తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ktr On Mlcs : గవర్నర్ గారు...వాళ్లను తిరస్కరించి.. వీరిని ఎలా ఆమోదించారు..?

KTR On MLCs : గవర్నర్ గారు...వాళ్లను తిరస్కరించి.. వీరిని ఎలా ఆమోదించారు..?

26 January 2024, 16:18 IST

google News
    • KTR On Governor Tamilisai : రాష్ట్ర గవర్నర్ పై ప్రశ్నలవర్షం కురిపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గత ప్రభుత్వంలో మంత్రివర్గం సిఫార్సు చేసిన అభ్యర్థులను పక్కనపెట్టి.. ఇవాళేమో ఆగమేఘాల మీద ఎలా సంతకం చేశారో గవర్నర్ చెప్పాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Twitter)

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

KTR On Governor Tamilisai: గవర్నర్ వ్యవహరిస్తున్న పక్షపాత తీరును తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శుక్రవారం తెలంగాణ భవన్ లో మాట్లాడిన ఆయన.... తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన దాసోజు శ్రవణ్, ఎరుకల సామాజిక వర్గానికి చెందిన సత్యనారాయణను గత ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తే... రాజకీయపరమైన సంబంధాలు ఉన్నాయని చెప్పి వారి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారని గుర్తు చేసారు. కానీ ఈరోజు వస్తున్న వార్తల ప్రకారం ఒక పార్టీ అధ్యక్షులుగా ఉన్న కోదండరాంను ఎలా ఆమోదిస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి లెటర్ రాగానే ఆగమేఘాల మీద ఎలా సంతకం చేసారో గవర్నర్ చెప్పాలని డిమాండ్ చేశారు.

"తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న శ్రవణ్ , సామాజిక ఉద్యమంలో పాల్గొన్న సత్యనారాయణకు రాజకీయ నేపథ్యం అడ్డంకి అయితే ఎన్నికల్లో పోటీ చేసిన కోదండరాంను ఏ రకంగా ఆమోదించారో ప్రజలకు గవర్నర్ వివరించాలి. రాష్ట్ర ప్రజలు ఇచ్చే జీతంతో గవర్నర్ పనిచేస్తున్నారు.. రాజ్ భవన్ నడుస్తున్నది.. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీరు బాధ్యులు రేవంత్ రెడ్డికి కాదు రాష్ట్ర ప్రజలకి బాధ్యులు అనే విషయం గుర్తుంచుకోవాలి. ఆనాడు కనిపించిన రాజకీయ నేపథ్యంకు ఉన్న అభ్యంతరాలు ఈరోజు ఎందుకు కనిపించడం లేదు..? కాంగ్రెస్, బీజేపీ కి ఉన్న ఫెవికాల్ బంధం మేరకు నిర్ణయం తీసుకున్నారా అనే విషయం చెప్పాలి. ఈ నామినేషన్ల అంగీకారం కాంగ్రెస్ - బీజేపీ కుమ్మక్కును తెలియజేస్తుంది" అంటూ కామెంట్స్ చేశారు కేటీఆర్.

ప్రతిపక్షంలోనే ఉన్నామనుకుంటున్నారు…

సర్పంచుల పదవీకాలం పొడిగించాలని కోరారు కేటీఆర్. "ప్రజల తరఫున ఎన్నికైన సర్పంచుల పదవీకాలం పొడగించాలి.. కాని ప్రత్యేక ఇంచార్జీలను పెట్టవద్దని డిమాండ్ చేస్తున్నాం. ప్రజాపాలన అంటే ప్రజలతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు పాలన చేయాలి కానీ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక ఇంచార్జీలు కాదని కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవాలి. రెండు సంవత్సరాల పాటు కరోనా సమయంలో వారి పరిపాలన సమయం పోయింది.. కాబట్టి పదవి కాలాన్ని ఆరు నెలలు లేదా సంవత్సరం మేర పొడిగించాలి. లేదా తిరిగి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే వరకు వారి కాలాన్ని పొడిగించాలి. కేవలం మంత్రులు అందుబాటులో లేరు, కొత్తగా ఎన్నికైన మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందుబాటులో లేరు అంటూ సర్పంచులు పూర్తి చేసిన కార్యక్రమాల ప్రారంభాన్ని కూడా ఈ ప్రభుత్వం అడ్డుకుంటుంది. మంచి పదవిలో కూర్చోబెట్టినంత మాత్రాన నీచ మానవులు తమ బుద్ధి మారరని అప్పుడే చెప్పారు. రేవంత్ రెడ్డి అహంకారం, వేకిలి వ్యవహారం చూస్తుంటే వాళ్లు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నామనుకుంటున్నారు. మేము ఇంకా అధికారంలో ఉన్నామనుకొని మమ్మల్ని ఆడిపోసుకుంటున్నారు. మీకు చేతనైతే ఇచ్చిన 420 అమలుపరచండి. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరచండి" అని కేటీఆర్ అన్నారు.

"కాంగ్రెస్ - బీజేపీ కుమ్మక్కు ప్రజలందరికీ తెలుస్తున్నది. ఒకే రోజు రాజీనామా చేసిన ఎమ్మెల్సీలకు ఒకటే బులిటిన్ ద్వారా రాజీనామా ఆమోదించారు. ఒకటే కోటా కింద ఉన్న ఎమ్మెల్సీలకి వేరువేరుగా ఎన్నికలు నిర్వహించారు. రేవంత్ రెడ్డి పోయి అమిత్ షాను కలవగానే ఓకే ఎన్నిక కాకుండా వేరువేరుగా ఎన్నికలు జరిగేటట్టు నిర్వహించారు. ఒకేసారి ఎన్నిక జరిగితే ఒకటి బీఆర్ఎస్ కి, మరొకటి కాంగ్రెస్ కి వచ్చేది. బీజేపీ కాంగ్రెస్ కి జాకీలు పెట్టి మద్దతుగా నిలుస్తున్నది. కాంగ్రెస్ - బిజెపికి ఫెవికాల్ బంధమని ప్రజలకు తెలుస్తుంది. బండి సంజయ్ కూడా మొన్న కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకోవద్దు బీఆర్ఎస్ అంతం చూద్దామని చెప్పారు. నిన్న గుంపు మేస్త్రి కూడా ఇదే మాట చెప్పారు" అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.

తదుపరి వ్యాసం