Eluru News : ఏలూరు జిల్లా రైతన్నలకు వింత పరిస్థితి, నీరు అందక బీటలు వారిన వరి చేలు
Eluru News : నిన్న మొన్నటి వరకూ భారీ వర్షాలతో వరద నీరు పంట పొలాలను ముంచెత్తితే...ఇప్పుడు పరిస్థితి భిన్నంగా మారింది. నీరు అందక వరి చేలు బీటలు వారుతున్నాయి. ఇటీవల రాష్ట్రంలో పెరగడంతో వరి చేలకు నీటి తడిలేక బీటలు వారుతున్నాయని రైతులు వాపోతున్నారు. అధికారులు స్పందించి సాగునీరు అందించాలని కోరుతున్నారు.
Eluru News : ఏలూరు జిల్లాలో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీరు అందక వరి చేలు బీటలు వారుతున్నాయి. మొన్నటి వరకు భారీ వర్షాలతో వరద నీరు వచ్చిపడటంతో వరి పొలాలు ముంపునకు గురయ్యాయి. ఇటీవలి ఉష్టోగ్రతలు మళ్లీ పెరగడంతో ఎండల ఎక్కువయ్యాయి. దీంతో వరి పొలాలు నీటి తడిలేక బీటలు వారుతున్నాయి.
కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు అందక పంట భూములు బీటలు వారు తున్నాయన్నాయి. సాగునీరు అందించండి మహాప్రభో అంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు. కృష్ణా డెల్టాకు శివారు ప్రాంతమైన ఏలూరు రూరల్ మండలంలోని మాదేపల్లి, లింగారావు గూడెం,కాట్లంపూడి, జాలిపూడి తదితర గ్రామాలలో వందలాది ఎకరాలకు సాగునీరు అందడం లేదు.
కృష్ణా, గోదావరి నదుల్లో సమృద్ధిగా నీరున్నా పంట భూములకు అందించలేని దుస్థితి ఏర్పడింది. ఓల్డ్ జాలిపూడి కాల్వ ఆయకట్టు పరిధిలో పంట భూములకు సాగునీరు అందకపోయినా జలవనుల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు పెట్టుబడి పెట్టిన అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారు. ఇంకా నాట్లు వేయాల్సి ఉన్నా నీరు లేక నాట్లు వేయలేని పరిస్థితి ఏర్పడింది. కానీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి కృష్ణ డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు అందించి ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
రైతు సంఘం నాయకులు మంగళవారం సాయంత్రం బీటలు వారిన పంట పొలాలను పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు, కౌలు రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఎకరాకి నీరు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు కృష్ణా డెల్టా శివారు రైతులకు నీరందడం లేదని విమర్శించారు. కనీసం అధికారులు స్పందించలేదని ధ్వజమెత్తారు. కృష్ణ డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని, లేనిపక్షంలో రైతులను సమీకరించి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం