Hyderabad : పుష్ప-2 ఎఫెక్ట్.. సంధ్య థియేటర్‌కు నోటీసులు ఇచ్చిన పోలీసులు
17 December 2024, 17:45 IST
- Hyderabad : సంధ్య థియేటర్ యాజమాన్యానికి పోలీసులు షాక్ ఇచ్చారు. లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని నోటీసులు ఇచ్చారు. తొక్కిసలాట ఘటనపై వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఓ ప్రాణం పోయిందని.. మరో ప్రాణం కొట్టుమిట్టాడుతోందని పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు.
పుష్ప-2 ఎఫెక్ట్
సంధ్య థియేటర్‌కు హైదరాబాద్ పోలీసులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలంటూ.. నోటీసులు జారీ చేశారు. పుష్ప-2 ప్రిమియర్ షో సందర్భంగా తొక్కిసలాట ఘటనలో పోలీసులు 12 లోపాలు గుర్తించారు. దీనిపై 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పోలీసులు స్పష్టం చేశారు. క్రౌడ్ మేనేజ్‌మెంట్‌లో థియేటర్ యాజమాన్యం విఫలమైందన్నారు. థియేటర్ నిర్లక్ష్యం కారణంగా ఓ ప్రాణం పోయింది.. ఇంకో ప్రాణం కొట్టుమిట్టాడుతోందని పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు.
థియేటర్‌లో ఏం జరిగింది..
డిసెంబర్ 4న రాత్రి 9:40 గంటల ప్రాంతంలో.. పుష్ప-2 ప్రిమియర్ షో సందర్భంగా హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు వచ్చారు. బన్నీని చూసేందుకు భారీ సంఖ్యలో జనం గుమిగూడారు. అల్లు అర్జున్‌ను చూసేందుకు ఎగబడ్డారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట అయితే.. క్రౌడ్‌ను మేనేజ్ చేయడానికి థియేటర్ యాజమాన్యం సరైన జాగ్రత్తలు తీసుకోలేదనే ఆరోపణ ఉంది. ఈ కారణంగానే పరిస్థితి దిగజారిందనే వాదన ఉంది.
థియేటర్‌లో భద్రతా సిబ్బంది లేకపోవడం, హీరో, నటీనటులు అనధికారికంగా రావడం వల్ల రద్దీ పెరిగింది. దీంతో ఊపిరాడని పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలోనే దిల్‌సుఖ్ నగర్ నివాసి మొగుడంపల్లి రేవతి (35), ఆమె 9 ఏళ్ల కుమారుడు తేజ్ కుప్పకూలిపోయారు. దీన్ని గమనించి ఎస్‌ఐ ఎల్. మౌనిక, పీసీ ఆంజనేయులుతో సహా విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది సీపీఆర్ చేశారు. ఆ వెంటనే దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆసుపత్రికి తరలించారు. కానీ దురదృష్టవశాత్తు, రేవతి చనిపోయింది. ఆమె కొడుకును చికిత్స కోసం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్‌లు 105, 118(1), 3(5) కింద కేసు నమోదు చేశారు.
థియేటర్‌లో సురక్షితమైన వాతావరణాన్ని అందించడంలో విఫలమైనందుకు.. ఫారం-బి కింద మంజూరు అయిన సినిమాటోగ్రాఫ్ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదో వివరించాలని.. సంధ్య థియేటర్ లైసెన్స్‌దారు రేణుకా దేవిని పోలీస్ కమిషనర్ ఆదేశించారు. షోకాజ్ నోటీసుకు స్పందించడానికి థియేటర్ యాజమాన్యానికి 10 రోజుల గడువు ఇచ్చారు.
థియేటర్ లోపాలు..
1. ప్రధాన నటుల రాక గురించి పోలీసులకు తెలియజేయలేదు.
2. ప్రవేశద్వారం వద్ద ఒకే డీఎఫ్ఎండీతో సహా.. తగినంత భద్రత, జనసమూహ నియంత్రణ చర్యలు చేపట్టలేదు.
3. ప్రవేశ, నిష్క్రమణ కోసం సరైన సంకేతాలు లేవు. ఇది గందరగోళానికి దారితీసింది.
4. థియేటర్ వెలుపల అనధికారికంగా ఫ్లెక్సీలు, ట్రస్సులు, లైటింగ్ ఏర్పాటు చేయడం వల్ల క్రౌడ్ ఎట్రాక్ట్ అయ్యారు.
5. దెబ్బతిన్న మౌలిక సదుపాయాలు, దిగువ బాల్కనీ గేట్ జనసమూహ ఒత్తిడిని తట్టుకోలేకపోతుంది.
6.టికెట్ ధృవీకరణ వ్యవస్థ లేదు, అనధికార ప్రవేశం.. అధిక రద్దీకి కారణమైంది.
7. పార్కింగ్ ఏర్పాట్లు సరిపోకపోక.. ప్రధాన ద్వారాల వద్ద జనసమూహం పెరిగింది.
8. ప్రైవేట్ భద్రతా సిబ్బంది ప్రజా మార్గాలను నిరోధించడానికి అనుమతించారు. ఇది పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది..