తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cyber Crime : ట్రెండ్ మార్చిన సైబర్ నేరాగాళ్లు-బిర్యానీ, పాస్ట్ ఫుడ్ ఆర్డర్లతో టోకరా

Cyber Crime : ట్రెండ్ మార్చిన సైబర్ నేరాగాళ్లు-బిర్యానీ, పాస్ట్ ఫుడ్ ఆర్డర్లతో టోకరా

HT Telugu Desk HT Telugu

15 December 2024, 14:45 IST

google News
  • Cyber Crime : సైబర్ నేరగాళ్ళు ట్రెండ్ మార్చారు. సరికొత్త మోసానికి తెర లేపారు. మినీ ఏటీఎంలే లక్ష్యంగా బిర్యానీ, పాస్ట్ పుడ్ ఆర్డర్లతో టోకరా వేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలువురు మోసపోయి లబోదిబోమంటున్నారు.

ట్రెండ్ మార్చిన సైబర్ నేరాగాళ్లు-బిర్యానీ, పాస్ట్ ఫుడ్ ఆర్డర్లతో టోకరా
ట్రెండ్ మార్చిన సైబర్ నేరాగాళ్లు-బిర్యానీ, పాస్ట్ ఫుడ్ ఆర్డర్లతో టోకరా

ట్రెండ్ మార్చిన సైబర్ నేరాగాళ్లు-బిర్యానీ, పాస్ట్ ఫుడ్ ఆర్డర్లతో టోకరా

Cyber Crime : స్కీమ్ లు, లాటరీలు, బ్యాంకు రుణాల పేరిట మోసాలకు పాల్పడిన సైబర్ నేరగాళ్లు కొత్త తరహాలో మోసగించేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఫోన్లలో స్థానికులుగా పరిచయం చేసుకుంటూ నమ్మబలుకుతున్నారు. స్థానికంగా ప్రముఖులు, వ్యాపారస్థుల పేర్లు చెప్పి మాటల్లోకి దింపుతున్నారు. ఇటీవల ఆన్లైన్ నగదు బదిలీ కేంద్రాలు, మినీ ఏటీఎంలలో క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులతో నగదు బదిలీ అవుతుండడాన్ని ఆసరాగా చేసుకుని వాటినే టార్గెట్ గా చేస్తున్నారు. ఫుడ్ ఆర్డర్ల పేర ఏకకాలంలో రెస్టారెంట్ల నిర్వాహకులు, మినీ ఏటీఎం నిర్వాహకులకు ఒకరికి తెలియకుండా ఒకరికి ఫోన్లు చేసి టోకరా వేస్తున్నారు. నిమిషాల్లోనే మాయచేసి వేలకు వేలు దండుకుంటున్నారు. బ్యాంకుల సెలవు రోజులనే టార్గెట్ చేసుకుని బురిడీ కొట్టిస్తున్నారు. గోదావరిఖని, పెద్దపల్లిల్లో ఈ తరహా వరుస ఘటనలు చోటు చేసుకున్నాయి.

నగదు బదిలీ పేరుతో మోసం

గోదావరిఖని మెయిన్ రోడ్డులోని ఒక మినీ ఏటీఎం సెంటర్ నిర్వాహకుడికి ఫోన్ చేసిన సైబర్ నేరస్థుడు తాను మార్కండేయ కాలనీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి ఎండీనని, తనకు పెట్రోల్ బంక్, ఇతర వ్యాపారాలు ఉన్నాయని నమ్మబలికాడు. వరుసగా బ్యాంకులకు సెలవులు ఉన్నాయని, అందువల్ల తనకు డబ్బులు బదిలీ చేయాల్సిన అవసరం ఉందన్నాడు. తన ఉద్యోగి వస్తాడని, కమీషన్ తీసుకుని మిగతా డబ్బులు తన అకౌంట్లోకి పంపాలని సూచించాడు. అదే సమయంలో మినీ ఏటీఎం దగ్గరే ఉన్న మరో పాస్ట్ ఫుడ్ సెంటర్ యజమానికి ఫోన్ చేసి తనకు కొన్ని పార్సల్స్ అవసరమని, డబ్బులు పక్కనే ఉన్న మినీ ఏటీఎం నుంచి తీసుకోవాలని అతనికి సూచించాడు. పాస్ట్ పుడ్ సెంటర్ నిర్వాహకుడు మినీ ఏటీఎం వద్దకు వెళ్లగా ఏటీఎం నిర్వాహకుడు పాస్ట్ పుడ్ సెంటర్ నిర్వాహకుడిని చూసి తనకు ఫోన్ చేసిన అసుపత్రి ఎండీ వద్ద పనిచేసే ఉద్యోగిగా భావించాడు. అతడు రావడంతోనే రూ.55 వేల సొమ్మును ఆసుపత్రి ఎండీ చెప్పిన అకౌంట్ కు బదిలీ చేశాడు. ముందున్న వ్యక్తి తనకు పార్శిళ్ళ డబ్బులు ఇవ్వమని ఏటీఎం నిర్వహకున్ని అడగడంతో అవాక్కయ్యాడు. మోసపోయానని గుర్తించి సైబర్ నేరస్థుడు చేసిన ఫోన్ నంబర్ కు కాల్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. సైబర్ క్రైమ్ నెం. 1930కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

బిర్యానీ పాయింట్ల పేరుతో

పెద్దపల్లిలో ఒక నగదు బదిలీ కేంద్రం నిర్వాహకుడికి ఇదే తరహాలో సైబర్ నేరస్థుడు బురిడీ కొట్టించాడు. తనకు 100 బిర్యానీ ప్యాకెట్లు అవసరమని ఫోన్లో ఆర్డర్ చేశాడు. ఆడ్వాన్స్ ఇవ్వాలని బిర్యానీ సెంటర్ నిర్వాహకుడు కోరడంతో భూంనగర్లోని మీ సేవ కేంద్రానికి వెళితే రూ.10 వేలు ఇస్తాడని, మిగిలిన సొమ్మును తాను ఫోన్ పే చేస్తానని నమ్మించాడు. అదే సమయంలో ఆన్లైన్ సెంటర్ నిర్వాహకుడికి ఫోన్ చేసిన అగంతకుడు తాను ఒక వ్యక్తి ద్వారా నగదు పంపిస్తున్నానని, ఆన్లైన్లో బదిలీ చేయాలని సూచించాడు. మీ సేవ సెంటర్ నిర్వాహకుడు పని మీద బయటకు వెళుతూ షాపులో పనిచేస్తున్న వ్యక్తికి తన పేరు చెప్పి ఎవరైనా వస్తే నగదు బదిలీ చేయాలని సూచించాడు.

బిర్యానీ సెంటర్ నిర్వాహకుడు మీ సేవా కేంద్రానికి వెళ్లి తనకు ఫోన్ చేసిన వ్యక్తికి మరోసారి ఫోన్ చేసి మీ సేవ లో పని చేస్తున్న వ్యక్తికి ఫోన్ ఇచ్చాడు. నేను మీ యజమానితో మాట్లాడాను, నేను చెప్పిన నంబర్లకు డబ్బులు బదిలీ చేయమనడంతో షాపులో పనిచేస్తున్న వ్యక్తి మూడు నెంబర్లకు మొత్తం రూ.55 వేలు బదిలీ చేశాడు. మీ ముందున్న వ్యక్తి నగదు ఇస్తాడు, తీసుకోండని ఫోన్ కట్ చేశాడు. ముందున్న వ్యక్తిని డబ్బులు ఇవ్వమని అడుగగా తాను బిర్యానీ సెంటర్ నిర్వాహకుడినని, తాను డబ్బులు ఇవ్వడం ఏంటి? మీ దగ్గర డబ్బులు తీసుకోమ్మని కస్టమర్ చెబితే వచ్చానని తెలుపడంతో మోస పోయామని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సెలవు రోజుల్లో రద్దీ ప్రాంతాల్లో

సైబర్ నేరస్థులు ప్రజల అవసరాలు, నమ్మకాలను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. మినీ ఏటీఎంలలో ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా సాగుతుండడంతో వాటినే లక్ష్యంగా చేసుకుంటున్నారు. అనుమానం రాకుండా తెలుగులో మాట్లాడుతూ స్థానికంగా పరిచయం ఎక్కువ ఉన్న వ్యాపారులు.. ఆసుపత్రి నిర్వాహకుల పేర్లను వాడుకుంటున్నారు. ముఖ్యంగా బ్యాంకు సెలవు దినాల్లో ఆన్లైన్ నగదు బదిలీ సెంటర్లకు గిరాకీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండడం, రద్దీ సమయాల్లో నిర్వాహకులను ఏమార్చి బురిడీ కొట్టిస్తున్నారు.

స్థానిక వ్యాపారుల పేర్లు.. వివరాలతో మోసాలు..

సైబర్ నేరస్థులు ఇన్నాళ్లు ఫోన్ నంబర్ల ఆధారంగానే మోసాలకు పాల్పడేవారు. ఇప్పుడు మీసేవా నగదు బదిలీ కేంద్రాలు, ప్రముఖ వ్యాపార సంస్థల వివరాలు గూగుల్ మ్యాప్ లో అందుబాటులో ఉంటాయి. దీని ఆధారంగా ఆన్లైన్లో నిర్వాహకుల పేర్లు, వ్యాపార వివరాలను సైబర్ నేరస్థులు సేకరిస్తున్నారు. వీటి ఆధారంగానే సులువుగా మోసాలకు పాల్పడుతున్నారు. నాలుగు రోజుల క్రితం గోదావరిఖనిలోని పలువురు వ్యాపారులకు పోన్లు చేసి తాము మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మాట్లాడుతున్నామని, ట్రేడ్ లైసెన్స్ల సొమ్ము ఏకకాలం లో తాము చెప్పిన నంబర్లకు ఫోన్ ఫే ద్వారా పంపాలంటూ ఒత్తిడి చేశారు. దీంతో వ్యాపారులు ఆప్రమత్తం కావడంతో తృటిలో మోసం నుంచి బయటపడ్డారు.

అప్రమత్తతోనే రక్షణ...

సైబర్ నేరాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే మోసపోకుండా రక్షణ పొందే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. ఏ చిన్న ఫోన్ కాల్ విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. అనౌన్ కాల్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.

రిపోర్టింగ్ : కేవీ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా, కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు

తదుపరి వ్యాసం