Hyderabad Crime : హైదరాబాద్ లో హవాలా రాకెట్ గుట్టురట్టు, భారీగా నగదు సీజ్
Hyderabad Crime : హైదరాబాద్ లో భారీ హవాలా రాకెట్ గుట్టురట్టు చేశారు పోలీసులు. నిందితుల డబ్బులు డెలివరీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
Hyderabad Crime : హైదరాబాద్ లోని అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో హవాలా మనీ రాకెట్‌కు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను టాస్క్‌ఫోర్స్ సెంట్రల్ జోన్ శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.45.90 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్ జోన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...రాజస్థాన్ రాష్ట్రంలోని గోషామహల్ జిల్లాకు చెందిన ప్రధాన నిందితుడు మనోజ్ కుమార్ శర్మ మెహిదీపట్నంలోని జాగృతి స్టీల్‌లో పనిచేస్తున్నాడు. కాగా మనోజ్ కు ముషీరాబాద్ లో ఉక్కు, స్క్రాప్ వ్యాపారం చేస్తున్న సయ్యద్ షా రహీముద్దీన్, ఖాద్రీ మహ్మద్ జాకీర్ హుస్సేన్ లతో కొన్ని రోజుల క్రితం పరిచయం ఏర్పడింది.
డబ్బు డెలివరీ చేస్తుండగా
ఈ క్రమంలోనే వీరంతా హవాలా మనీ ట్రాన్స్‌ఫర్ ఏజెంట్లతో పరిచయం పెంచుకుని నగరంలో రహస్యంగా హవాలా మనీ ట్రాన్స్‌ఫర్ ఆపరేషన్ నిర్వహించి బ్రోకర్లకు డబ్బులు అందిస్తున్నారు. పోలీసులకు అనుమానం రాకుండా వాట్సాప్ కోడ్ చాట్ ను ఉపయోగించారు. ఈ క్రమంలోనే పక్కా సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ బృందం శుక్రవారం మనోజ్ కుమార్ శర్మ అబిడ్స్ తాజ్ మహల్ హోటల్ రోడ్ సమీపంలో కస్టమర్లకు డబ్బును డెలివరీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
రూ.45.90 లక్షలు స్వాధీనం
అనంతరం మనోజ్ శర్మను విచారించగా సయ్యద్ షా రహీముద్దీన్ ఖాద్రీ, మహ్మద్ జాకీర్ హుస్సేన్ ల పేర్లను వెల్లడించడంతో వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురిని పోలీసులు లోతుగా విచారించగా హవాలాకు పాల్పడ్డారని అంగీకరించారు. నిందితుల నుంచి రూ.45.90 లక్షల నగదు, సరైన పాత్రలు లేని ఒక హోండా యాక్టివా బైక్, సరైన బిల్లులు లేని మూడు సెల్ ఫోన్లును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం నగదు,సెల్ ఫోన్లు, బైక్ ను తదుపరి విచారణ కోసం అబిడ్స్ పోలీస్ స్టేషన్ లోని ఎస్‌హెచ్‌ఓకు అప్పగించారు.
బహదూర్ పురాలో 5.8 కిలోల గంజాయి పట్టివేత
బాహదూర్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలో 5.5 కిలోల గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.27 వేల నగదు, ఒక సెల్ఫోన్, ఒక హోండా యాక్టివా స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో భాగంగా బహదూర్ పురా క్రాస్ రోడ్స్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో రంగారెడ్డి జిల్లా మారుతి నగర్ కు చెందిన ఆకాష్ (25) స్థానికంగా కార్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇతడు డబ్బును సులభంగా సంపాదించేందుకు గంజాయిని విక్రయిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే బహదూర్ పురా క్రాస్ రోడ్స్ నుంచి కస్టమర్ కు మాదకద్రవ్యాలు తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. కాగా ఆకాష్ తో పాటు ఉన్న మరో నిందితుడు అమాన్ పరారీలో ఉన్నాడు.
మాదకద్రవ్యాల రహిత నగరానికి ప్రజలంతా కృషి చేయాలి
ఇటీవలి కాలంలో అనేక మంది యువకులు, విద్యార్థులు డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారని దాని వల్ల నేరాలు చేయడం, ఇతర సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. యువత, విద్యార్థులు డ్రగ్స్ బారిన పడవద్దని, తల్లిదండ్రులు తమ పిల్లల కార్యకలాపాలపై నిఘా ఉంచాలని, పిల్లలపై అనుమానం కలిగితే సంకోచించకుండా పోలీసులను సంప్రదించాలని కోరారు. ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్టు లేదా మాదకద్రవ్యాల గురించి ఎలాంటి సమాచారం అందించాలన్నా 8712671111 నంబర్ ను సంప్రదించాలన్నారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్