పెట్రోల్ బంక్ పెట్టేందుకు పెట్టుబడి ఎంత కావాలి? భూమి నుంచి లైసెన్స్ దాకా వివరాలు
Petrol Bunk : చాలా మంది ఉద్యోగంతోపాటుగా ఏదైనా బిజినెస్ చేయాలని అనుకుంటారు. కొందరు పెట్రోల్ బంక్ మెుదలుపెట్టాలని ఆలోచిస్తారు. కానీ దాన్ని ఎలా ప్రారంభించాలో తెలియదు. అలాంటివారి కోసం పూర్తి సమాచారం ఇక్కడ ఇస్తున్నాం.
ఒకప్పుడు పెట్రోల్ బంకు అంటే.. ఎక్కడో ఒకటి కనిపించేది. చిన్న చిన్న టౌన్‌లలో ఒకటి మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పల్లెటూర్లలోనూ పెట్రోల్ బంకులు వచ్చేశాయి. కొందరు రైతులు కూడా పెట్రోల్ బంకులు ప్రారంభించడం వైపు ఆలోచన చేస్తున్నారు. కొత్తగా పెట్రోల్ బంకును మెుదలుపెట్టాలని చాలా మంది అనుకుంటారు. అలాంటి వారి కోసం పూర్తి సమాచారం ఇదిగో..
దరఖాస్తుదారు కనీసం 21 సంవత్సరాలు లేదా 55 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండాలి. కనీసం పదో తరగతి లేదా ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థికి రిటైల్ అవుట్‌లెట్ లేదా మరేదైనా రంగంలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. పెట్రోల్ బంకును ఏర్పాటు చేయాలనుకునే దరఖాస్తుదారుడు కనీసం రూ. 25 లక్షల నికర విలువ ఉండాలి. దరఖాస్తుదారు కుటుంబ నికర విలువ రూ.50 లక్షల కంటే తక్కువ ఉండకూడదని చూపించాలి.
పెట్రోల్ పంపును తెరవడానికి మీరు పెట్రోల్ కంపెనీ నుండి లైసెన్స్ తీసుకోవాలి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, రిలయన్స్, ఎస్సార్ సహా ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలు పెట్రోల్ పంపు కార్యకలాపాలకు లైసెన్స్‌లను జారీ చేస్తాయి. వాటిని కచ్చితంగా తీసుకోవాలి. లేదంటే చట్టపరమైన చర్యలకు మీరు ఎదుర్కోవలసి వస్తుంది.
గ్రామీణ ప్రాంతాల్లోని పెట్రోలు బంకుకు యూనిట్‌కు 800 చదరపు మీటర్ల స్థలం అవసరం అవుతుంది. 2 యూనిట్లకు 1200 చదరపు మీటర్ల స్థలం అవసరం కావచ్చు. అదే పట్టణ ప్రాంతాల్లో ఒక పెట్రోల్ బంకుకు 1 యూనిట్ కోసం 500 చదరపు మీటర్ల స్థలం కావాలి. 2 యూనిట్ల ఏర్పాటుకు 800 చదరపు మీటర్ల స్థలం అవసరం పడవచ్చు. జాతీయ రహదారులపై పెట్రోల్ బంకును తెరిచేందుకు 1 యూనిట్ కోసం 1200 చదరపు మీటర్ల స్థలం అవసరం పడుతుంది. అంటే 2 యూనిట్ల ఏర్పాటుకు 2000 చదరపు మీటర్ల స్థలం ఉండాలి.
భూమి స్థలం, పరిమాణం ఆధారంగా భూమి ధర రూ.30 లక్షల నుండి రూ.1 కోటి వరకు కూడా ఉండవచ్చు. అయితే మీరు కొన్ని సంవత్సరాలపాటు లీజు ప్రాతిపదికన కూడా భూమిని తీసుకోవచ్చు. ఇందుకోసం ప్రాంతాన్ని బట్టి భూమి యజమానికి నెలవారీగా డబ్బులు చెల్లించాలి. కొన్ని ప్రదేశాల్లో ఎక్కువ ధర ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో తక్కువ ధర ఉండవచ్చు.
వాడే మెటీరియల్స్, పెట్రోల్ పంపు సైజును బట్టి రూ.30 లక్షల నుంచి రూ. కోటి వరకు ఖర్చవుతుంది. పెట్రోల్ పంపు ఆపరేట్ చేయడానికి అవసరమైన ఇంధన పంపిణీ యూనిట్, స్టోరేజీ ట్యాంకులు, ఇతర పరికరాల ధర రూ. 20 లక్షల నుంచి రూ.50 లక్షలు వరకు పెట్టుకోవాలి.
ప్రభుత్వ అధికారుల నుండి అవసరమైన అనుమతులను పొందడానికి లైసెన్స్ ఫీజులు రూ. 2 లక్షల నుండి రూ. 5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. పెట్రోల్ స్టేషన్ ఏర్పాటు కోసం మీ దరఖాస్తును ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తుకు రూ. 100 నుండి రూ. 1000 వరకు తీసుకుంటారు. ఎస్సీ ఎస్టీ, ఓబీసీ కేటగిరీలకు దరఖాస్తు ఫీజులో 50 శాతం వరకు తగ్గింపు దొరుకుతుంది.
పైన చెప్పిన వివరాల ఆధారంగా పెట్టుబడి అవుతుంది. అయితే ఆదాయం గురించి మాత్రం గాలిలో మెడలు కట్టవద్దు. ఎందుకంటే.. మీ పెట్రోల్ బంకు ఉన్న ప్రదేశం ఆధారంగానే ఆదాయం ఉంటుంది. మరో విషయం ఏంటంటే.. ఇంధన ధరల పెరుగుతున్న కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. సో.. మీరు అన్ని లెక్కలు వేసుకుని ఈ బిజినెస్‌లోకి దిగితే మంచిది.
గమనిక : పైన చెప్పిన విషయం కేవలం సమాచారం కోసం మాత్రమే. దేనిలోనైనా పెట్టుబడి పెట్టేముందు కచ్చితంగా చర్చించి నిర్ణయం తీసుకోండి.