Telangana Rains : తెలంగాణలో దంచికొడుతున్న వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
20 October 2024, 14:42 IST
- Telangana Rains : తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్లు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. వర్షం కారణంగా.. రోడ్లన్నీ జలమయం అయ్యాయి.
తెలంగాణలో వర్షం
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఆదిలాబాద్, నిర్మల్, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, వనపర్తి, ఖమ్మం, వరంగల్, సిద్దిపేట, మేడ్చల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. భారీ వర్షం వరంగల్ నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నర్సంపేట పట్టణంలో రోడ్లు నిటమునిగాయి.
పంటలకు నష్టం..
ఆదివారం కురిసిన వర్షానికి నష్టం జరిగిందని రైతులు చెబుతున్నారు. వరి ఇప్పుడిప్పుడే పొట్టకు వస్తోందని.. ఈ వర్షం కారణంగా వరిపూత రాలిపోతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షపు చినుకులు బలంగా పడేసరిగి.. లేత వరి గింజలు నేల రాలుతున్నాయని వాపోతున్నారు. మరోవైపు ఈదురు గాలుల కారణంగా.. వరి నేలకొరుగుతోందని చెబుతున్నారు.
తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. 23, 24 తేదీల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. సోమ, మంగళవారం కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
మరో అల్పపీడనం..
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అక్టోబరు 22(మంగళవారం) నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి అక్టోబర్ 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. ఎటు వెళ్తుంది అనే దానిపై మరింత స్పష్టత రావాల్సి ఉందని తెలిపింది.
అక్టోబర్ 20న ఆదివారం.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.