Chalo Secretariat : తెలంగాణ సెక్రటేరియట్ వద్ద ఉద్రిక్తత- నిరుద్యోగులు, బీసీ జనసభ అధ్యక్షుడు అరెస్టు
15 July 2024, 14:45 IST
- Chalo Secretariat : హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. పలువురు నిరుద్యోగులు, బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ సెక్రటేరియట్ ముట్టడికి ప్రయత్నించారు. బీసీ కులగణన చేపట్టాలని, డీఎస్సీ వాయిదా వేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ సెక్రటేరియట్ వద్ద ఉద్రిక్తత, బీసీ జనసభ అధ్యక్షుడు అరెస్టు
Chalo Secretariat : తెలంగాణ సెక్రటేరియట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిరుద్యోగులు, బీసీ జనసభ అధ్యక్షుడు, ఓయూ విద్యార్థి జేఏసీ నాయకుడు రాజారాం యాదవ్‌ను సెక్రటేరియట్ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలో బీసీ కులగణన వెంటనే చేపట్టాలని, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేసిన బీ.సీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ చలో సెక్రటేరియట్ పిలుపునిచ్చారు. సెక్రటేరియట్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో భారీగా పోలీసులను మోహరించారు. అలాగే డీఎస్సీ, గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని హైదరాబాద్‌లోని సచివాలయం ముట్టడికి నిరుద్యోగులు పిలుపునివ్వడంతో సెక్రటేరియట్ వద్ద భారీ సంఖ్యలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సెక్రటేరియట్ ముట్టడి
నిరుద్యోగులు సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా బీసీ జనసభ కార్యకర్తలు సెక్రటేరియట్ లోకి బలవంతంగా వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో జనసభ కార్యకర్తలు, పోలీసులకు మధ్య కాసేపు తోపులాట జరిగింది. కొందరు జనసభ కార్యకర్తలు సెక్రటేరియట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారంతా సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ సహా కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు, వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిరుద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవాలని, డీఎస్సీని తక్షణమే వాయిదా వేయాలని రాజారాం యాదవ్ డిమాండ్ చేశారు. డీఎస్సీని వాయిదా వేయకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.
పలుచోట్ల అరెస్టులు
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు ఏటా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల, మెగా డీఎస్సీ నోటిఫికేషన్,డీఎస్సీ పరీక్షల వాయిదా, గ్రూప్ 2, 3 పోస్టుల పెంపు, గ్రూప్-1 మెయిన్స్ కు 1:100 పద్ధతిలో అభ్యర్థులను పిలవాలనే నిరుద్యోగులు సోమవారం సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో సెక్రటేరియట్ భారీగా పోలీసులను మోహరించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చే అవకాశం ఉండడంతో సచివాలయం బారికేడ్లు, ఇనుపకంచెలు, వాటర్ క్యానన్లను ఏర్పాటుచేశారు. జిల్లాల్లో పలువురు విద్యార్థి సంఘం నాయకులు, విద్యార్థులు, నిరుద్యోగులను పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. పలువురిని హౌస్ అరెస్టు చేశారు. అశోక్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, ఉస్మానియా యూనివర్సిటీలోని విద్యార్థులను, నిరుద్యోగులను అదుపులోకి తీసుకుంటున్నారు. అశోక్‌నగర్, చిక్కడపల్లి, సెంట్రల్ లైబ్రరీ ప్రాంతాల్లో పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. అలాగే సెక్రటేరియట్‌కు వచ్చే మార్గాల్లో పోలీసులను భారీగా మోహరించారు.