తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nallamala Saleshwaram : తెలంగాణ అమర్‌నాథ్‌ యాత్రలో విషాదం...ముగ్గురు మృత్యువాత

Nallamala Saleshwaram : తెలంగాణ అమర్‌నాథ్‌ యాత్రలో విషాదం...ముగ్గురు మృత్యువాత

HT Telugu Desk HT Telugu

06 April 2023, 19:19 IST

google News
    • Nallamala Saleshwaram Jatara 2023: స‌లేశ్వ‌రం జాత‌రలో విషాదం నెల‌కొంది. భక్తుల రద్దీతో తొక్కిసలాట జరగగా ఇద్దరు భక్తులు మృతి చెందారు. మరొకరు గుండెపోటుతో ప్రాణాలు విడిచారు.
స‌లేశ్వ‌రం జాత‌రలో విషాదం
స‌లేశ్వ‌రం జాత‌రలో విషాదం (twitter)

స‌లేశ్వ‌రం జాత‌రలో విషాదం

Nallamala Saleshwaram Jatara: నల్లమల సలేశ్వరం జాతర(తెలంగాణ అమర్‌నాథ్‌ యాత్ర)లో విషాదం నెలకొంది. జాతరకు భక్తులు భారీగా పోటెత్తారు. ఈ క్రమంలో ఉదయం తొక్కిసలాటలో ఇద్దరు భక్తులు మృతి చెందారు. గుండెపోటుతో విజయ అనే మహిళ ప్రాణాలు విడించింది. దీంతో మొత్తం ముగ్గురు భక్తులు సళేశ్వర యాత్రలో చనిపోయినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు భక్తుల రద్దీతో అక్కడికి వెళ్లే దారులన్నీ కిటకిటలాడుతున్నారు. దారిమార్గంలో కూడా రాకపోకలు స్తంభించాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ ఏడాది సలేశ్వరం యాత్రకు భక్తులు పోటెత్తారు. లింగమయ్య నామస్మరణతో నల్లమల కొండలు మార్మోగుతున్నాయి.

చైత్ర పౌర్ణమి సందర్భంగా ఏటా 3 రోజుల పాటు ఆదివాసీలు ఘనంగా ఈ జాతర నిర్వహిస్తారు. ఇందులో భాగంగా బుధవారం ప్రారంభం కాగా... శుక్రవారం వరకు జాతర నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి శివయ్య భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో సలేశ్వరంలో పరిస్థితి అదుపు తప్పింది. అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నారు.

సలేశ్వరం నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అడవులలో ఉంటుంది. శ్రీశైలం – హైదరాబాద్ రహదారిలో అడవిలోకి వెళ్లాలి. మెయిన్ రోడ్డు నుంచి.. సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సుమారు 30 కిలోమీటర్ల దగ్గర వరకూ వెళ్లొచ్చు. మిగిలిన 5 కిలో మీటర్లు నడవాలి. రాళ్లు, రప్పలు ఉంటాయి. అయితే పది కిలోమీటర్ల దూరం వెళ్లగానే రోడ్డు పక్కన నిజాం కాలం నాటి ఒక పురాతన కట్టడం కనిపిస్తుంది.

భక్తులు వచ్చేటప్పుడు.. వస్తున్నాం.. వస్తున్నాం.. లింగమయ్యో అంటూ వస్తారు. వెళ్లేటప్పుడు పోతున్నం.. పోతున్నం లింగమయ్యో అని భజన చేస్తూ వెళ్తారు. సలేశ్వరం లోయ దాదాపు రెండు కిలో మీటర్ల పొడవు ఉంటుంది. ప్రకృతిలో గడపాలని అనుకునే వారికి ఈ ప్రదేశం చాలా నచ్చుతుంది. సలేశ్వరం వెళ్లే దారిలో చెంచు గుడారాలు దాటుకుంటూ వెళ్లాలి.

సలేశ్వరంలో శివుడు లింగ రూపంలో లోయలో దర్శనమిస్తాడు. ఈ ప్రదేశానికి ఏడాదిలో 3 రోజులు మాత్రమే అనుమతి ఉంటుంది. మిగిలిన రోజుల్లో.. అనుమతి ఇవ్వరు. జంతువులు తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ జలపాతం చూసేందుకు ఎంతో అందంగా ఉంటుంది. సలేశ్వరం ఆలయాన్ని దర్శించుకునేందుకు.. మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నలుమూలల నుంచి భక్తులు వస్తారు.

ఈ పురాతన దేవాలయం గురించి పురాణాల్లో కూడా ఉందట. గుడి శంఖు ఆకారంలో కనిపిస్తుంది. పరమ శివుడికి అంకితం చేసిన ఈ గుడిని ఆరు లేదా ఏడో శతాబ్దంలో కట్టినట్టుగా చెబుతారు. నల్లమల అడవుల్లోని చెంచులు సలేశ్వరుడిని కులదైవంగా భావిస్తారు. ఇప్ప పువ్వు, తేనె నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక్కడ పూజలు సైతం వీళ్లే నిర్వహిస్తారు.

తదుపరి వ్యాసం