Jangaon: జనగామ కలెక్టర్ కీలక నిర్ణయం.. 54 మంది ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ మెమోలు-jangaon collector rizwan bhasha has given show cause notices to 54 principals ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jangaon: జనగామ కలెక్టర్ కీలక నిర్ణయం.. 54 మంది ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ మెమోలు

Jangaon: జనగామ కలెక్టర్ కీలక నిర్ణయం.. 54 మంది ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ మెమోలు

Basani Shiva Kumar HT Telugu
Aug 22, 2024 10:38 AM IST

Jangaon: విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన వారిపై జనగామ కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఇటీవల విద్యాశాఖపై స్పెషల్ ఫోకస్ పెట్టిన కలెక్టర్.. తాజాగా 54 మంది ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ మెమోలు జారీ చేశారు. ఈ ఇష్యూ జనగామ జిల్లాలో సంచలనంగా మారింది. టీచర్లు అందరూ అలెర్ట్ అయ్యారు.

జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా
జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా

జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒకేసారి 54 మంది ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ మెమోలు జారీ చేయాలని డీఈవోను ఆదేశించారు. దీంతో 54 మందికి షోకాజ్ మెమోలు ఇచ్చారు డీఈవో కే.రాము. ఈ ఇష్యూ ఇప్పుడు జనగామ జిల్లాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కలెక్టర్ తీసుకున్న నిర్ణయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు, జిల్లా ప్రజలు సమర్థిస్తున్నారు. చాలామంది ఉపాధ్యాయులు సరిగా విధులకు రావడం లేదని.. వారిపైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

షోకాజ్ మెమోలు ఎందుకు ఇచ్చారు..

నవంబర్ నెలలో జిల్లాకు న్యాక్ బృందం రానుంది. ఈ బృందం విద్యార్థుల్లోని సామర్థ్యాలను పరిశీలించనుంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ రిజ్వాన్ భాషా విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఈనెల 20న మండల నోడల్ అధికారులు సమర్పించిన వివరాలను పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు శాతంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని డీఈవోను ఆదేశించారు.

25 శాంత కంటే తక్కువ మంది విద్యార్థులు హాజరైన 47 స్కూళ్లను, 60 శాతం కంటే తక్కువ మంది ఉపాధ్యాయులు హాజరైన 7 పాఠశాలలను గుర్తించారు. విధుల్లో నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు శాతం తగ్గిందని పానాధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు వెంటనే షోకాజ్ మెమోలు ఇవ్వాలని కలెక్టర్ డీఈవోను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో డీఈవో షోకాజ్ మెమోలు ఇచ్చారు.

కలెక్టర్ నిర్ణయానికి మద్దతు..

జిల్లా కలెక్టర్ తీసుకున్న ఈ నిర్ణయానికి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తోంది. చాలామంది ఉపాధ్యాయులు సరిగా స్కూళ్లకు రావడం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. వారిపైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అటు చాలా పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేవి.. చిన్నారులకు కనీస సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.