Telangana MLCs : గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరామ్ కు ఎమ్మెల్సీ పదవి..!-professor kodandaram appointed as mlc in governor quota ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Mlcs : గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరామ్ కు ఎమ్మెల్సీ పదవి..!

Telangana MLCs : గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరామ్ కు ఎమ్మెల్సీ పదవి..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 25, 2024 10:43 PM IST

Telangana Governor quota MLCs : గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరామ్ కు ఎమ్మెల్సీ పదవికి దక్కింది. ఈ మేరకు గవర్నర్ తమిళిసై నిర్ణయం తీసుకున్నారు.

 ప్రొఫెసర్ కోదండరామ్
ప్రొఫెసర్ కోదండరామ్ (TJS Facebook)

Telangana Governor Quota MLCs: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై గవర్నర్ తమిళిసై నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, అమరుల్లాఖాన్ పేర్లను సర్కార్ సిఫార్సు చేయగా… గవర్నర్ ఆమోదముద్ర వేశారు. వీరిద్దరి నియమకానికి సంబంధించి రాజ్ భవన్ నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉంది.

ఒకప్పుడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో బిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు సహచరుడిగా, ఉద్యమానికి నాయకత్వం వహించిన తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (TJAC)కి నేతృత్వం వహించిన కోదండరామ్, ఆ తర్వాత బిఆర్ఎస్ విధానాలతో విభేదించి తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించారు.

2018 ఏప్రిల్ లో కోదండరామ్ తెలంగాణ జనసమితి (టీజేఎస్) అనే ప్రాంతీయ పార్టీని స్థాపించారు. 2018 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐలతో పొత్తు పెట్టుకుని పోటీ చేశారు. కానీ ఆయన పార్టీ ఎన్నికల్లో ఎలాంటి ముద్ర వేయలేక ఆ తర్వాత నిర్వీర్యమైంది. అయితే కోదండరామ్ మాత్రం తన వ్యక్తిగత హోదాలో ప్రజల కోసం పోరాడుతున్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోదండరామ్ కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కోదండరాం సేవలను తమ ప్రభుత్వం సక్రమంగా వినియోగించుకుంటుందని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చి గౌరవిస్తామని, ఆయన పరిజ్ఞానాన్ని తెలంగాణ అభివృద్ధికి వినియోగిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటన కూడా చేశారు.

ఇటీవలే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎంపిక కూడా జరిగింది. ఈ కోటాలో మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ఎంపికయ్యారు. ఇతర పార్టీ అభ్యర్థులు ఎవరూ కూడా బరిలో ఉండకపోవటంతో… వీరి ఎంపిక ఏకగ్రీవమైంది.

ఇదిలా ఉంటే…. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మెన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరు ఖరారైంది. ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు గవర్నర్ మిళసై సౌందర రాజన్ ఆమోదముద్ర వేశారు. దీంతో ఆయన టీఎస్పీఎస్సీ కొత్త ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి ఛైర్మన్ గా ఘంటా చక్రపాణి పని చేశారు. ఆ తర్వాత ఐఏఎస్ అధికారి జనార్థన్ రెడ్డి పని చేశారు. ఇటీవలే జనార్థన్ రెడ్డితో పాటు పలువురు సభ్యులు రాజీనామా చేశారు. వీటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం…. అర్హతగల వారి నుంచి దరఖాస్తులను స్వీకరించింది.

ప్రభుత్వ ప్రకటనకు అనుగుణంగా…. దాదాపు 600 మంది ఛైర్మన్ తో పాటు సభ్యుల పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఫ్రొఫెసర్లతో పాటు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ లు ఉన్నారు.ఎక్కువ సంఖ్యలో ప్రొఫెసర్స్ దరఖాస్తు చేశారు. సభ్యుల కోసం దాదాపు 300 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిని పరిశీలించిన ప్రభుత్వం….. టిఎస్‌పిఎస్సీ ఛైర్మన్‌ పదవి కోసం మొత్తం ముగ్గురు పేర్లను ప్రధానంగా పరిగణలోకి తీసుకున్నట్లు తెలిసింది. వీటిలో తెలంగాణ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డితో పేరును ఖరారు చేసి… రాజ్ భవన్ కు పంపింది. ప్రభుత్వ ప్రతిపాదనలకు పరిశీలించిన గవర్నర్…. మహేందర్ రెడ్డి పేరుకు ఆమోదముద్ర వేశారు.

Whats_app_banner