Tiger Dead | నల్లమల అడవుల్లో పులి మృతి.. ఈ ఆరునెలల్లో ఎన్ని చనిపోయాయంటే?
నల్లమల అడవుల్లో తాజాజా ఓ పులి చనిపోయింది. ప్రత్యేకంగా ఈ విషయం చెప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే.. ఈ ఆరునెలల వ్యవధిలోనే ఇక్కడ మూడు పులులు చనిపోయాయి.
ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ (AITE) చేస్తున్న సమయంలో నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఆత్మకూర్ డివిజన్‌లోని బైర్లుటీలో పులి కళేబరం లభించింది. అటవీశాఖ సిబ్బంది పెట్రోలింగ్ చేస్తుండగా అడవి లోపల పులి కళేబరాన్ని గుర్తించారు. అయితే ఈ ఆరునెలల వ్యవధిలో చనిపోయిన పులులతో కలిపి ఇది మూడోది.
ఆత్మకూర్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్‌ఓ) అలెంచన్ టెరాన్ మాట్లాడుతూ.. పులి కళేబరం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి పోస్టుమార్టం నిర్వహించారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్‌టీసీఎ)కి పులి చనిపోయిందని సమాచారం అందించారు. పులికి, మరో జంతువుకు మధ్య జరిగిన పోట్లాట కారణంగానే చనిపోయినట్టుగా పోస్టుమార్టంలో తేలింది.
గత ఏడాది రాష్ట్ర అటవీ శాఖ చేపట్టిన సర్వేలో కూడా ఇదే పులి ఫొటో వచ్చిందని డీఎఫ్‌వో పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో నాలుగు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పులుల గణన చేస్తారని, రాష్ట్ర అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా సర్వే ఉంటుందని వెల్లడించారు. సర్వేలో భాగంగా జంతువుల వీడియోలు, చిత్రాలను తీసెందుకు ప్రతి సంవత్సరం కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. గత ఆరు నెలల్లో రిజర్వ్‌లో మూడు పులులు చనిపోయినట్టుగా తెలిపారు. మరణాలను అసహజంగా పరిగణించడం లేదని డీఎఫ్ఓ అన్నారు. జంతువులకు ఆవాసాలు తగ్గిపోవడంతో ప్రాణాల మీదకు వచ్చేలా పోరాటాలు జరుగుతున్నాయన్నారు.
నల్లమలలో ఉన్న నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్ 5927 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. ఈ రిజర్వ్ ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాలు, తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో విస్తరించి ఉంది. 2018-19లో ఇక్కడ పులుల సంఖ్య దాదాపు 47 ఉన్నాయి. ఆ తర్వాతి సంవత్సరంలో ఇది 63కి పెరిగింది. 2020-2021లో దీని సంఖ్య దాదాపు 65కి చేరింది. ఈ ఏడాది పులుల అంచనా జరుగుతుందని.., ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.