CM Revanth Reddy : హైదరాబాద్ మెట్రో రెండో దశకు మద్దతు ఇవ్వండి - కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
CM Revanth Reddy : తెలంగాణకు వదరసాయం పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. రాష్ట్ర విభజన సమస్యలు పరిష్కరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రానికి అదనంగా 29 ఐపీఎస్ పోస్టులు కేటాయించాలన్నారు. మెట్రో రైలు రెండో దశకు మద్దతు ఇవ్వాలని మరో మంత్రిని కోరారు.
తెలంగాణలో భారీ వర్షాలతో దెబ్బతిన్న మౌలిక వసతుల పునరుద్ధరణ, మరమ్మతు పనులకు రూ.11,713.49 కోట్లు సత్వరమే విడుదల చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దిల్లీలో కేంద్ర హోంమంత్రితో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం భేటీ అయ్యారు. తెలంగాణలో ఆగస్టు 31 నుంచి నుంచి సెప్టెంబరు 8వ తేదీ వరకు కురిసిన భారీ వర్షాలు రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపాయని సీఎం తెలిపారు. 37 మంది ప్రాణాలు కోల్పోయారని, లక్షకుపైగా పశువులు, ఇతర మూగ జీవాలు మృతిచెందాయని, 4.15 లక్షల ఎకరాల్లో పంటతో పాటు రోడ్లు, కల్వర్టులు, కాజ్‌వేలు, చెరువులు, కుంటలు, కాలువలు దెబ్బతిన్నాయని కేంద్ర మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు.
మౌలిక వసతుల పునరుద్ధరణ, మరమ్మతు పనులను తాము వెంటనే చేపట్టామని సీఎం వివరించారు. ఆయా పనులకు రూ.5,438 కోట్లు విడుదల చేయాలని సెప్టెంబరు రెండో తేదీన తాను లేఖ రాసిన విషయాన్ని కేంద్ర మంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రంలో పంట, ఇతర నష్టాలపై కేంద్ర బృందం పర్యటించి మౌలిక వసతుల పునరుద్ధరణ, మరమ్మతులకు రూ.11,713 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సెప్టెంబరు 30వ తేదీన నివేదిక సమర్పించిందని సీఎం తెలిపారు. ఆ నిధులు పునరుద్ధరణ, మరమ్మతుల పనులకు ఎంతమాత్రం సరిపోవని ముఖ్యమంత్రి తెలిపారు. వాటిని ఇప్పటి వరకు విడుదల చేయనందున వెంటనే ఆ నిధులు విడుదల చేయాలని కోరారు.
2024-25 సంవత్సరానికి సంబంధించి ఎస్‌డీఆర్ఎఫ్ మొదటి, రెండో విడతల కింద తెలంగాణకు రూ.416.80 కోట్లను కేంద్రం విడుదల చేసిందని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి తెలియజేశారు. పునరుద్ధరణ, మరమ్మతు పనులకు విడుదల చేసే నిధులను గతంలో ఎస్‌డీఆర్ఎఫ్ పనులకు సంబంధించిన నిధులు ఉపయోగానికి ముడిపెట్టవద్దని కేంద్ర మంత్రిని సీఎం విజ్ఞప్తి చేశారు. ఎస్‌డీఆర్ఎఫ్‌కు సంబంధించిన నిధులను ఈ ఆర్థిక సంవత్సరంలోనే వ్యయం చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.
ఆ మూడు జిల్లాలను ఎల్‌డబ్ల్యూఈలో కొనసాగించాలి
వామపక్ష తీవ్రవాద ప్రభావిత (ఎల్‌డబ్ల్యూఈ) జిల్లాల నుంచి తొలగించిన ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలను ఎల్‌డబ్ల్యూఈలో తిరిగి చేర్చాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఎల్ డబ్ల్యూఈ ప్రభావిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లతో తెలంగాణకు సరిహద్దు ఉండటంతో రాష్ట్ర భద్రతపైన మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. అంతర్గత భద్రతను దృష్టిలో ఉంచుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొండవాయి, ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామాల్లో సీఆర్ఫీఎఫ్ జేటీఎఫ్ క్యాంపులు ఏర్పాటు చేయాలని కేంద్ర అమిత్ షాను విజ్ఞప్తి చేశారు.
ఎస్పీవోలకు చెల్లించాల్సిన నిధుల్లో కేంద్రం వాటా 60 శాతం నాలుగేళ్ల నుంచి పెండింగ్ లో ఉందని, ఆ మొత్తం రూ.18.31 కోట్లు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. 1,065 మందిని ఎస్పీవోల్లో చేర్చుకోవడానికి నిబంధనలు సడలించాలని కోరారు. తెలంగాణ సరిహద్దుల్లోని ములుగు జిల్లా పేరూరు, ములుగు, కన్నాయిగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలిమెల, మహ ముత్తారం, కాటారం వంటి పోలీస్ స్టేషన్లను బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పోలీస్ శాఖ కొత్తగా నియమితులైన పోలీసు సిబ్బందికి గ్రేహౌండ్స్ ద్వారా తీవ్రవాద వ్యతిరేక వ్యూహాల్లో (AET) శిక్షణ ఇప్పిస్తున్నట్లు సీఎం తెలిపారు.
2024-25 సంవత్సరంలో ఈ రకమైన శిక్షణకు అదనపు బడ్జెట్ రూ.25.59 కోట్లు అవసరమని, ఆ మొత్తాన్ని విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఆధునిక అవసరాలకు అనుగుణంగా పోలీసు దళాలను తీర్చిదిద్దే పనులకు ఉద్దేశించిన ప్రత్యేక మౌలికవసతుల పథకం (ఎస్ఐఎస్)కు తెలంగాణకు కేవలం రూ.6.70 కోట్లు మాత్రమే విడుదల చేశారని, అవి ఏమాత్రం సరిపోవని అదనంగా రూ.23.56 కోట్లు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.
పునర్విభజన సమస్యలపై
పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర పునర్విభన సమస్యల పరిష్కారానికి సహకరించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. షెడ్యూల్ 9లోని ప్రభుత్వ భవనాలు, కార్పొరేషన్ల పంపిణీ, షెడ్యూల్ 10లోని సంస్థల వివాదం పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. పునర్విభజన చట్టంలో ఎక్కడా పేర్కొని ఆస్తులు, సంస్థలను ఆంధ్రప్రదేశ్ క్లెయిమ్ చేసుకుంటున్నందుని, వాటిలో తెలంగాణకు న్యాయం జరిగేలా చూడాలని అమిత్ షాను సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
ఐపీఎస్ అధికారులపై
తెలంగాణ రాష్ట్రానికి అదనంగా 29 అదనపు ఐపీఎస్ పోస్టులు కేటాయించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్ర పునర్విభజన సమయంలో తెలంగాణకు కేవలం 76 మంది ఐపీఎస్ అధికారులను మాత్రమే కేటాయించారని తెలిపారు. ఐపీఎస్ క్యాడర్‌పై రివ్యూ వెంటనే చేపట్టాలని కేంద్ర మంత్రిని సీఎం విజ్ఞప్తి చేశారు.
మెట్రో రైలు రెండో దశకు మద్దతు ఇవ్వండి...
హైదరాబాద్ సమగ్ర సీవరేజీ మాస్టర్ ప్లాన్ ను(సీఎస్ఎంపీ) అమృత్ 2.0లో చేర్చాలని లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా చేపట్టాలని కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దిల్లీలో కేంద్ర మంత్రి ఖట్టర్‌ను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం కలిశారు. చారిత్రక హైదరాబాద్ నగరంలో పురాతన మురుగుశుద్ధి వ్యవస్థనే ఉందని, అది ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా లేదని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. హైదరాబాద్ సమీప పురపాలక సంఘాల్లోనూ సరైన మురుగు నీటి పారుదల వ్యవస్థ లేదని కేంద్ర మంత్రి దృష్టికి ఆయన తీసుకెళ్లారు. హైదరాబాద్‌లో ప్రజల జీవన ప్రమాణాలు ప్రపంచ స్థాయి నగరంలో మాదిరి ఉండాలంటే నగరంతో పాటు సమీప మున్సిపాలిటీల్లో 100 శాతం ద్రవ వ్యర్థాల శుద్ధి చేయాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి ఖట్టర్‌కు వివరించారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు సమీప 27 పురపాలక సంఘాలతో కలుపుకొని కలిపి 7,444 కి.మీ.మేర రూ.17,212.69 కోట్లతో సీఎస్ఎంపీకి డీపీఆర్ రూపొందించినట్లు ఖట్టర్‌కు సీఎం తెలిపారు. ఆ డీపీఆర్‌ను కేంద్ర మంత్రి ఖట్టర్‌కు సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. సీఎస్ఎంపీని అమృత్ 2.0లో చేర్చి ఆర్థిక సహాయం చేయడం లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తించి నిధులివ్వాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు.
మూసీ నది ప్రక్షాళన
హైదరాబాద్ నగరంలో 55 కి.మీ. మేర మూసీ నది ప్రవహిస్తోందని, ఇరువైపులా కలిపి 110 కి.మీ.మేర నగరంలోని మురుగు అంతా మూసీలోనే చేరుతోందని కేంద్ర మంత్రి ఖట్టర్‌కు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇలా మురుగు మూసీలో చేరకుండా ఉండేందుకు ట్రంక్ సీవర్స్ మెయిన్స్, లార్జ్ సైజ్ బాక్స్ డ్రెయిన్స్, కొత్త సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి రూ.4 వేల కోట్లతో డీపీఆర్ రూపొందించినట్లు కేంద్ర మంత్రికి తెలిపారు. ఆ డీపీఆర్‌ను కేంద్ర మంత్రి ఖట్టర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సమర్పించారు. ఆ డీపీఆర్‌ను ఆమోదించడంతో పాటు పనుల అనుమతికి చొరవ చూపాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.
హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించి నాగోల్-శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (36.8 కి.మీ.), రాయదుర్గం-కోకాపేట నియోపొలిస్ (11.6 కి.మీ.), ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ.), మియాపూర్-పటాన్‌చెరు (13.4 కి.మీ.), ఎల్‌బీ నగర్-హయత్ నగర్ (7.1 కి.మీ.) మొత్తం 76.4 కి.మీ. మేర డీపీఆర్‌లు పూర్తయినట్లు కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఈ కారిడార్ల నిర్మాణానికి రూ.24,269 వ్యయం అవుతుందని అంచనా వేశామని, దీనిని కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం 50:50 రేషియోలో జాయింట్ వెంచర్‌గా చేపట్టాలని భావిస్తున్నట్లు సీఎం తెలిపారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ను సమర్పిస్తామని.. అది త్వరగా కార్యరూపం దాల్చేందుకు సహకరించాలని కేంద్ర మంత్రి ఖట్టర్‌ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు.