Jagtial District : పార్కింగ్ స్థలాలే టార్గెట్...! జగిత్యాల జిల్లాలో పోలీసులకు చిక్కిన దొంగల ముఠా-interdistrict bike thieves gang arrested in jagtial district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jagtial District : పార్కింగ్ స్థలాలే టార్గెట్...! జగిత్యాల జిల్లాలో పోలీసులకు చిక్కిన దొంగల ముఠా

Jagtial District : పార్కింగ్ స్థలాలే టార్గెట్...! జగిత్యాల జిల్లాలో పోలీసులకు చిక్కిన దొంగల ముఠా

HT Telugu Desk HT Telugu
Aug 11, 2024 07:26 AM IST

జగిత్యాల జిల్లాలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా దొరికిపోయింది. పక్కాగా నిఘా ఏర్పాటు చేసిన జిల్లా పోలీసులు… రెండు ముఠాలకు చెందిన ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మీడియాకు వెల్లడించారు. 20 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు.

జగిత్యాల జిల్లాలో దొంగల ముఠా అరెస్ట్
జగిత్యాల జిల్లాలో దొంగల ముఠా అరెస్ట్

అంతర్ జిల్లా బైక్ దొంగల ఆట పట్టించారు జగిత్యాల జిల్లా పోలీసులు. రెండు ముఠాలకు చెందిన ఐదుగురిని అరెస్టు చేశారు. బైక్ చోరీలతో సొమ్ము చేసుకుంటున్న ముగ్గురిని మెట్ పల్లి పోలీసులు అరెస్టు చేసి ఆరు లక్షల రూపాయల విలువ చేసే 20 బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. కోరుట్ల లో రాత్రిపూట చోరీలకు పాల్పడే మైనర్ బాలుడితోసహా ఇద్దరిని అరెస్టు చేసి బైక్ తో సహా 27 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సమక్షంలో అరెస్టు అయిన ముగ్గురిని మెట్ పల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో మీడియా ముందు చూపించి వివరాలు వెల్లడించారు. ప్రధాన నిందితుడు నిజామాబాద్ జిల్లా ఏరుగట్ల మండలం గుమ్మిర్యాల కు చెందిన మన్నె లక్ష్మణ్ బైక్ చోరీలకు పాల్పడి నిర్మల్ జిల్లా మామిడ గ్రామానికి చెందిన బైక్ మెకానిక్ అబ్దుల్ రషీద్, మహమ్మద్ మోసిన్ లకు అప్పగించి విక్రయించే వారు. అపహరించిన బైకులను విక్రయించి ముగ్గురు సొమ్ము చేసుకునేవారు. 

ట్రాక్టర్ డ్రైవర్ అయిన మన్నె లక్ష్మ ణ్ ఈజీ మనీకి అలవాటు పడి బైక్ చోరీలను ఎంచుకున్నాడని ఎస్పీ తెలిపారు. గత రెండు నెలలుగా జగిత్యాల జిల్లాలో 13, నిజామాబాద్ జిల్లాలో ఏడు బైక్ లను చోరీ చేశాడని తెలిపారు.

పార్కింగ్ స్థలాలే టార్గెట్…!

డమ్మీ కీ లతో మార్కెట్ హాస్పిటల్ షాపింగ్ మాల్ వద్ద పార్క్ చేసిన వాహనాలే టార్గెట్ గా లక్ష్మణ్ బైక్ చోరీలకు పాల్పడ్డారని ఎస్పీ తెలిపారు.‌ చోరీ చేసిన బైక్ లోను నిర్మల్ జిల్లాలోని బైక్ మెకానిక్ రషీద్, మోసిన్ వద్దకు తరలించి విక్రయించేవాడని చెప్పారు. ఒక్కో బైక్ 50 వేలకు విక్రయించి ముగ్గురు పంచుకునే వారిని ఎస్పీ తెలిపారు. రెండు నెలల నుంచి బైక్ చోరీలు ఎక్కువగా జరుగుతుండడంతో నిఘా పెట్టగా ముగ్గురు పట్టుబడ్డారని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.

నెంబర్ ప్లేట్ తప్పక ఉండాల్సిందే - జిల్లా ఎస్పీ

వాహనాల కు నంబర్ ప్లేట్ విధిగా ఏర్పాటు చేసుకోవాలని నంబర్ ప్లేట్ లేకపోతే దొంగ వాహనాలుగా గుర్తించి పట్టుకోవడం జరుగుతుందని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఇటీవల బైక్ చోరీలు ఎక్కువ జరగడంతో డిఎస్పీ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీ బృందాన్ని ఏర్పాటు చేయగా ముగ్గురు పట్టుబడ్డారని చెప్పారు. 

నెంబర్ ప్లేట్ లేకుండా నడుపుతున్న పలు వాహనాలను గుర్తించి వాటిపై ఆరా తీయడంతో ముగ్గురు నిందితులు గుర్తించి అరెస్టు చేయడం జరిగిందన్నారు.‌ ముగ్గురిపై మెట్పల్లిలో నాలుగు, జగిత్యాల ఆరు, కోరుట్లలో ఒకటి, రాయికల్ ఒకటి, సారంగపూర్ లో ఒకటి, ఆర్మూర్ లో మూడు, నందిపేటలో మూడు, కమ్మర్ ఖాన్ పేటలో ఒక బైక్ చోరీ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు.

కోరుట్లలో మరో ఇద్దరు అరెస్టు….

కోరుట్ల లో రాత్రిపూట చోరీలకు పాల్పడే ఇద్దరి కోరుట్ల పోలీసులు అరెస్టు చేశారు. తాళం వేసిన ఇళ్ళు టార్గెట్ గా ఎంఏ హర్షద్ మైనర్ బాలుడుతో కలిసి చోరీలకు పాల్పడ్డాడు. నిఘా పెట్టగా ఇద్దరు పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు. వారి నుండి ఒక బైక్, 27 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

అంతర్ జిల్లా బైక్ దొంగలను, రాత్రి పూట చోరీలకు పాల్పడే వారిని పట్టుకున్న డి.ఎస్.పి ఉమామహేశ్వరరావు, సీఐ నిరంజన్ రెడ్డి ఎస్సై చిరంజీవి లను ఎస్పీ అభినందించి క్యాష్ రివార్డులను అందజేశారు.

రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.