KTR : అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ వాళ్లు కూడా కలగనలేదు- కేటీఆర్ సెటైర్లు-hyderabad news in telugu brs leader ktr satires on congress govt ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ktr : అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ వాళ్లు కూడా కలగనలేదు- కేటీఆర్ సెటైర్లు

KTR : అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ వాళ్లు కూడా కలగనలేదు- కేటీఆర్ సెటైర్లు

HT Telugu Desk HT Telugu
Jan 22, 2024 04:22 PM IST

KTR : అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ వాళ్లు కూడా కలగనలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అందుకే ఇష్టమొచ్చినట్టు హామీలు గుప్పించారన్నారు. ఇచ్చిన హామీలకు కాంగ్రెస్ పంగనామాలు పెట్టే ప్రయత్నం చేస్తుందని అయినా తాము వదిలిపెట్టేది లేదన్నారు.

కేటీఆర్
కేటీఆర్

KTR : హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో నల్లగొండ లోక్ సభ నియోజకవర్గ సన్నాహాక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... జనవరి 3న ఆదిలాబాద్ తో ప్రారంభమైన సమావేశాలు నేడు నల్లగొండతో ముగుస్తున్నాయన్నారు. నేటితో మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాల సమావేశాలు పూర్తవుతున్నాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కథానాయకులు అని వ్యాఖ్యానించారు. పార్టీ కార్యకర్తల వల్లే ఇన్నేళ్లుగా పార్టీ బలంగా ఉందన్నారు. గత 16 సమావేశాల తీరు చూస్తే కార్యకర్తలే పార్టీకి ధైర్యం చెప్పారని ఆయన వివరించారు. నల్లగొండలో ఎన్నికల ప్రచార సరళి తమకు అనుకూలంగా ఉన్నట్టే అనిపించిందని.... ఎక్కడా ఓటమిపై తమకు అనుమానాలు రాకపోయినప్పటికీ ఎన్నికల ఫలితాలు మరోలా వచ్చాయన్నారు.

అసత్య ప్రచారాన్ని గట్టిగా తిప్పి కొట్టలేకపోయం- కేటీఆర్

పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురైందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారని కేటీఆర్ అన్నారు. ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని....ఈ పార్లమెంట్ సన్నాహాక సమావేశాలు ఆరంభం మాత్రమేనన్నారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలు ప్రారంభం అవుతాయని కేటీఆర్ తెలిపారు. సోషల్ మీడియాలో జరిగిన అసత్య ప్రచారాన్ని తాము గట్టిగా తిప్పికొట్టలేకపోయామన్నారు. అవతలి వాళ్లు అభూత కల్పనలు, అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించారాని ఆరోపించారు. తాము ఇంకా మాట్లాడటం మొదలు పెట్టనే లేదు....కాంగ్రెస్ వాళ్లు ఇప్పటికే ఉలికి పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడే ఇలా ఉంటే కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఇంకెలా ఉంటుందో ఊహించుకోండన్నారు. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ వాళ్లు కూడా కలగనలేదు. అందుకే ఇష్టమొచ్చినట్టు హామీలు గుప్పించారన్నారు. ఇచ్చిన హామీలకు కాంగ్రెస్ పంగనామాలు పెట్టే ప్రయత్నం చేస్తుందని.....అయినా తాము వదిలిపెట్టేది లేదన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు రేవంత్ రెడ్డి అడ్డమైన మాటలు చెప్పారు. కార్యకర్తలు ఉదాసీన వైఖరి మీమాంస వీడాలి......ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడారు. ఇపుడేం చేస్తున్నారో ప్రజలకు విడమరచి చెప్పాలని కేటీఆర్ సూచించారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గత నవంబర్ లోనే కరెంటు బిల్లులు కట్టవద్దని చెప్పారనీ, నల్గొండ ప్రజలు బిల్లులు కట్టకుండా కోమటి రెడ్డికే పంపాలన్నారు. సాగర్ ఆయకట్టుకు కాంగ్రెస్ పాలనలో మొదటి సారి క్రాప్ హాలీడే ప్రకటించే దుస్థితి దాపురించిందన్నారు.

కేసీఆర్ పై ప్రజల్లో సానుభూతి వెల్లువలా ఉంది

"కృష్ణా రివర్ బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించి తెలంగాణ జుట్టును కాంగ్రెస్ కేంద్రం చేతిలో పెడుతోంది. శ్రీ రాంసాగర్ చివరి ఆయకట్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఎండ బెడుతోంది. కరెంటు కోతలు అప్పుడే మొదలు అయ్యాయి. కాంగ్రెస్, బీజేపీ అక్రమ బంధం నల్లగొండ మున్సిపాలిటీ అవిశ్వాసంలో బయటపడింది. రేవంత్ భుజం మీద తుపాకీ పెట్టి మోదీ బీఆర్ఎస్ ను కాలుస్తారట. మైనారిటీ సోదరులకు కాంగ్రెస్ బీజేపీ అక్రమ సంబంధం గురించి చెప్పాలి. రాహుల్ అదానీని దొంగ అన్నారు రేవంత్ దొర అంటున్నాడు. కేసీఆర్ పై ప్రజల్లో సానుభూతి వెల్లువలా ఉంది....ఈ పరిస్థితిని పార్లమెంటు ఎన్నికల్లో సానుకూలంగా మలచుకోవాలి. కాంగ్రెస్ కు ఇప్పటికే అనేక వర్గాలు దూరం అయ్యాయి. నల్లగొండ పార్లమెంటు ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి గెలుద్దామని" కేటీఆర్ పిలుపునిచ్చారు.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

Whats_app_banner