Bandi Sanjay: గురుకుల విద్యాలయాల పనివేళలపై సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ
Bandi Sanjay: గురుకుల విద్యాలయాలకు రూపొందించిన కొత్త టైం టేబుల్ పనివేళలను కుదించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
Bandi Sanjay: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. గురుకుల విద్యాలయాలకు రూపొందించిన కొత్త టైమ్ టేబుల్ పనివేళలను కుదించాలని డిమాండ్ చేశారు ఉదయం 5 నుండి రాత్రి 9.30 గంటల వరకు పనివేళలు రూపొందించడంవల్ల నిద్రలేమి, మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని తెలిపారు. రాత్రిపూట స్టడీ అవర్, కేర్ టేకర్ విధులను కూడా టీచర్లకు అప్పగించడం సరికాదన్నారు.
వార్డెన్ల పోస్టులు మంజూరైనా, భర్తీ చేయకపోవడం బాధాకరమన్నారు. తక్షణమే వార్డెన్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. కరీంనగర్ జిల్లా పోలీసులకు నెలల తరబడి టీఏ, డీఏ, పీఆర్సీ, సరెండర్ లీవ్ బిల్స్ చెల్లించకపోవడం దారుణమన్నారు. వివిధ విభాగాల్లోని దాదాపు వెయ్యి మంది పోలీసులు తీవ్ర ఆర్దిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బకాయిలను చెల్లించిన ప్రభుత్వం కరీంనగర్ జిల్లా పోలీసులను పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. తక్షణమే టీఏ, డీఏ, పీఆర్సీ బకాయిలతోపాటు సరెండ్ లీవ్ బిల్స్ చెల్లించాలని లేఖలో పేర్కొన్నారు.
తిట్లు, ఆరోపణలు వద్దు.. అభివృద్దిపై ఫోకస్ - బండి సంజయ్
ఎన్నికలైపోయినందున ఇకపై ఒకరినొకరు తిట్టుకోవడం బంద్ చేద్దామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రాజకీయ విమర్శలు, ఆరోపణలను పక్కనపెట్టి అభివృద్ధిపైనే ఫోకస్ పేడుదామని సూచించారు. కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతోనే గ్రామాల్లో అభివృద్ది సాధ్యమని, గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ విషయంలో కేంద్రం పక్షాన సంపూర్ణ సహకారం అందించే బాధ్యత నేను తీసుకునేందుకు సిద్ధమన్నారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో బండి సంజయ్ పాల్గొన్నారు. సిరిసిల్లలో పది లక్షల ఎంపి లాడ్స్ తో మున్నూరుకాపు సంఘ కళ్యాణ మండపానికి శంకుస్థాపన చేశారు. కళ్యాణ మండపం ఆవరణలో మొక్క నాటి కుల సంఘం ఆఫీస్ ను నిర్మిస్తే ఆ సంఘంలోని నాయకులకే ఉపయోగపడుతుందన్నారు .
కుల సంఘాల తరపున కళ్యాణ మండపాలు నిర్మిస్తే ఆ కులంలోని ప్రతి ఒక్కరికీ ఉపయోగపడుతోందని, ఇలాంటి వాటికి మాత్రమే ఎంపీ లాడ్స్ నిధులిస్తున్నానని తెలిపారు. ఏ కులంలోనైనా పేదలకు సహాయ సహకారాలు అందిస్తూ ఆదుకున్నప్పుడే కుల సంఘాలకు మనుగడ ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే గ్రామాల అభివృద్ధి
రెండోసారి ఎంపీగా అత్యదిక మెజారిటీతో గెలిపించడంలో సిరిసిల్ల జిల్లా ప్రజల భాగస్వామ్యం ఉందని స్పష్టం చేశారు బండి సంజయ్. రెండోసారి గెలవడంవల్లే మోదీ కేబినెట్ లో చోటు దక్కిందని తెలిపారు. జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని కేంద్ర ప్రభుత్వం విద్య, వైద్యం, రవాణా, జాతీయ రహదారులు, రైల్వేశాఖలతోపాటు సంక్షేమ రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని చేప్పారు.
ఆయా రంగాల నుండి నిధులు తీసుకొచ్చి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తానని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని...కేంద్ర ప్రభుత్వం తరపున రాష్ట్రానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించే బాధ్యత నేను తీసుకుంటానని తెలిపారు.
(రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)