Old Mobile Phones: సైబర్ నేరాలకు ఊతమిస్తున్న పాత మొబైల్ ఫోన్లు, పాత ఫోన్ లు కొనుగోలు చేసే ముఠా గుట్టురట్టు
Old Mobile Phones: పాత ఫోన్లను పడేస్తున్నారా?.. లేక పని చేయవని విక్రయిస్తున్నారా?అయితే మీరు సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో పడినట్లే.పాత మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసి సైబర్ నేరాలకు పాల్పడే ముఠా గుట్టు రట్టు చేశారు రామగుండం సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు. బీహార్ కు చెందిన ముగ్గురిని అరెస్టు చేశారు.
Old Mobile Phones: సైబర్ నేరాల్లో వినియోగించేందుకు పని చేయని పాత మొబైల్ ఫోన్లను అక్రమంగా కొనుగోలు చేస్తున్న ముగ్గురిని రామగుండం సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నాలుగు వేలకు పైగా పాతఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్స్పెక్టర్ కృష్ణ మూర్తి తెలిపిన వివరాల ప్రకారం బీహార్ లోని హతియా దియారాకు చెందిన మహ్మద్ షమీమ్, అబ్దుల్ సలాం, మహ్మద్ ఇఫ్తికార్ ముగ్గురు కలిసి గోదావరిఖని మేడిపల్లి NTPC ఏరియాలో పాత పోన్ లు కోనుగోలు చేస్తున్నారు.
సైబర్ నేరాల కోసం పాత మొబైల్ ఫోన్లను తక్కువ ధరకు ప్రజల నుంచి కొనుగోలు చేసి ప్లాస్టిక్ వస్తువులు లేదా డబ్బును ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్నారని సైబర్ సెక్యూరిటీ బ్యూరో కు అందిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా మూడు గోనె సంచులలో నిల్వ చేసిన 4 వేల పాత మొబైల్ ఫోన్లు లభించాయని పోలీసులు తెలిపారు.
బీహార్‌కు తరలించి సైబర్ నేరగాళ్ళకు అప్పగింత...
వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన పాత మోబైల్ ఫోన్ లను బిహార్ కు తరలిస్తారు. అక్కడ తమ అనుచరులకు అప్పగించి అసోసియేట్ ద్వారా జార్ఖండ్ రాష్ట్రంలోని జమ్తారా, దియోఘర్ తదితర ప్రాంతాలకు చెందిన సైబర్ మోసగాళ్లకు సఫ్లై చేస్తారు.
సైబర్ మోసగాళ్లకు విక్రయించే ముందు వారి సహచరుడు అక్తర్ ఇట్టి మొబైల్ ఫోన్ల యొక్క సాఫ్ట్వేర్, మదర్ బోర్డు ఇతర భాగాలను రిపేర్ చేసి సైబర్ నేరగాళ్లకు ఇచ్చేస్తారు. ఈ సైబర్ మోసగాళ్లు రిపేర్ చేసిన ఫోన్లను ఉపయోగించి సైబర్ నేరాలకు పాల్పడి మోసపూరితంగా సంపాదించిన డబ్బును అక్తర్, ఈ ముగ్గురు పంచుకుంటారు.
పాత ఫోన్ లు విక్రయించినా నేరస్థులుగా పరిగణిస్తాం...
పట్టుబడ్డ ముగ్గురిపై రామగుండం టీజీసీఎస్బీలోని సీసీపీఎస్లో Cr.No.30/2024, Sec. 318(4), 319(2), 61(2) BNS, Sec. 106 BNSS యాక్ట్, Sec. 66 (D) IT act-2008 ల కింద కేసు నమోదు చేశారు. ప్రజలు తమ పాత మొబైల్ ఫోన్లను గుర్తుతెలియని వ్యక్తులకు అమ్మవద్దని, ఇవ్వొద్దని ఇన్స్పెక్టర్ కృష్ణ మూర్తి కోరారు.
పాత ఫోన్లను గుర్తుతెలియని వ్యక్తులకు విక్రయిస్తే వాటిని సైబర్ మోసాలకు ఉపయోగించే అవకాశం ఉందని, డివైజ్ ఐడెంటిటీ కారణంగా అమ్మకందారులు కూడా నేరాలకు పాల్పడే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. అందువల్ల ప్రజలు తమ పాత ఫోన్లను విక్రయించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఒకవేళ అమ్మినచో అమ్మకందారులు కూడా నేరస్తులుగా పరిగణించబడుతారని స్పష్టం చేశారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)