తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nallamala Saleshwaram : ఇకపై ఏడాది పొడవునా దర్శనం! తెలంగాణ అమర్‌నాథ్‌ యాత్రపై కీలక నిర్ణయం

Nallamala Saleshwaram : ఇకపై ఏడాది పొడవునా దర్శనం! తెలంగాణ అమర్‌నాథ్‌ యాత్రపై కీలక నిర్ణయం

HT Telugu Desk HT Telugu

20 April 2023, 15:49 IST

google News
    • Saleshwaram Latest News: సళేశ్వరం లింగమయ్య భక్తులకు గుడ్ న్యూస్ చెప్పారు అధికారులు. ఇకపై ఏడాది పొడవునా దర్శనం చేసుకునేలా అటవీ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
స‌లేశ్వ‌రం
స‌లేశ్వ‌రం (facebook)

స‌లేశ్వ‌రం

Nallamala Saleshwaram Yatra : నల్లమల సలేశ్వరం... తెలంగాణ అమర్‌నాథ్‌ యాత్రగా పేరొందిన సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది చైత్ర పౌర్ణమి సందర్భంగా 3 రోజుల పాటు ఆదివాసీలు ఘనంగా ఈ జాతర నిర్వహిస్తారు. ఇందుకోసం తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు. ఈసారి జరిగిన యాత్రకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరావటంతో విషాదం కూడా నెలకొంది. మొత్తం ముగ్గురు భక్తులు ప్రాణాలు విడిచారు. అయితే పరిస్థితులను అంచనా వేసిన అటవీ శాఖ అధికారులు.... కీలక నిర్ణయం తీసుకున్నారు.

సలేశ్వరం లింగమయ్య యాత్రను ఇకపై నిత్యం భక్తులకు అందుబాటులో ఉంచేందుకు సిద్ధమైంది అటవీ శాఖ. ఓవైపు పర్యావరణానికి మరోవైపు వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ప్యాకేజీని రూపొందించింది. ఈ ప్రత్యేక పర్యాటక ప్యాకేజీని ఉన్నతాధికారులు అనుమతిస్తే సుమారు నెలల తరబడి భక్తులు నల్లమలలో సాహస యాత్ర చేపట్టేందుకు అవకాశం దక్కనుంది. ఫలితంగా ఆదాయం కూడా రాబట్టేలా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే సలేశ్వరం లింగమయ్య దర్శనానికి టూరిజం ప్యాకేజ్ ద్వారా అవకాశం కల్పించడంపై కార్యాచరణను సిద్ధం చేస్తోంది.

సలేశ్వరం నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అడవులలో ఉంటుంది. శ్రీశైలం – హైదరాబాద్ రహదారిలో అడవిలోకి వెళ్లాలి. మెయిన్ రోడ్డు నుంచి.. సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సుమారు 30 కిలోమీటర్ల దగ్గర వరకూ వెళ్లొచ్చు. మిగిలిన 5 కిలో మీటర్లు నడవాలి. రాళ్లు, రప్పలు ఉంటాయి. అయితే పది కిలోమీటర్ల దూరం వెళ్లగానే రోడ్డు పక్కన నిజాం కాలం నాటి ఒక పురాతన కట్టడం కనిపిస్తుంది. భక్తులు వచ్చేటప్పుడు.. వస్తున్నాం.. వస్తున్నాం.. లింగమయ్యో అంటూ వస్తారు. వెళ్లేటప్పుడు పోతున్నం.. పోతున్నం లింగమయ్యో అని భజన చేస్తూ వెళ్తారు. సలేశ్వరం లోయ దాదాపు రెండు కిలో మీటర్ల పొడవు ఉంటుంది. ప్రకృతిలో గడపాలని అనుకునే వారికి ఈ ప్రదేశం చాలా నచ్చుతుంది. సలేశ్వరం వెళ్లే దారిలో చెంచు గుడారాలు దాటుకుంటూ వెళ్లాలి.

సలేశ్వరంలో శివుడు లింగ రూపంలో లోయలో దర్శనమిస్తాడు. ఈ ప్రదేశానికి ఏడాదిలో 3 రోజులు మాత్రమే అనుమతి ఉంటుంది. మిగిలిన రోజుల్లో.. అనుమతి ఇవ్వరు. జంతువులు తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ జలపాతం చూసేందుకు ఎంతో అందంగా ఉంటుంది. సలేశ్వరం ఆలయాన్ని దర్శించుకునేందుకు.. మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నలుమూలల నుంచి భక్తులు వస్తారు. ఈ పురాతన దేవాలయం గురించి పురాణాల్లో కూడా ఉందట. గుడి శంఖు ఆకారంలో కనిపిస్తుంది. పరమ శివుడికి అంకితం చేసిన ఈ గుడిని ఆరు లేదా ఏడో శతాబ్దంలో కట్టినట్టుగా చెబుతారు. నల్లమల అడవుల్లోని చెంచులు సలేశ్వరుడిని కులదైవంగా భావిస్తారు. ఇప్ప పువ్వు, తేనె నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక్కడ పూజలు సైతం వీళ్లే నిర్వహిస్తారు. తాజా నిర్ణయం అమల్లోకి వస్తే…. ఏడాది పొడవునా సళేశ్వరం యాత్రకు వెళ్లొచ్చు…!

తదుపరి వ్యాసం