Kurnool Jobs Racket: కర్నూలులో ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా, నిందితుల అరెస్ట్-dumming the unemployed in the name of jobs in kurnool with fake appointments ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Kurnool Jobs Racket: కర్నూలులో ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా, నిందితుల అరెస్ట్

Kurnool Jobs Racket: కర్నూలులో ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా, నిందితుల అరెస్ట్

HT Telugu Desk HT Telugu
Aug 22, 2024 11:27 AM IST

Kurnool Jobs Racket: క‌ర్నూలులో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల‌ను మోసం చేసిన ఘారానా మోస‌గాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం ముగ్గురు మోస‌గాళ్లు ఉండ‌గా అందులో ఒక ఫుడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ)లో ఉద్యోగిగా ఉన్నాడు. మోస‌గాళ్లు ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు.

ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వారిని అరెస్ట్‌ చేసిన పోలీసులు
ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వారిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

Kurnool Jobs Racket: క‌ర్నూలులో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల‌ను మోసం చేసిన ఘారానా మోస‌గాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం ముగ్గురు మోస‌గాళ్లు ఉండ‌గా అందులో ఒక ఫుడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ)లో ఉద్యోగిగా ఉన్నాడు. మోస‌గాళ్లు ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు.

క‌ర్నూల్ రూర‌ల్ మండ‌లం బాలాజీ న‌గ‌ర్‌లో షేక్ జ‌హీర్ బాషా (38), త‌న చెల్లెలు షేక్ అయోషా భాను (25), ఆమె భ‌ర్త షేక్ మహ‌మ్మ‌ద్ (26) నివాసం ఉంటున్నారు. వీరిలో షేక్ జ‌హీర్‌బాషా ఫుడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ)లో అసిస్టెంబ‌ట్ గ్రేడ్-3 ఉద్యోగిగా విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. ఈ ముగ్గురు ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామ‌ని చెప్పి నిరుద్యోగుల‌ను మోసం చేస్తున్నారు.

డ‌బ్బుల‌ను సుల‌భంగా సంపాదించాల‌నే ఉద్దేశంతో అమాయ‌కులైన నిరుద్యోగుల‌కు ఉద్యోగాల పేరుతో వ‌ల వేస్తున్నారు. క‌ర్నూలులోని రామ‌చంద్ర న‌గ‌ర్‌కు చెందిన నిరుద్యోగి షేక్ అబ్దుల్లా నుంచి రూ.2,08,000 తీసుకున్నారు. అలాగే మ‌రికొంత మంది ద‌గ్గ‌ర ఎక్కువ మొత్తంలో డ‌బ్బులు దండుకున్నారు. ఒక్కొక్క‌రి ద‌గ్గ‌ర దాదాపు రూ.3 ల‌క్ష‌ల నుంచి రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు డ‌బ్బులు తీసుకున్నారు.

కొన్ని రోజుల్లోనే ఫుడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ)కు చెందిన న‌కిలీ అపాయింట్‌మెంట్ ఆర్డ‌ర్ల కాపీలు వారికి ఇచ్చారు. దీంతో వారికి అనుమానం రాకుండా వ‌ర్క్ ఫ్రం హోం అని చెప్పి, కొన్ని నెల‌ల జీతాలు వారికి ఇచ్చిన మొత్తంలోనివే తీసి ఇచ్చేవారు. ఇలా షేక్ జ‌హీర్‌బాషా, వాళ్ల చెల్లెలు షేక్ అయేషా, ఆమె భ‌ర్త షేక్ మ‌హ్మ‌ద్ చ‌లామ‌ణి అయ్యేవారు. నిరుద్యోగులు కూడా ఉద్యోగం వ‌చ్చింద‌ని చెప్పి సంతోషంగా ఉంటూ సంబ‌ర‌ప‌డిపోయేవారు.

ఈ ర‌కంగా నెల నెల జీతం ఇవ్వ‌డంతో నిరుద్యోగుల్లో న‌మ్మకాన్ని క‌లిగించారు. ఇలా ఒక‌రి త‌రువాత ఒక‌రు చాలా మంది వ‌ద్ద నుంచి డ‌బ్బులు తీసుకుని న‌కిలీ అపాయింట్‌మెంట్ల‌తో చ‌లామ‌ణి అయ్యేవారు. ఒక నిరుద్యోగికి అనుమానం వ‌చ్చి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ మోస‌గాళ్ల వ్య‌వ‌హారం పోలీసుల‌కు చేరింది. దీంతో పోలీసులు బుధ‌వారం ముగ్గురు మోసగాళ్ల‌ను అరెస్టు చేశారు.

ముగ్గురిని రిమాండ్‌కు త‌ర‌లించారు. సీఐ శ్రీ‌ధ‌ర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువ‌త‌ను టార్గెట్ చేసి డ‌బ్బులు తీసుకుని, వారికి మాయ‌మాట‌లు చెప్పి న‌కిలీ అపాయింట్‌ మెంట్లు ఇచ్చి మోసం చేసేవార‌ని తెలిపారు. నిరుద్యోగ యువ‌త ఎలాంటి ప్ర‌లోభాల‌కు లోను కావ‌ద్ద‌ని, మోసపోవ‌ద్ద‌ని సూచించారు. అరెస్టు చేసిన ముగ్గురిపైన చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అన్నారు.

(జ‌గ‌దీశ్వ‌రరావు , హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner