూహాలతో దూసుకుపోతున్నాయి. రెండు పార్టీలు... అందివచ్చిన అవకాశాలను, చోటుచేసుకుంటున్న పరిణామాలను రాజకీయ ఎదుగదల కోసం సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ద్వారా ఒకరిని మరొకరు కార్నర్ చేస్తూ.. పాలిటిక్స్ చేస్తున్నారు. డ్రగ్స్ కేసు, దిల్లీ మద్యం కుంభకోణం కేసులపై మాటల యుద్దానికి దిగారు. రీచ్ ఎక్కువగా ఉండే.. రైతు అంశాన్ని రెండు పార్టీలు ఎత్తుకున్నాయి. ఉపాధి హామీ నిధుల విషయంలో కేంద్ర వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్... రుణమాఫీ పూర్తి చేయడం లేదని ఆరోపిస్తూ బీజేపీ... పోటా పోటీ ధర్నాలు నిర్వహించాయి. నిత్యం వార్తల్లో నిలిచే తీరుతో.. రాష్ట్రంలో ప్రధాన పోరు.. ఈ రెండు పార్టీల మధ్యే ఉందన్నట్లుగా పరిస్థితిని మార్చేశాయి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా.. ఈ సారైనా అధికారంలోకి రావాలని ఆశిస్తోన్న కాంగ్రెస్ ను మాత్రం.. ఇంకా ఇంటి పోరు వేధిస్తోంది. ప్రత్యర్థి పార్టీలు లక్ష్యం బాటలో ఇప్పటికే కొంత దూరం చేరగా.... హస్తం టీం మాత్రం ఇంకా రేసు మొదలుపెట్టలేదు !

బీఆర్ఎస్ టార్గెట్ క్లియర్ గా ఉంది. ఎలాగైనా, ఏం చేసైనా.. ఈ సారి 100 సీట్లు సాధించాలన్న వ్యూహంతో.. గులాబీ దళం పావులు కదుపుతోంది. ఈ దిశగా సీఎం కేసీఆర్ ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. బాస్ నుంచి ఆర్డర్ అందుకున్న ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్లానింగ్ మొదలు పెట్టారు. ఇన్నాళ్లు నియోజకవర్గాల్లో తమకు వ్యతిరేకంగా పనిచేసిన ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తున్నారు. వ్యతిరేక వర్గంలో పేరున్న లీడర్లను కారెక్కిస్తున్నారు. తద్వారా.. ఎన్నికల నాటికి సమీకరణాలన్నీ తమకు అనుకూలంగా ఉండేలా చూసుకుంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ఏ స్థానంలో ఎవరు పోటీ చేస్తారన్న అంశంలో ఇప్పటికీ స్పష్టత లేకపోవడం... బీఆర్ఎస్ కు కలిసివస్తోంది. ఆయా పార్టీల నుంచి అభ్యర్థులు ఖరారయ్యేలోపు గ్రౌండ్ మొత్తం గులాబీమయం చేస్తే.. తమకు తిరుగుండదన్నది... అధికార పార్టీ ఎమ్మెల్యేల వ్యూహంగా కనిపిస్తోంది.

కేసీఆర్ ను గద్దె దించే శక్తి తమకే ఉందంటున్న బీజేపీ... స్థానిక బలాబలాలు ఎలా ఉన్నా.. భారీ వ్యూహాలనే సిద్ధం చేసుకుంది. మిషన్ 90 లక్ష్యంగా నిర్దేశించుకుని.. ప్రణాళికలు అమలు చేస్తోంది. ఇదే లక్ష్యంతో డిసెంబర్ 29న హైదరాబాద్ లో విస్తారక్ ల సమావేశం నిర్వహించింది. బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బి.ఎల్. సంతోష్ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై... నేతలకు దిశానిర్దేశం చేశారు. 90 సీట్లతో అధికారం బీజేపీదే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇదే వేదికగా విశ్వాసం వ్యక్తం చేశారు. టార్గెట్ ని రీచ్ అయ్యేందుకు 10 నెలల రోడ్ మ్యాప్ సైతం రూపొందించుకొంది.. తెలంగాణ బీజేపీ. సంక్రాంతి తర్వాత నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర.. ముఖ్య నేతలతో 10 వేల స్ట్రీట్ కార్నర్ సమావేశాలు.. ఫిబ్రవరిలో అసెంబ్లీ స్థాయి సమావేశాలు.. ఆ తర్వాత ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో బహిరంగ సభలు. ఇలా.. పక్కా ప్లానింగ్ తో బీజేపీ .. తెలంగాణలో పాగా వేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. బూత్ లెవల్ నుంచి క్యాడర్ పెంచుకోవడంపై దృష్టి సారించింది. దీని కోసం ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించిన కమలం నేతలు... ఈ వ్యూహాన్ని ఇంకా వేగంగా అమలు చేసేందుకు సమాయత్తమవుతున్నారు.

ఇలా... బీఆర్ఎస్, బీజేపీ దూకుడు రాజకీయాలతో జోరు చూపిస్తుంటే... ప్రతిపక్ష కాంగ్రెస్ లో మాత్రం అదే నిస్తేజం. బీఆర్ఎస్ టార్గెట్ 100. బీజేపీ మిషన్ 90. మరి కాంగ్రెస్.. ? గతమెంతో ఘనమైన కాంగ్రెస్ కు .. ఈ అంశంలో ఇప్పటికీ ఓ స్పష్టత అంటూ లేకపోవడం... శ్రేణులను నిరాశకు గురిచేస్తోంది. ఉద్ధండులతో కూడిన పార్టీకి.... అధికార పక్షాన్ని ఢీకొట్టేందుకు కావాల్సిన సంపూర్ణ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కానీ.. ఆ బలాన్ని ప్రజా క్షేత్రంలో వినియోగించేందుకు కావాల్సిన ఐక్యతే.. నేతల మధ్య కొరవడింది. పార్టీ పూర్వ వైభవం కోసం పాటుపడాల్సింది పోయి.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. పార్టీ భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేస్తున్నారు. టీపీసీసీ కమిటీలు రేపిన కలకలం.. సీనియర్ల సేవ్ కాంగ్రెస్ నినాదం... ఢిల్లీ దూత దిగ్విజయ్ సింగ్ చర్చల మంత్రాంగం.. వెరసి, తర్వాత ఏం జరుగుతుందో, టీ కాంగ్రెస్ ఎలా ముందుకుపోతుందో అన్న విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. హాత్ సే హాత్ జోడో యాత్రను తెలంగాణలో జనవరి చివరి వారం నుంచి జూన్ 2 వరకు చేపట్టి... రాష్ట్రంలోని దాదాపు అన్ని నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంకల్పించారు. ఇప్పటికే తలోదిక్కు అయిన హస్తం పార్టీలో... రేవంత్ పాదయాత్రకు నేతల నుంచి ఎంత మద్దతు లభిస్తుందనేది చూడాలి !

బీఆర్ఎస్, బీజేపీ... విజన్, మిషన్ ల కు ధీటుగా... త్వరలో కాంగ్రెస్ కూడా ఐక్యతతో కూడిన టార్గెట్ నిర్దేశించుకుంటుందా ? క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తల బలాన్ని కాపాడుకుంటుందా ? బీజేపీ, బీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ ను తట్టుకొని నిలుస్తుందా ? 2023లో తెలంగాణ పొలిటికల్ గేమ్ ఎన్ని మలుపులు తిరగనుంది ?

Whats_app_banner