MLA Arikepudi Gandhi : ఆపరేషన్ ఆకర్ష్...! కాంగ్రెస్‌లో చేరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ-brs mla arikepudi gandhi joined the congress party ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mla Arikepudi Gandhi : ఆపరేషన్ ఆకర్ష్...! కాంగ్రెస్‌లో చేరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

MLA Arikepudi Gandhi : ఆపరేషన్ ఆకర్ష్...! కాంగ్రెస్‌లో చేరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

MLA Arikepudi Gandhi : శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ శనివారం కాంగ్రెస్‌లో చేరారు. తాజా చేరికతో కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరింది.

కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాంధీ

బీఆర్ఎస్ పార్టీని మరో ఎమ్మెల్యే వీడారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ శనివారం కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు పలువురు కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ గూటికి చేరారు. గాంధీ చేరికతో కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరింది.

శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి అరికెపూడి గాంధీ 2018, 2023 ఎన్నికల్లో విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీలో పని చేసిన గాంధీ… 2018కి ముందు బీఆర్ఎస్ లో చేరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో విప్ గా కూడా ఉన్నారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టికెట్ ను ఆశించినప్పటికీ దక్కలేదు.

2023 డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున మొత్తం 39 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి. తెల్లా వెంకట్రావ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, కాలె యాదయ్య హస్తం, బండ్ల కృష్ణామోహన్ రెడ్డి గూటికి, ప్రకాశ్ గౌడ్ చేరారు. తాజాగా గాధీ చేరితో బీఆర్ఎస్ నుంచి చేరిన ఎమ్మెల్యేల సంఖ్య తొమ్మిదికి చేరింది. మరికొంత మంది కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడి…. కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ నుంచే మరో నాలుగు నుంచి ఐదు మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడుతారని తెలుస్తోంది.

నిన్ననే చేరిన ప్రకాశ్ గౌడ్….

రాజేంద్రనగర్ నుంచి గెలిచిన ప్రకాశ్ గౌడ్… శుక్రవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి సమీక్షంలో కాంగ్రెస్ లో చేరారు. గ్రేటర్ హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ నియోజకవర్గం నుంచి ప్రకాశ్ గౌడ్ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009, 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఆయన… ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున రెండుసార్లు విజయం సాధించారు. మొన్నటి అసెంబ్లీ బీఆర్ఎస్ తరపున బరిలో ఉన్న ఆయన… 32,096 ఓట్ల తేడాతో విక్టరీ కొట్టారు.

కొద్దిరోజుల ముందే ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ లో చేరుతారనే వార్తలు బలంగా వినిపించాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత…. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. అదే సమయంలో పార్టీ మార్పు ఖాయమని అంతా భావించారు. కానీ ఆయన యూటర్న్ తీసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి తరపున ప్రచారం కూడా చేశారు. పార్టీ మారటం లేదని చెప్పుకొచ్చారు. దీంతో ఆయన బీఆర్ఎస్ లోనే కొనసాగుతారన్న చర్చ సాగింది. కానీ ఆయన శుక్రవారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారాల్సి వస్తుందని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వ హయంలోనూ అభివృద్ధి పనులు చేశానని… ఈసారి కూడా నియోజకవర్గ ప్రజలకు మంచి జరిగేందుకే పార్టీని వీడుతున్నట్లు చెప్పారు.

వీరే కాకుండా…. గ్రేటర్ పరిధిలోని మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రాథమికంగా చర్చలు పూర్తి అయినట్లు సమాచారం. వీరు కూడా హస్తం కండువా కప్పుకునేందుకు రెడీగా ఉన్నారని తెలుస్తోంది…!