Saleshwaram | నల్లమల అడవి మధ్యలోని సలేశ్వరం శివయ్య ఎందుకంత ప్రత్యేకత-nallamala forest saleshwaram jatara only open for few days ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Saleshwaram | నల్లమల అడవి మధ్యలోని సలేశ్వరం శివయ్య ఎందుకంత ప్రత్యేకత

Saleshwaram | నల్లమల అడవి మధ్యలోని సలేశ్వరం శివయ్య ఎందుకంత ప్రత్యేకత

HT Telugu Desk HT Telugu
Apr 17, 2022 12:42 PM IST

దట్టమైన నల్లమల అడవులు.. కొండలు కోనలు.. జలపాతాలు.. ప్రకృతి ఒడిలోకి వెళ్లినట్టు ఉంటుంది. అటవీ మధ్యలోకి వెళ్లగానే.. సలేశ్వరం లింగమయ్య గుడి కనిపిస్తుంది. ప్రతి ఏటా.. మూడు లేదా అయిదు రోజులు జరిగే ఈ జాతర చాలా ఫేమస్.

సలేశ్వరం జాతర
సలేశ్వరం జాతర

నల్లమల అటవి ప్రాంతంలో ఉండే.. సలేశ్వరం శివయ్యకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. కేవలం ఏడాదిలో కొన్ని రోజులు మాత్రమే గుడి తెరవడం దీని ప్రత్యేకత. చైత్ర పౌర్ణమి రోజునే ఈ దేవాలయాన్ని తెరుస్తారు. ఏడాదిలో మూడు నుంచి ఐదు రోజులు మాత్రమే ఈ గుడి తెరిచి ఉంటుందన్న మాట. అయితే ఈ ఏడాది సలేశ్వరం జాతర ఏప్రిల్​ 15న మొదలైంది.. ఏప్రిల్ 17వ తేదీన ముగుస్తుంది. అంటే ఆదివారం అయిపోతుంది. కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత.. ఈసారి గుడిని తెరిచారు.

సలేశ్వరం నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అడవులలో ఉంటుంది. శ్రీశైలం – హైదరాబాద్ రహదారిలో అడవిలోకి వెళ్లాలి. మెయిన్ రోడ్డు నుంచి.. సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సుమారు 30 కిలోమీటర్ల దగ్గర వరకూ వెళ్లొచ్చు. మిగిలిన 5 కిలో మీటర్లు నడవాలి. రాళ్లు, రప్పలు ఉంటాయి. అయితే పది కిలోమీటర్ల దూరం వెళ్లగానే రోడ్డు పక్కన నిజాం కాలం నాటి ఒక పురాతన కట్టడం కనిపిస్తుంది.

భక్తులు వచ్చేటప్పుడు.. వస్తున్నాం.. వస్తున్నాం.. లింగమయ్యో అంటూ వస్తారు. వెళ్లేటప్పుడు పోతున్నం.. పోతున్నం లింగమయ్యో అని భజన చేస్తూ వెళ్తారు. సలేశ్వరం లోయ దాదాపు రెండు కిలో మీటర్ల పొడవు ఉంటుంది. ప్రకృతిలో గడపాలని అనుకునే వారికి ఈ ప్రదేశం చాలా నచ్చుతుంది. సలేశ్వరం వెళ్లే దారిలో చెంచు గుడారాలు దాటుకుంటూ వెళ్లాలి.

సలేశ్వరంలో శివుడు లింగ రూపంలో లోయలో దర్శనమిస్తాడు. ఈ ప్రదేశానికి ఏడాదిలో నాలుగు రోజులు మాత్రమే అనుమతి ఉంటుంది. మిగిలిన రోజుల్లో.. అనుమతి ఇవ్వరు. జంతువులు తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ జలపాతం చూసేందుకు ఎంతో అందంగా ఉంటుంది. సలేశ్వరం ఆలయాన్ని దర్శించుకునేందుకు.. మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నలు మూలల నుంచి భక్తులు వస్తారు.

ఈ పురాతన దేవాలయం గురించి పురాణాల్లో కూడా ఉందట. గుడి శంఖు ఆకారంలో కనిపిస్తుంది. పరమ శివుడికి అంకితం చేసిన ఈ గుడిని ఆరు లేదా ఏడో శతాబ్దంలో కట్టినట్టుగా చెబుతారు. నల్లమల అడవుల్లోని చెంచులు సలేశ్వరుడిని కులదైవంగా భావిస్తారు. ఇప్ప పువ్వు, తేనె నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక్కడ పూజలు సైతం వీళ్లే నిర్వహిస్తారు.

IPL_Entry_Point

టాపిక్