AP TS Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు.. ఈ వారం మరింత పెరుగుతాయని ఐఎండి అలర్ట్…
17 April 2024, 9:53 IST
- AP TS Weather Updates: తెలుగు రాష్ట్రాలను వేసవి ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. సగటు ఉష్ణోగ్రతలు 41డిగ్రీలను దాటిపోయాయి. ఈ వారంలో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగతాయని ఐఎండి అంచనా వేస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో మరింత పెరుగనున్న ఎండలు..
AP TS Weather Updates: భానుడి భగభగలతో Temparature జనం అల్లాడిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలు పగటి పూట బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఏపీ AP, తెలంగాణ Telangana రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
ఏపీలో సోమవారం 31 మండలాల్లో తీవ్ర వడగాల్పులు,139 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది. మంగళవారం 33 మండలాల్లో తీవ్ర వడ గాల్పులు, 113 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ SDMA ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
సోమవారం తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(31) :
పార్వతీపురంమన్యం 10, శ్రీకాకుళం 9, విజయనగరం 8, అల్లూరి 2, కాకినాడ 1, తూర్పుగోదావరి గోకవరం మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మంగళవారం 139 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.
మంగళవారం శ్రీకాకుళంలో 17 , విజయనగరంలో 19, పార్వతీపురంమన్యంలో 3, అల్లూరిసీతారామరాజులో 10, విశాఖపట్నంలో 3, అనకాపల్లిలో 18, కాకినాడలో 16, కోనసీమలో 9, తూర్పుగోదావరిలో 18, పశ్చిమగోదావరిలో 3, ఏలూరులో 11, కృష్ణాలో 3, ఎన్టీఆర్‌లో 5, గుంటూరులో 2, పల్నాడులో 2 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.
ఆదివారం నంద్యాల జిల్లా గోస్పాడులో 43.4°C, మన్యం జిల్లా నవగాం, విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 43.3°C, శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస 42.9°C, వైయస్సార్ జిల్లా సింహాద్రిపురం 42.5°C, అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో 42.4°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే 35 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 67 మండలాల్లో వడగాల్పులు వీచాయని విపత్తుల నిర్వహణ వాఖ అధికారులు వివరించారు.
ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని సూచిస్తున్నారు. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.
తెలంగాణలో అంతే..
తెలంగాణలో ఆదివారం ఎండలు మండిపోయాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏడు జిల్లాల్లో 42డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.రెండు జిల్లాల్లో 41.5డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యధికంగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో 42.7డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో 42.6 డిగ్రీలు, ములుగు జిల్లా తాడ్వాయి మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో 2.5 డిగ్రీలు, ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో 42.4డిగ్రీలు, నల్గొండ జిల్లా మాడుగుల పల్లి మండలంలో 43.3డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
హైదరాబాద్‌లో కూడా ఎండల తీవ్రతతో ప్రజలు అల్లాడిపోయారు. మూసాపేటలో 41డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండు మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రెండు, మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం IMD తెలిపింది.