Warangal Bhadrakali : విజయదశమి స్పెషల్.. వరంగల్ భద్రకాళి అమ్మవారి తెప్పోత్సవం.. అంతా సిద్ధం చేసిన అధికారులు-on the occasion of vijayadashami teppotsavam will be organized at warangal bhadrakali temple ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal Bhadrakali : విజయదశమి స్పెషల్.. వరంగల్ భద్రకాళి అమ్మవారి తెప్పోత్సవం.. అంతా సిద్ధం చేసిన అధికారులు

Warangal Bhadrakali : విజయదశమి స్పెషల్.. వరంగల్ భద్రకాళి అమ్మవారి తెప్పోత్సవం.. అంతా సిద్ధం చేసిన అధికారులు

Basani Shiva Kumar HT Telugu
Published Oct 12, 2024 09:48 AM IST

Warangal Bhadrakali : తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరుగాంచిన ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి ఆలయంలో.. దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం విజయదశమి సందర్భంగా తెప్పోత్సవం నిర్వహించనున్నారు. భక్తుల రద్దీకి తగ్గట్టు ఏర్పాట్లు చేశామని అధికారులు వెల్లడించారు.

వరంగల్ భద్రకాళి అమ్మవారి తెప్పోత్సవం
వరంగల్ భద్రకాళి అమ్మవారి తెప్పోత్సవం (HT)

భద్రకాళి దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా.. శనివారం సాయంత్రం 7 గంటలకు.. భద్రకాళి చెరువులో తెప్పోత్సవం నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. విజయదశమిని పురస్కరించుకొని ఉదయం గంటలకు అమ్మవారికి చక్రస్నానం, సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించారు. సాయంత్రం శ్రీభద్రకాళి భద్రేశ్వరులకు జల క్రీడోత్సవానికి సర్వం సిద్ధం చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు వెల్లడించారు.

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. నూతన వాహనాలు కొనుగోలు చేసిన వారు భద్రకాళి ఆలయంలో పూజలు చేయించుకుంటున్నారు. కుటుంబ సమేతంగా వచ్చి పూజల్లో పాల్గొంటున్నారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో రద్దీగా మారాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం నుంచే భక్తుల రద్దీ పెరిగింది.

అక్టోబర్ 3వ తేదీన ప్రారంభమైన ఉత్సవాలు రేపటి (ఆదివారం) వరకు నిర్వహిస్తారు. మొదటిరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. 2వ అన్నపూర్ణాలంకరణ, 3వ రోజు గాయత్రి అలంకారం, 4వ రోజు శ్రీమహాలక్ష్మి అలంకారం, 5వ రోజు రాజరాజేశ్వరి లలితాదేవి అలంకారంలో, 6వ రోజు భవానీ అలంకారంలో, 7వ రోజు సరస్వతీ అలంకారంలో, 8వ శ్రీభద్రకాళి మహాదుర్గాలంకారం, 9వ రోజు మహిషాసురమర్థినీ అలంకారణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆఖరిరోజు 13వ తేదీన నిర్వహించే భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ మహోత్సవం కనుల పండవగా సాగనుంది.

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వల్లభ్ నగర్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆలయానికి భక్తులు పోటెత్తారు. శనివారం ఉదయం నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్టు నిర్వాహకులు నాళం విజయ్ కుమార్, రవి కిషన్ వెల్లడించారు.

Whats_app_banner