Hyderabad Metro : హైదరాబాద్ మెట్రోకు సాంకేతిక సమస్య.. నిలిచిపోయిన రైళ్లు.. 5 ముఖ్యాంశాలు
04 November 2024, 12:19 IST
- Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు వ్యవస్థలో సాంకేతిక సమస్య వచ్చింది. దీంతో ఎక్కడికక్కడ మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. నాగోల్ -రాయదుర్గం, ఎల్బీనగర్- మియాపూర్ రూట్‌లో మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికుల ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
హైదరాబాద్ మెట్రోకు సాంకేతిక సమస్య
హైదరాబాద్‌లో వేలాది మంది ఇప్పుడు మెట్రోపై ఆధారపడుతున్నారు. ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లడానికి అనుకూలంగా ఉందని మెట్రోను ఆశ్రయిస్తున్నారు. అలాంటి వ్యవస్థకు సాంకేతిక సమస్య వచ్చింది. దీంతో ఎక్కడి రైళ్లు అక్కడే ఆగిపోయాయి. కొన్ని చోట్ల స్టేషన్లలో కాకుండా మార్గమధ్యలోనే మెట్రో రైళ్లను నిలిపివేశారు. దీంతో ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేశారు.
5 ముఖ్యాంశాలు..
1.హైదరాబాద్ మెట్రో రైలు వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
2.ఎల్‌బీ నగర్- మియాపూర్ మెట్రో మార్గంలో సాంకేతిక సమస్య కారణంగా రైళ్లు నెమ్మదిగా నడుస్తున్నాయి.
3.విద్యుత్ ఫీడర్ ఛానల్‌లో సాంకేతిక సమస్య తలెత్తిందని మెట్రో అధికారులు తెలిపారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని వివరించారు.
4.రైళ్లు ఆలస్యం కావడంతో స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ముఖ్యంగా ఎల్బీ నగర్, మియాపూర్ స్టేషన్లలో రద్దీ నెలకొంది.
5.సాంకేతిక సమస్య కారణంగా ఈ ఉదయం బ్లూ లైన్‌లో కొద్దిసేపు ఆలస్యమైందని.. హైదరాబాద్ మెట్రో ప్రకటించింది. సాధారణ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయని మీకు తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నామని ట్వీట్ చేసింది. మీ సహకారానికి ధన్యవాదాలు. అసౌకర్యానికి మేము చింతిస్తున్నామమని పేర్కొంది.
రెండో దశకు శ్రీకారం..
హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులకు వేగంగా అడుగులు పడుతున్నాయి. తాజాగా.. ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది. రెండో దశలో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణం చేపట్టేందుకు అనుమతి వచ్చింది. దీనికి సంబంధించి.. ప్రభుత్వం జీవో 196ని జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రెండో దశ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టనున్నారు.
ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.24,269 కోట్లు అవుతుందని అంచనా వేశారు. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.7,313 కోట్లు. హైదరాబాద్‌లో కొత్తగా 5 మార్గాల్లో మెట్రో రెండో దశ పనులు చేపట్టనున్నారు. కారిడార్ 4లో నాగోలు- శంషాబాద్ విమానాశ్రయం వరకు 36.8 కిలో మీటర్లు, కారిడార్ 5లో రాయదుర్గ- కోకాపేట వరకు 11.6 కిలో మీటర్లు, కారిడార్ 6లో ఎంజీబీఎస్ నుంచి చాంద్రయాణగుట్ట వరకు 7.5 కిలో మీటర్లు, కారిడార్ 7లో మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు 13.4 కిలో మీటర్లు, కారిడార్ 8లో ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు 7.1 కిలో మీటర్లు నిర్మించనున్నట్టు అధికారులు చెబుతున్నారు.