Miyapur Firing: మియాపూర్‌ హోటల్లో దుండగుల కాల్పులు.. మేనేజర్ మృతి-gunfire in miyapur manager killed in firing by thugs ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Miyapur Firing: మియాపూర్‌ హోటల్లో దుండగుల కాల్పులు.. మేనేజర్ మృతి

Miyapur Firing: మియాపూర్‌ హోటల్లో దుండగుల కాల్పులు.. మేనేజర్ మృతి

HT Telugu Desk HT Telugu
Aug 24, 2023 08:08 AM IST

Miyapur Firing: హైదరాబాద్‌ మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం రాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. మదీనాగూడలో సందర్శిని ఎలైట్ హోటల్‌ మేనేజర్‌పై దుండగులు కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆస్పత్రిలో చనిపోయారు.

మియాపూర్‌లో కాల్పులు, హోటల్ మేనేజర్ మృతి
మియాపూర్‌లో కాల్పులు, హోటల్ మేనేజర్ మృతి

Miyapur Firing: హైదరాబాద్‌ మియాపూర్‌లో బుధవారం రాత్రి కాల్పులు కలకలం రేపాయి. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మదీనాగూడలోని సందర్శిని ఎలైట్ రెస్టారెంట్ లో పనిచేస్తున్న జనరల్ మేనేజర్ దేవేందర్ గాయన్ పై కాల్పులు జరిపారు. దుండగులు ఐదు రౌండ్లు కాల్చి పరారయ్యారు. ఈ ఘటనలో కోల్‌కత్తాకు చెందిన దేవేందర్ గాయాన్ తీవ్రంగా గాయపడ్డాడు.

మదీనాగూడలోని సందర్శిని ఎలైట్‌ రెస్టారెంట్లో జనరల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న దేవేందర్‌ గాయన్‌ (35)పై బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. దేశవాళీ తుపాకీతో ఆరు రౌండ్లు కాల్పులు జరపగా ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.

దేవేందర్‌ స్వస్థలం కోల్‌కతాగా పోలీసులు తెలిపారు. కాల్పులకు పూర్తి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సంఘటన స్థలాన్ని మాదాపూర్‌ జోన్‌ డీసీప్‌ సందీప్‌రావు, మియాపూర్‌ ఏసీపీ నరసింహారావు పరిశీలించారు. ఈ ఘటనకు పాత కక్షలే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నామని, త్వరలో నిందితులను పట్టుకుంటామని డీసీపీ తెలిపారు.

బుధవారం రాత్రి 9:40 గంటలకు దేవేందర్‌నాథ్ హోటల్ నుంచి బయటకు రాగానే హెల్మెట్ ధరించిన ఓ గుర్తుతెలియని వ్యక్తి అతడిపై 5 రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయాడని మాదాపూర్‌ డీసీపీ జి సందీప్ తెలిపారు. దేవేందర్‌కు గాయాలు కావడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. ఘటన సమాచారం తెలియడంతో అప్రమత్తమైన సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. నిందితుడిని గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

ఘటనా స్థలంలో ఆధారాల కోసం కోసం సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై మియాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేవేందర్‌ స్వస్థలం కోల్‌కతా కావడంతో పాత కక్షల కారణంగానే ఈ ఘటన జరిగిందని భావిస్తున్నామని, త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని డీసీపీ తెలిపారు.

నిందితుడు గుర్తింపు…

మియాపూర్‌లో కాల్పులకు పాల్పడిన వ్యక్తిని రిత్విక్‌గా పోలీసులు గుర్తించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. రిత్విక్‌ బైక్‌పై వచ్చి హోటల్‌ వద్ద పలుమార్లు రెక్కీ నిర్వహించినట్టు సీసీటీవీ ఫుటేజీల్లో గుర్తించారు. నిందితుడు ఆశ్రయం పొందేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో పోలీసులు గాలింపు చేపట్టారు. మృతుడు సందర్శిని ఎలైట్‌ హోటల్‌లో ఆర్నెల్లుగా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి ఐదు రౌండ్లు కాల్పులు జరపడంతో గాయన్ చనిపోయాడు.

Whats_app_banner