Karimnagar Mother: ఆస్తులు పంచుకుని అమ్మను గెంటేశారు, ఆదరించి కొడుకులకు బుద్ది చెప్పిన సిఐ
16 August 2024, 5:51 IST
- Karimnagar Mother: నవ మాసాలు మోసింది,పేగు తెంచుకుని ఇద్దరు కొడుకులు పుట్టగానే సంబర పడి పోయింది. పెంచి పెద్ద చేసి ప్రయోజకుల్ని చేసింది. కట్టుకున్న భర్త కాలం చేయడంతో ఆస్తినంతా కొడుకులకు అప్పగించింది. వృద్దాప్యంతో కొడుకుల వద్ద కాలం వెళ్ళదీసే ఆ తల్లిని ఇంట్లో నుంచి గెంటేశారు.
తల్లిని ఇంట్లో నుంచి గెంటేసిన తనయులు, ఆదరించిన సీఐ
Karimnagar Mother: అమ్మ కు అన్నం పెట్టకుండా తండ్రీ ఫోటోతో సహా బయట పడేసిన దుర్మార్గపు ఘటన కరీంనగర్‌లో జరిగింది.
అమ్మకు బుక్కెడు బువ్వ పెట్టడానికి వంతుల వారిగా చూసుకునే కొడుకులు గడువు ముగిసిందని ఇంటి నుంచి ఓ కొడుకు వెల్లగొడితే మరో కొడుకు తల్లిని చూసుకోవాల్సి వస్తుందని ఇంటికి తాళం వేసుకుని వెళ్ళిపోయాడు. రోడ్డున పడ్డ అమ్మ బతుకును చూసి చలించిపోయిన సిఐ ఆ అమ్మను ఆదరించి ఆశ్రయం కల్పించారు.
పేగు బంధానికి అర్థం లేకుండా చేసిన కొడుకులు...కలకలం సృష్టించిన ఈఘటన కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వెల్ది గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వడ్లూరి మల్లమ్మ (75)కు ఇద్దరు కొడుకులు కిష్టయ్య, కిరణ్ కుమార్.
భర్త కనకయ్య ఏడాది క్రితం మృతి చెందడంతో వంతుల వారిగా అమ్మ బాగోగులు చూసుకోవాలని కొడుకులు ఇద్దరు భావించారు. తండ్రి మరణించిన తరువాత వారి ద్వారా సంక్రమించిన భూమి ఇల్లు ఇతర ఆస్థులను వాటాలుగా పంచుకున్న తనయులు తల్లిని చూసుకునేందుకు కూడా వంతులు వేసుకున్నారు.
దీంతో బుధవారం తల్లి తన వద్ద ఉండేందుకు గడువు ముగిసిందని తన ఇంటి నుండి పంపించి మరో కొడుకు వద్దకు వెళ్లాలని చెప్పాడు. ఆదరించాల్సిన రెండో కొడుకు అమ్మ ఇంట్లోకి రాక ముందే ఇంటికి తాళం వేసుకుని వేరే చోటకు వెళ్ళి పోయాడు. ఏ కొడుకు ఇంట్లోకి ఆహ్వానించకుడా చివరకు తండ్రి ఫోటోను కూడా బయట పడేశారు.
కొడుకుల తీరుతో తల్లి కన్నీటి పర్యంతమై ఇంటిముందు రోడ్డుపై ఉండే పరిస్థితి ఏర్పడింది. గ్రామస్థులు అయ్యే పాపం అంటు కొడుకుల తీరు, వృద్దతల్లి పరిస్థితిపై మానకొండూరు సిఐ సదన్ కుమార్ దృష్టికి తీసుకెళ్ళారు. వెంటనే స్పందించిన సిఐ మల్లమ్మ ను చేరదీసి, ఆమె కుటుంబసభ్యులను పిలిచి మందలించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.
గురువారం వెల్ది గ్రామానికి వెళ్ళిన సీఐ తాళం వేసి ఉన్న ఇంట్లో మల్లమ్మను దింపి బాగోగులు చూసుకోకపోతే తనకు సమాచారం ఇవ్వాలని కోరారు. తండ్రి సంపాదించిన ఆస్తిని పంచుకున్న కొడుకులు తల్లిని చూసుకోకపోవడం ఏంటని సీఐ తనయులిద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను చూసుకోకపోతే మల్లమ్మకు తాను అండగా నిలుస్తానని, ఆమె ఖర్చులన్ని భరిస్తానని మాట ఇచ్చారు.
సీనియర్ సిటిజన్స్ యాక్ట్...
తల్లిదండ్రుల బాగోగులు చూసుకోని కొడుకులపై సీనియర్ సిటిజన్ యాక్ట్ అమలు చేస్తామని మానకొండూరు సీఐ సదన్ కుమార్ స్పష్టం చేశారు. పేరెంట్స్ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరించారు. నవమాసాలు మోసి, పెంచి పోషించిన తల్లి బాగోగులు చూసుకునేందుకు వివక్ష ప్రదర్శిస్తున్న తీరు సరికాదన్నారు.
అమ్మకు బుక్కెడు అన్నం పెట్టడానికి వంతులు వేసుకున్న కొడుకులను కనెటప్పుడు కానీ, పెంచి పెద్ద చేసేప్పుడు కానీ మీ తల్లి వంతులు వేసుకుందా? అని ప్రశ్నించారు. తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఊరుకునేది లేదన్నారు.
తనయులు ఇద్దరు పంచుకున్న ఆస్తి కూడా తండ్రి ద్వారా సంక్రమించిందే కాబట్టి సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అమలు చేసి ఆస్తులపై మల్లమ్మకే పూర్తి హక్కులు కల్పించేందుకు చొరవ తీసుకుని ఆమె జీవితానికి భరోసా కల్పిస్తామని సీఐ సదన్ కుమార్ తెలిపారు. మల్లమ్మ పరిస్థితే కాదు, ఏ తల్లికైనా, తండ్రికైనా ఇలాంటి పరిస్థితి ఎదురైతే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. సిఐ జోక్యంతో ప్రస్తుతం మల్లమ్మ తనయుల వద్ద చేరదీరే పరిస్థితి ఏర్పడింది.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)