తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Khammam Cyber Crime : సుప్రీంకోర్టులో సమన్లు పేరిట సైబర్ నేరగాళ్ల భారీ ఉచ్చు-రూ.15 లక్షలు పోగొట్టుకున్న విశ్రాంత ఉద్యోగి

Khammam Cyber Crime : సుప్రీంకోర్టులో సమన్లు పేరిట సైబర్ నేరగాళ్ల భారీ ఉచ్చు-రూ.15 లక్షలు పోగొట్టుకున్న విశ్రాంత ఉద్యోగి

HT Telugu Desk HT Telugu

07 December 2024, 20:54 IST

google News
  • Khammam Cyber Crime : సైబర్ కేటుగాళ్ల వలలో పడిన విశ్రాంత ఉద్యోగి అక్షరాలా రూ.15 లక్షలు పోగొట్టుకున్నారు. హవాలా చేస్తున్నారని బెదిరించి, సీబీఐ, సుప్రీంకోర్టు సమన్లు పేరిట రూ.15 లక్షలు తమ ఖాతాలు ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు.

సుప్రీంకోర్టులో సమన్లు పేరిట సైబర్ నేరగాళ్ల భారీ ఉచ్చు-రూ.15 లక్షలు పోగొట్టుకున్న విశ్రాంత ఉద్యోగి
సుప్రీంకోర్టులో సమన్లు పేరిట సైబర్ నేరగాళ్ల భారీ ఉచ్చు-రూ.15 లక్షలు పోగొట్టుకున్న విశ్రాంత ఉద్యోగి

సుప్రీంకోర్టులో సమన్లు పేరిట సైబర్ నేరగాళ్ల భారీ ఉచ్చు-రూ.15 లక్షలు పోగొట్టుకున్న విశ్రాంత ఉద్యోగి

ఖమ్మం జిల్లా వైరా పట్టణ కేంద్రంలో ఓ విశ్రాంత ఉద్యోగి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నాడు. అక్షరాలా రూ.15 లక్షల సొమ్మును తన చేజేతులా తన బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్ల ఖాతాకు బదిలీ చేశాడు. తర్వాత బంధువులకు విషయం తెలియడంతో వెంటనే బాధితుడితో కలిసి వైరా పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. శుక్ర, శనివారాల్లో ఈ సైబర్ నేరగాళ్ల వాట్సాప్ బెదిరింపులతో విశ్రాంత ఉద్యోగి ఊటుకూరి నర్సింహారావు భయంతో భీతిల్లిపోయాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. వైరా మున్సిపాలిటీ 13వ వార్డు హెచ్పీ పెట్రోల్ బంకు సమీపంలో విశ్రాంత ఉద్యోగి ఊటుకూరి నర్సింహారావు ఉంటున్నాడు. నర్సింహారావు ఉమ్మడి వరంగల్ జిల్లా కమలాపురంలోని ఓ పేపర్ బోర్డులో ఉద్యోగిగా పనిచేసి రిటైర్డ్ అయి వైరాలో నివాసం ఏర్పరచుకున్నాడు. ఆయనకు శుక్రవారం మధ్యాహ్నం వాట్సాప్ ఫోన్ కాల్ వచ్చింది. తాము దిల్లీ ఎయిర్పోర్టు నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పారు. మీరు ఐదు విమాన టిక్కెట్లు బుక్ చేసుకున్నారని, ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నించారు. తాను ఎలాంటి విమాన టిక్కెట్లు బుక్ చేసుకోలేదని నర్సింహారావు సమాధానమివ్వడంతో మీ విషయం ఏదో తేడాగా ఉందని సీబీఐకి ఫిర్యాదు అందిందని వాట్సాప్ కాల్ చేసిన సదరు వ్యక్తి బెదిరించాడు. ఆ వెంటనే వీడియో కాల్ లోకి వచ్చిన మరో ముగ్గురు వ్యక్తులు కలిసి నర్సింహారావుతో మాట్లాడి బెదిరింపులకు పాల్పడ్డారు.

వీడియో కాల్ లో ఉన్న అగంతకులు నర్సింహారావుకు కన్పించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నర్సింహారావు మాత్రం అగంతకులకు కన్పించారు. మీ దగ్గర హవాలా డబ్బు ఉందని, మీరు మోసంతోనే హవాలా వ్యాపారం చేస్తున్నారని, సుప్రీంకోర్టు నుంచి ఆ మేరకు సమన్లు వచ్చాయని, మిమ్మల్ని అరెస్టు చేయాల్సి ఉంటుందని బెదిరించారు. మిమ్మల్ని అరెస్టు చేయకుండా విచారించాలంటే సుప్రీంకోర్టు సమన్లు మేరకు రూ.15 లక్షలను సుప్రీంకోర్టు ఆడిట్ విభాగానికి జమ చేయాలని ఆదేశించారు. ఈ విషయాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, పోలీసులకు, ఇతరులకు ఎవరికైనా చెబితే వెంటనే అరెస్టు చేస్తామని బెదిరించటంతో నర్సింహారావు భయకంపితులయ్యాడు. ఆ తర్వాత శుక్రవారం మాదిరిగానే శనివారం కూడా సైబర్ నేరగాళ్లు నర్సింహారావుకు ఇదే విధంగా వీడియో కాల్ చేసి బెదిరించారు.

కోల్ కతా బ్యాంకులో రూ.15 లక్షలు జమ చేయండి

కోల్ కత్తాలోని బంధన్ బ్యాంకులోని రామా ఎంటర్ప్రైజస్ ఖాతాలో రూ.15 లక్షలు జమ చేయాలని, లేనట్లయితే వెంటనే అరెస్టు చేస్తామని నేరగాళ్లు బెదిరించారు. దీంతో భయపడిన నర్సింహారావు శనివారం మధ్యాహ్నం వైరాలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ లో ఉన్న తన ఖాతా నుంచి సైబర్ కేటుగాళ్లు ఆదేశించిన ఖాతా నెంబర్ కు రూ.15 లక్షలు బదిలీ చేశారు. మళ్లీ మరో రూ.5లక్షలు బదిలీ చేయాలని సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు దిగారు. ఆ తర్వాత కొంతసేపటికి తమ ఇంటికి వచ్చిన బంధువులకు నర్సింహారావు భయంతో వణికిపోతూ ఈ విషయాన్ని తెలిపారు. వెంటనే బంధువులు నర్సింహారావుకు ధైర్యం చెప్పి వైరా పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయించారు. వైరా పోలీసులు కేసు నమోదు చేసి రాష్ట్ర సైబర్ క్రైం విభాగానికి కేసును బదిలీ చేశారు. నరసింహారావు తనకు వచ్చిన ఫోన్ కాల్స్ గురించి ఎవరికీ చెప్పకుండా తానే స్వయంగా తన ఖాతా నుంచి సైబర్ నేరగాళ్ల ఖాతాకు డబ్బును బదిలీ చేసి భారీ తప్పిదం చేశారు. ఫోన్ లో లింక్ క్లిక్ చేస్తేనే డబ్బులు మాయమైపోతున్న పరిస్థితుల్లో ఆయన వాట్సాప్ కాల్స్ కి అనవసరంగా భయపడటం, రూ.15 లక్షల భారీ మొత్తాన్ని పోగొట్టుకోవడం విస్మయం కలిగిస్తోంది.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి.

తదుపరి వ్యాసం