తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్, మావోయిస్టుల డేటా మాయం!

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్, మావోయిస్టుల డేటా మాయం!

08 April 2024, 17:37 IST

google News
    • Phone Tapping Case : ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన కీలక డేటాను ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ధ్వంసం చేశారు. అయితే ఫోన్ ట్యాపింగ్ తో పాటు మావోయిస్టులకు సంబంధించిన కీలక సమాచారం ధ్వంసం అయ్యిందని తెలుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ కేసు
ఫోన్ ట్యాపింగ్ కేసు

ఫోన్ ట్యాపింగ్ కేసు

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో విషయం వెలుగుచూస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి(SIB) ప్రతిపక్ష నేతలతో పాటు ప్రముఖుల ఫోన్లను ట్యాపింగ్(Phone Tapping) చేసిందని ఆరోపణలు వస్తున్నాయి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు (Praneeth Rao)డిసెంబర్ 4న కీలక డేటాను ధ్వంసం చేశారు. మొత్తం 17 కంప్యూటర్లకు చెందిన 42 హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేసి మూసీ నదిలో, అటవీ ప్రాంతంలో పడేశారు. ప్రణీత్ రావు చేసిన పనికి ఇంటెలిజెన్స్ సేకరించిన కీలక సమాచారం పోయినట్లు విచారణ అధికారులు గుర్తించారు. మావోయిస్టులకు సంబంధించిన పాత డేటా పోయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ డేటా(Intelligence Data) తిరిగి పొందే అవకాశం కూడా లేదని ఐటీ నిపుణులు చెబుతున్నారు. మూసీ నది నుంచి రికవరీ చేసిన హార్డ్ డిస్క్ ల నుంచి డేటా రికవరీ సాధ్యం కాదని తేల్చేశారు.

ప్రతిపక్షల నేతల ఫోన్లు ట్యాపింగ్

ఎస్ఐబీ(SIB) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్(Phone Tapping Case) వ్యవహారం అంతా జరిగినట్లు ప్రణీత్ రావు తన వాంగ్మూలంలో తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కోసం కన్వర్జెన్స్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ టూల్స్ వాడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ల్యాబ్ డైరెక్టర్లు పాల్ రవికుమార్, బూసి , శ్రీవల్లిని విచారించే అవకాశం ఉందని సమాచారం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్నికలు, ఉపఎన్నికల్లో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ కు పాల్పడినట్లు ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన నిందితులు వాంగ్మూలం ఇచ్చారు.

గెస్ట్ హౌస్ కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్

రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన ఇంటికి సమీపంలో గెస్ట్ హౌస్ (Guest House)కేంద్రంగా ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం నడిసిందని విచారణలో తేలింది. జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి సమీపంలోని బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ నవీన్ రావుకు చెందిన గెస్ట్‌ హౌజ్‌లో సోమవారం పోలీసులు సోదాలు చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారానికి ఈ గెస్ట్ హౌస్ ను ప్రణీత్‌ రావు టీమ్ కేంద్రంగా మార్చుకుందని పోలీసులు గుర్తించారు. రేవంత్ రెడ్డి ఇంటికి అతి సమీపంలోని ఈ గెస్ట్ హౌస్ నుంచి అడిషనల్‌ ఎస్పీ భుజంగరావు ట్యాపింగ్‌ ఆపరేషన్‌ చేశారని తెలుస్తోంది. ఈ కేసులో నిందితుల నుంచి రాబట్టిన సమాచారంలో పోలీసులు సోదాలు చేస్తున్నారు. అయితే ప్రణీత్ రావు తరహాలో గెస్ట్‌ హౌజ్‌లో ఫోన్‌ ట్యాపింగ్‌ ఆధారాలన్నింటిని భుజంగరావు ముందే ధ్వంసం చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

ఫోన్ ట్యాపింగ్ తో నాకు సంబంధం లేదు- ఎమ్మెల్సీ నవీన్ రావు

ఈ గెస్ట్ హౌస్ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్‌ రావును(BRS Mlc Naveen Rao) విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. నవీన్‌ రావుతో పాటు మరో ఎమ్మెల్సీకి కూడా పోలీసులు నోటీసులు జారీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ నవీన్‌ రావు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌(KCR)కు చాలా సన్నిహితుడు. తెలంగాణ ఉద్యమం సమయం నుంచి నవీన్ రావు కేసీఆర్‌ తో ఉన్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు సంబంధం లేదని ఎమ్మెల్సీ నవీన్ రావు తెలిపారు. తనపై బురద జల్లేందుకు ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) వ్యవహారంలో తన పేరు లాగుతున్నారని ఆరోపించారు. తన గెస్ట్‌ హౌజ్‌లో ఎలాంటి తనిఖీలు జరగలేదన్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ నవీన్‌ రావు హెచ్చరించారు.

తదుపరి వ్యాసం