తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Students Protest: జూలై4న రాష్ట్రంలో విద్యా సంస్థ‌లు బంద్,విద్యార్థి సంఘాల పిలుపు

Students Protest: జూలై4న రాష్ట్రంలో విద్యా సంస్థ‌లు బంద్,విద్యార్థి సంఘాల పిలుపు

HT Telugu Desk HT Telugu

01 July 2024, 13:40 IST

google News
    • Students Protest: రాష్ట్ర వ్యాప్తంగా నీట్‌,నెట్‌ పరీక్షల ప్రశ్నాపత్రాల లీక్‌కు నిరసనగా  జూలై 4న విద్యా సంస్థ‌ల బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపు ఇచ్చాయి.
నీట్, నెట్ ప్రశ్నాపత్రాల లీక్‌ వ్యవహారంపై విద్యార్ధి సంఘాల ఆందోళన
నీట్, నెట్ ప్రశ్నాపత్రాల లీక్‌ వ్యవహారంపై విద్యార్ధి సంఘాల ఆందోళన

నీట్, నెట్ ప్రశ్నాపత్రాల లీక్‌ వ్యవహారంపై విద్యార్ధి సంఘాల ఆందోళన

Students Protest: నీట్, నెట్ పరీక్ష పేప‌ర్ లీక్‌, అవ‌క‌త‌వ‌క‌లను వ్య‌తిరికేస్తూ, అలాగే విద్యా రంగం స‌మ‌స్య‌ల ప‌రిష్కరించాల‌ని డిమాండ్ చేస్తూ విద్యార్ధి సంఘాలు జూలై 4న బంద్‌కు పిలుపు ఇచ్చాయి. అలాగే విద్యా సంస్థ‌ల‌ను స్వ‌చ్ఛందంగా మూసివేయాల‌ని కోరారు. బంద్ నోటీసు అన్ని విద్యా సంస్థ‌ల‌కు అంద‌జేయ‌నున్న‌ట్లు విద్యార్థి సంఘాల నేత‌లు తెలిపారు.

రాష్ట్రంలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్‌, ఎన్ఎస్‌యూఐ, పీడీఎస్‌యూ, పీడీఎస్ఓ, ఏఐఎస్ఏ విద్యార్థి సంఘాలు జూలై 4న బంద్‌కు పిలుపు ఇచ్చాయి. ఆ రోజున అంద‌రూ బంద్ పాటించాల‌ని విద్యార్థుల‌ను కోరారు. అందుకు విద్యా సంస్థ‌ల యాజ‌మాన్యాలు, ప్ర‌భుత్వం స‌హ‌క‌రించాల‌ని విజ్ఞప్తి చేశాయి. విద్యా రంగ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం జ‌రిగే ఈ బంద్‌ను విజ‌యవంతం చేయాల‌ని పిలుపు ఇచ్చాయి. కేజీ టూ పీజీ వ‌ర‌కు అన్ని విద్యా సంస్థ‌లు బంద్‌లో పాల్గొనాల‌ని కోరాయి.

భార‌త విద్యార్థి ఫెడ‌రేష‌న్ (ఎస్ఎస్ఐ) అఖిల భార‌త క‌మిటీ ఇచ్చిన పిలుపు మేర‌కు రాష్ట్రంలో ఎస్ఎఫ్ఐ ఇత‌ర సంఘాల‌ను క‌లుపుకొని ఈ బంద్ నిర్వ‌హిస్తుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) జాతీయ స్థాయి పరీక్షలను నిర్వహించడంలో తన అసమర్థత ప్రదర్శించింద‌ని, తీవ్రమైన అవకతవకలు, వ్యత్యాసాలతో నీట్-పీజీ పరీక్షను వాయిదా వేసింద‌ని ఎస్ఎఫ్ఐ నేత‌లు అశోక్‌, ప్ర‌స‌న్న తెలిపారు. జూన్ 4న ప్రకటించిన నీట్-యూజీ పరీక్ష ఫలితాలు పారదర్శకత విరుద్ధంగా, పేపర్ లీక్‌ల ఫిర్యాదులు వెల్లువెత్తాయ‌ని పేర్కొన్నారు.

దాని త‌రువాత లక్షలాది మంది విద్యార్థులు హాజరైన యూజీసీ నెట్‌ పరీక్ష పేపర్ లీక్ కారణంగా ప‌రీక్ష త‌రువాత రద్దు చేశార‌ని, దీంతో వ‌చ్చే వారంలో షెడ్యూల్ చేసే సీఎస్ఐఆర్ నెట్‌ను ఎన్‌టీఏ వాయిదా వేసింద‌ని తెలిపారు. ఈ జాప్యంతో ల‌క్ష‌లాది మంది విద్యార్థులు న‌ష్టం పోతున్నార‌ని విమ‌ర్శించారు. అంతేకాకుండా, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ మెడికల్ సైన్సెస్ (ఎన్‌బీఈ) నేరుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కింద కూడా పేపర్ లీకేజీలు, అక్రమాలకు సంబంధించిన ఎపిసోడ్‌లను పేర్కొంటూ చివరి నిమిషంలో నీట్‌-పీజీ ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించింద‌ని పేర్కొన్నారు.

సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీ ఎంట్ర‌న్స్ టెస్ట్ (సీయూఈటీ), నీట్‌ వంటి కేంద్రీకృత పరీక్షలు విద్యను ప్రైవేటీకరించడాన్ని, కోచింగ్ సెంటర్ల సంస్కృతిని పెంపొందించడాన్ని ప్రోత్సహిస్తున్నాయ‌న్నారు. అట్టడుగు విద్యార్థులకు విద్య అందుబాటులో లేకుండా, భరించలేనిదిగా చేసిందని దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. 'వన్ నేషన్, వన్ ఎగ్జామ్' అనే ముసుగులో మొత్తం పరీక్షా వ్యవస్థ కుప్పకూలిపోయింద‌ని, విద్యార్థుల విద్యా భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుందని విమ‌ర్శించారు.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (టీఎన్ఏ) 25 మంది కంటే తక్కువ శాశ్వత సిబ్బందితో 25 పరీక్షలను నిర్వహిస్తుంద‌ని, అందువ‌ల్ల‌నే ఇలాంటి ఘ‌ట‌న‌లు ఉత్ప‌న్నం అవుతున్నాయ‌ని విమ‌ర్శించారు. ఈ ప‌రిస్థితిని గుర్తించ‌కుండా, మ‌రేదైనా చేస్తే అందుకు కేంద్ర విద్యా శాఖ బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంద‌ని అన్నారు. ఎన్‌టీఏ, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వైఫ‌ల్యానికి పూర్తిగా అస‌మ‌ర్థులు, అస‌మ‌ర్థులైన ఆర్ఎస్ఎస్ స‌భ్యుల‌తో ప‌ని చేయ‌డ‌మే కార‌ణ‌మ‌ని విమ‌ర్శించారు.

ఉన్నత విద్యలో మాత్ర‌మే కాకుండా, పాఠశాల విద్య పరిస్థితి దారుణంగా ఉందని బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ పాలనలో గత దశాబ్ద కాలంలో సంబంధిత శాఖలకు బడ్జెట్ కేటాయింపుల్లో కోత, ప్రభుత్వ పాఠశాలల సంఖ్య తగ్గడం, ఉపాధ్యాయుల కొరత, స్థూల నమోదు నిష్పత్తి తగ్గాయని పేర్కొన్నారు. "2018-19, 2021-22 మధ్య దేశంలో మొత్తం పాఠశాలల సంఖ్య 15,51,000 నుండి 14,89,115కి త‌గ్గాయి. అంటే 61,885 పాఠ‌శాల‌లు మూసివేశారు. ఒక‌వైపు ప్రభుత్వ పాఠశాలల సంఖ్య తగ్గుదల, మ‌రోవైపు ప్రైవేట్ పాఠశాలల సంఖ్య పెరుగుదల జ‌రుగుతుంది. ఇది అట్టడుగు వర్గాలకు పెద్ద ప్రశ్నగా మారింది" అని అన్నారు.

ఈ పరిస్థితిలో దేశంలో విద్య, ప్రజాస్వామ్యంపై దాడికి వ్యతిరేకంగా, రాష్ట్రంలో విద్యా రంగ ప‌రిర‌క్ష‌ణ‌కు భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ జూలై 4న దేశవ్యాప్త బంద్‌కు పిలుపు ఇచ్చింద‌ని, అందులో భాగంగానే రాష్ట్రంలో విద్యా సంస్థ‌ల బంద్ నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు. ఆ రోజున‌ విద్యార్థులు తరగతులను బహిష్కరిస్తార‌ని, రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో మార్చ్‌లు నిర్వహిస్తామ‌ని తెలిపారు. ఈ బంద్‌లో విద్యార్థి లోకం పాల్గొనాల‌ని పిలుపు ఇచ్చారు.

బంద్‌కు ఎనిమిది డిమాండ్లు

ఎనిమిది డిమాండ్ల‌పై ఈ బంద్ జ‌రుగుతుంది. ఎన్‌టీఏ వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేయాల‌ని, దేశంలోని ప్ర‌స్తుత నీట్, యూజీసీ నెట్‌ అవ‌క‌త‌వ‌క‌ల‌కు బాధ్య‌త వ‌హిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాల‌ని, ఇటీవలి నెట్‌, నీట్‌ పరీక్షలను రాసిన విద్యార్థులు నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల‌ని, యూనివ‌ర్శిటీల్లో, ఉన్న‌త విద్యా సంస్థ‌ల్లో, రీసెర్చ్ సంస్థ‌ల్లో పీహెచ్‌డీ అడ్మిషన్ల కోసం ఇటీవల ఆమోదించిన తప్పనిసరి నెట్‌ స్కోర్ విధానాన్ని వెనక్కి తీసుకోవాల‌ని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హెచ్‌టి తెలుగు)

తదుపరి వ్యాసం