Cyber Crime : ప్రభుత్వ ఉద్యోగిని బురిడీకొట్టించిన సైబర్ నేరగాళ్లు, పోలీసుల పేరుతో ఫేక్ కాల్ చేసి మోసం-karimnagar cyber crime fake police calls threaten with ganja cases ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cyber Crime : ప్రభుత్వ ఉద్యోగిని బురిడీకొట్టించిన సైబర్ నేరగాళ్లు, పోలీసుల పేరుతో ఫేక్ కాల్ చేసి మోసం

Cyber Crime : ప్రభుత్వ ఉద్యోగిని బురిడీకొట్టించిన సైబర్ నేరగాళ్లు, పోలీసుల పేరుతో ఫేక్ కాల్ చేసి మోసం

HT Telugu Desk HT Telugu
Aug 24, 2024 09:49 PM IST

Cyber Crime : కరీంనగర్ కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి సైబర్ నేరగాళ్ల వలకు చిక్కారు. విదేశాల్లో ఉన్న మీ కొడుకు గంజాయి కేసులో పట్టుపడ్డాడని ఫోన్ రావడంతో కంగారు పడి రూ.50 వేలు పంపించారు. తీరా కొడుక్కి ఫోన్ చేయగా ఏ కేసు లేదని చెప్పడంతో మోసపోయానని తెలుసుకున్నారు.

 ప్రభుత్వ ఉద్యోగిని బురిడీకొట్టించిన సైబర్ నేరగాళ్లు, పోలీసుల పేరుతో ఫేక్ కాల్ చేసి మోసం
ప్రభుత్వ ఉద్యోగిని బురిడీకొట్టించిన సైబర్ నేరగాళ్లు, పోలీసుల పేరుతో ఫేక్ కాల్ చేసి మోసం

Cyber Crime : సైబర్ కేటుగాళ్లు రోజుకో కొత్త రూట్ లో అమాయకును మోసం చేస్తున్నారు. తాజాగా పోలీసుల పేరుతో ఫేక్ ఫోన్ కాల్స్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విదేశాల్లో ఉన్న యువకుల పేరెంట్స్ కు పోలీసుల పేరిట ఫోన్ చేసి భారీ మొత్తంలో డబ్బులు దండుకుని ఘరానా మోసానికి పాల్పడ్డారు.

కరీంనగర్ బ్యాంక్ కాలనీలో ఉండే ప్రభుత్వ ఉద్యోగి కుమారుడు అమెరికాలో ఉన్నారు. ఉన్నత విద్యను అభ్యసిస్తుండగా, మీ కొడుకు అమెరికాలో గంజాయి కేసులో పట్టుపడ్డాడని పోలీసుల పేరుతో తండ్రికి ఫోన్ చేశాడు అగంతకుడు. మీ కొడుకు ఫోన్ చేస్తే మరింత ఇబ్బంది అవుతుంది... వెంటనే రూ.50 వేలు పంపిస్తే కేసు నుంచి తప్పిస్తామని చెప్పారు.‌ నిజమే కావచ్చని భావించిన తండ్రి భయంతో ఎవరికి చెప్పకుండా ఫోన్ చేసిన వ్యక్తి ఇచ్చిన నెంబర్ కు రూ.50 వేలు పంపించారు. డబ్బులు పంపిన తర్వాత కొడుక్కి ఫోన్ చేసి కనుక్కోగా గంజాయి కేసు అలాంటిది ఏమి లేదని స్పష్టం చేయడంతో ఫోన్ చేసింది ఫేక్ పోలీసులని... మోసపోయానని గ్రహించారు. చదువుకున్న వ్యక్తి, ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఎవరికైనా చెబుతే పరువు పోతుందని సైలెంట్ గా ఉండిపోయాడు.

జగిత్యాల జిల్లాలో ఇదే తరహాలో

జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన రవి కుమారుడు కెనడాలో ఉన్నత విద్యను అభ్యసించి అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. పోలీసు అధికారి పేరుతో గుర్తు తెలియని వ్యక్తి రవికి ఫోన్ చేసి కెనడాలో కుమారుడితో పాటు మరో నలుగురు వ్యక్తులు గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డారని, కేసులో కనీసం 15 ఏళ్ల వరకు శిక్ష పడుతుందని, ఇండియా కూడా తిరిగి రాడని తీవ్రస్వరంతో హిందీలో హెచ్చరించాడు. ప్రస్తుతం మీ కుమారుడు పెద్దసార్ దగ్గర ఉన్నాడని ఈ విషయమై ఫోన్ చేయవద్దని కేసు నుంచి తప్పించేందుకు రూ.25 వేలు పంపించాలన్నాడు. కేసులో కొందరిని అదుపులోకి తీసుకుని కొడుతున్నట్లు నిందితుల ఏడుపులు, పోలీసు సైరన్ కూడా వినిపించాడు. భయపడకుండా రవి తన వద్ద రూ.5 వేలు ఉన్నాయని అరగంట తర్వాత రూ.25 వేలు పంపిస్తానని చెప్పాడు. అనుమానంతో కెనడాలో ఉన్న కుమారుడికి ఫోన్ చేయగా తాను క్షేమంగానే ఉన్నానని, ఎలాంటి కేసులో ఇరుక్కోలేదని బదులివ్వడంతో కుటుంబ సభ్యులు ఊపరి పీల్చుకున్నారు.

పోలీసుల పేరుతో దోపిడీ

కోరుట్లలో మార్కెట్ కు కూరగాయల కోసం వెళ్లిన దేశాయినగర్ ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల మిట్టపెల్లి భూమరాజంను పోలీసులమని బెదిరించి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు సుమారు కి. మీ దూరం నుంచి భూమరాజం ద్విచక్రవాహనాన్ని వెంబడించారు. డ్రైవింగ్ చేసే వ్యక్తి హెల్మెట్, వెనుక కూర్చున్న వ్యక్తి టోపీ ధరించారు. ఇందిరా రోడ్డు వద్దకు చేరుకోగానే భూమరాజం ద్విచక్ర వాహనాన్ని అడ్డగించారు. పోలీసులమని గంజాయి రవాణా ఎక్కువగా జరుగుతుందని తనిఖీలు చేస్తున్నామంటూ తెలపగా ఇంతలో పక్కనుంచి మరో వ్యక్తి వచ్చి ఆయన సంచిలో వెతికారు. మరో వ్యక్తి అతడి మెడలోని తులం బంగారు గొలుసు, 4 గ్రాముల ఉంగరం లాక్కొని పరారయ్యారు. బాధితుడు ఇంటికి వెళ్లి విషయాన్ని కుటుంబసభ్యులకు తెలపగా వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించినా నిందితుల ముఖాలను గుర్తుపట్టలేకుండా ఉండడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.

ఇన్ స్టాగ్రామ్ లింక్ ఓపెన్ చేస్తే రూ.4.92 లక్షలు మాయం

మానకొండూర్ మండలం ఊటూరులో సైబర్ నేరగాళ్ల మోసంతో ఓ యువకుడు ఏకంగా రూ.4.92 లక్షలు పోగొట్టుకున్నాడు. ప్రశాంత్ తన మోబైల్ ఇన్ స్టాగ్రామ్ కు వచ్చిన లింక్ ఓపెన్ చేయగానే అతని బ్యాంకు ఖాతా నుంచి రూ.4.92 లక్షలు డెబిట్ అయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు మానకొండూర్ సీఐ సదన్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రూటు మార్చిన మోసగాళ్లు..

పెరిగిన సాంకేతిక పరిజ్ఞానికి అనుగుణంగా మోసగాళ్లు వివిధ రూపాల్లో ప్రజలను బురిడి కొట్టించి డబ్బులు దండుకుని మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. అగంతుకుల ఫోన్ కాల్స్ కు, గుర్తు తెలియని వ్యక్తులు చెప్పే మాటలు, ఫోన్ లకు వచ్చే మెసేజ్ లకు, లింక్ లకు స్పందించవద్దని కోరుతున్నారు. సైబర్ నేరగాళ్లు రోజుకోరకంగా మోసాలకు పాల్పడుతున్నారని, ఫేక్ ఫోన్ కాల్స్ కు స్పందించకపోవడమే మంచిదని, ఇంటర్నేషనల్ కాల్స్, కొత్త నంబర్ల నుంచి ఫోన్ వస్తే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

రిపోర్టింగ్ : కేవీ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు

సంబంధిత కథనం