తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Dgp Jitender : తెలంగాణలో మావోయిస్టుల సమస్య లేదు, సైబర్ క్రైమ్ బ్యూరోతో రూ.85 కోట్లు రికవరీ- డీజీపీ జితేందర్

DGP Jitender : తెలంగాణలో మావోయిస్టుల సమస్య లేదు, సైబర్ క్రైమ్ బ్యూరోతో రూ.85 కోట్లు రికవరీ- డీజీపీ జితేందర్

HT Telugu Desk HT Telugu

20 August 2024, 22:16 IST

google News
    • DGP Jitender : తెలంగాణలో మావోయిస్టుల సమస్య లేదని డీజీపీ జితేందర్ అన్నారు. రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. సైబర్ క్రైమ్ బ్యూరో ద్వారా రూ.85 రికవరీ చేసి బాధితులకు అప్పగించామన్నారు.
తెలంగాణలో మావోయిస్టుల సమస్య లేదు, సైబర్ క్రైమ్ బ్యూరోతో రూ.85 కోట్లు రికవరీ- డీజీపీ జితేందర్
తెలంగాణలో మావోయిస్టుల సమస్య లేదు, సైబర్ క్రైమ్ బ్యూరోతో రూ.85 కోట్లు రికవరీ- డీజీపీ జితేందర్

తెలంగాణలో మావోయిస్టుల సమస్య లేదు, సైబర్ క్రైమ్ బ్యూరోతో రూ.85 కోట్లు రికవరీ- డీజీపీ జితేందర్

DGP Jitender : మావోయిస్టులా...ఎక్కడ..అంటూ తెలంగాణ డీజీపీ జితేందర్ ఆశ్చర్యకంగా ప్రశ్నించారు. తెలంగాణలో మావోయిస్టు లేరని బయటి రాష్ట్రాలకు వెళ్లిపోయారని స్పష్టం చేశారు. నక్సల్స్, ఫేక్ నక్సల్స్ సమస్య లేదని తేల్చి చెప్పారు.‌ గంజాయి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. సైబర్ నేరాల నివారణకు ఎక్కడ లేని విధంగా తెలంగాణలో సైబర్ క్రైమ్ బ్యూరో ఏర్పాటు చేశామని చెప్పారు. సైబర్ క్రైమ్ బ్యూరో ఏర్పాటు చేసిన తర్వాత రూ.85 కోట్లు రికవరీ చేసి బాధితులకు అప్పగించామన్నారు.

కరీంనగర్ లో పర్యటించిన డీజీపీ జితేందర్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్ మూడు జిల్లాల పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నివారణపై పోలీసులు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు.‌ క్రైమ్ రేట్ తగ్గించేందుకు దిశానిర్దేశం చేశారు. సమీక్ష అనంతరం ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, కరీంనగర్ సీపీ అభిషేక్ మోహంతి, సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్, జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి డీజీపీ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అందరికీ రక్షణ ఇవ్వడానికి, శాంతిభద్రతల పరిరక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకోవడంతో క్రైమ్ రేట్ తగ్గిందన్నారు.

సైబర్ క్రైమ్ బ్యూరో తో రూ.85 కోట్లు రికవరీ

రోజు రోజుకు సైబర్ క్రైమ్ నేరాలు పెరుగుతుండడంతో దానిపై తెలంగాణలో ప్రత్యేక చర్యలు చేపట్టామని డీజీపీ జితేందర్ తెలిపారు.‌ ఎక్కడ లేని విధంగా తెలంగాణలో సైబర్ క్రైమ్ బ్యూరో ఏర్పాటు చేశామని చెప్పారు. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు దోచుకున్న రూ.85 కోట్లు రికవరీ చేసి బాధితులకు అప్పగించామని చెప్పారు.‌ కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే కోటి 64 లక్షలు రికవరీ చేశామన్నారు. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఎవరైనా సైబర్ నేరగాళ్ల బారిన పడితే వెంటనే సైబర్ క్రైమ్ బ్యూరోకు సమాచారం ఇచ్చేలా 1930 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామని తెలిపారు.‌ ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ బ్యూరో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశామని తెలిపారు.

గంజాయి రహిత రాష్ట్రంగా తెలంగాణ

తెలంగాణను డ్రగ్స్ గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని డీజీపీ జితేందర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గంజాయి డ్రగ్స్ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో నిఘా పెంచామని చెప్పారు. మాదకద్రవ్యాల వినియోగం అమ్మకాల నియంత్రణకు నార్కోటిక్స్ విషయంలో సీనియర్ అధికారులతో బ్యూరో ఏర్పాటు చేశామని తెలిపారు. తద్వారా రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ కొంత వరకు తగ్గిందన్నారు. ఇంకా దానిపైన చాలా గట్టిగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సీఎం ఈ విషయంలో సీరియస్ గా ఉన్నారని చెప్పారు.

రౌడీ షీటర్ల పట్ల కఠినంగా వ్యవహరించాలి

శాంతి భద్రతల సమస్యలను అధిగమించేందుకు యాక్షన్ ప్లాన్ కలిగి ఉండాలన్నారు. రౌడీ షీటర్లు , హిస్టరీ షీటర్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. విచారణ చాలా శాస్త్రీయ పద్దతిలో జరగాలని ఆదేశించారు.‌ సాక్ష్యాధారాలను పక్కాగా సేకరించాలన్నారు. కేసులు ట్రయల్స్ కి వచ్చినపుడు కేసు తీవ్రతను బట్టి అవసరమైతే డీఎస్పీలు సైతం కోర్టులకు వెళ్లి కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా వ్యవరించాలన్నారు. సీసీ కెమెరాలు నేర పరిశోధన, నియంత్రణలో ఎంతగానో ఉపయోగపడతాయని ప్రజలకు వాటి ప్రాముఖ్యతను తెలిపి అన్నిచోట్ల వాటిని ఏర్పాటు చేసుకునేలా చూడాలన్నారు.

గతంలో జరిగిన సంఘటనల ఆధారంగా మతపరమైన సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి కనబరచాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ తెలిపారు.‌ రాష్ డ్రైవింగ్ మైనర్ల విషయంలో చర్యలు తీసుకొంటున్నామని, పేరెంట్స్ కూడా కేర్ తీసుకోవాలని కోరారు.‌ పోలీస్ డిపార్ట్మెంట్ కు బడ్జెట్ సమస్య లేదన్నారు. అవసరం ఉంటే తప్పకుండా ప్రభుత్వాన్ని అడుగుతామన్నారు. 50 వేల నోటిఫికేషన్ ఇవ్వగా 30 వేల మంది ట్రైనింగ్ లో ఉన్నారని, రెండు మూడు నెలల్లో వాళ్లు వస్తారని, సిబ్బంది కొరత తీరుతుందన్నారు. ఫోన్ టాపింగ్ పై ఇప్పుడు నేను ఏమి చెప్పలేను... మీకు జరుగుతున్న సంగతులు అన్నీ తెలుసని సున్నితంగా తప్పించుకున్నారు.

రిపోర్టింగ్ : కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

తదుపరి వ్యాసం