రచ్చ చేయొద్దు.. కాంగ్రెస్ నేతలకు మాణిక్కం ఠాగూర్ సూచన
తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ ఆ పార్టీ నేతలకు కీలక సూచన చేశారు. మీడియాకు ఎక్కి రచ్చ చేయొద్దని స్పష్టం చేశారు.
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ట్విటర్ ద్వారా ఓ సందేశం పంపించారు ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్. కాంగ్రెస్ అధినేత్రి అభిప్రాయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నానని చెప్పారు. తమలో తాముగానీ, ఏఐసీసీతోగానీ మీడియా ద్వారా మాట్లాడవద్దని ప్రతి ఒక్క కాంగ్రెస్ నేతను కోరుతున్నట్లు ఆయన తెలిపారు. అందరం కలిసి కట్టుగా పనిచేస్తేనే 2023లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చెప్పిన మాటల తాలూకు రిపోర్ట్‌ను తన ట్వీట్‌లో యాడ్ చేశారు. తనతో మీడియా ద్వారా మాట్లాడాల్సిన అవసరం లేదని సోనియా చెప్పినట్లు అందులో ఉంది. "మనమంతా స్వేచ్ఛగా, నిజాయతీగా చర్చించుకుందాం. అయితే ఈ నాలుగు గోడల మధ్య మాట్లాడేది మాత్రం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సంయుక్త నిర్ణయం అయి ఉండాలి" అని సోనియా చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా మాణిక్కం ఠాగూర్ గుర్తు చేశారు.
కాంగ్రెస్‌కు జగ్గారెడ్డి రాజీనామా చేయబోతున్నారన్న విషయంలో కొంతకాలంగా ఆయనకు, పార్టీ నేతలకు మధ్య మాటలయుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. తనపై కోవర్ట్‌గా ముద్ర వేస్తున్నారని జగ్గారెడ్డి వాపోయారు. త్వరలోనే తాను కాంగ్రెస్‌కు రాజీనామా చేయబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.