Gajwel Ganja Seized : గజ్వేల్ లో గంజాయి ముఠా అరెస్ట్, ఏడుగురికి రిమాండ్
25 March 2024, 20:20 IST
- Gajwel Ganja Seized : గజ్వేల్ లో గంజాయి విక్రయిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 825 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు భద్రాచలం నుంచి గంజాయి తెచ్చి గజ్వేల్ పరిసరాల్లో విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు.
గజ్వేల్ లో గంజాయి ముఠా అరెస్ట్
Gajwel Ganja Seized : గంజాయిని విక్రయించి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో భద్రాచలం నుంచి గంజాయిని తీసుకువచ్చి కొంత సేవించి మిగిలిన గంజాయిని గజ్వేల్ పరిసర ప్రాంతాలలో అమ్మడానికి వెళుతున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 825 గ్రాముల గంజాయిని, 5 మోటర్ సైకిళ్లు, 7 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి ఆధ్వర్యంలో రాయపోల్ ఎస్ఐ రఘుపతి... తన సిబ్బందితో కలిసి ఆదివారం సాయంత్రం రాయపోల్ గ్రామ శివారు కొత్తపల్లి ఎక్స్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో బ్యాగరి స్వామి (21), కోనేరు మహేష్ (20), గొల్ల రాజు (21), బాకీ రాజు (20), పంజాల అనిల్ (25), దేవుని కృష్ణమూర్తి (25), క్యామిద్రి వంశీ (23) ఏడుగురు వ్యక్తులు 5 మోటార్ సైకిల్ పై అనుమానాస్పదంగా తిరుగుచూ పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా పట్టుకొని విచారించారు. బ్యాగరి స్వామి అనే యువకుడు తన స్నేహితులతో కలసి భద్రాచలం కంది గూడెంకు వెళ్లి అక్కడ ఒక కిలో గంజాయి తీసుకుని వచ్చి అందరూ కలిసి కొంత సేవించారు. మిగిలిన గంజాయి అమ్మి డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకొన్నారు.
పిల్లల కదలికలపై కన్నేసి ఉంచండి
దీంతో మిగిలిన గంజాయిని(Ganja) అందరూ సమానంగా పంచుకున్నారు. ఒక్కొక్క ప్యాకెట్ 10 గ్రాములు ఉండేటట్లు తయారు చేసి 300 రూపాయలకు అమ్మాలని అనుకున్నారు. ఆ ప్యాకెట్ లను తీసుకొని గజ్వేల్ పట్టణ పరిసర ప్రాంతాలలో అమ్ముదామని వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్దనున్న 825 గ్రాముల గంజాయిని, 5 మోటర్ సైకిళ్లు, 7 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ తొగుట సీఐ లతీఫ్ ఏడుగురు నిందితులను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్(Judicial Remand) కు పంపించారు. నిందితులను చాకచక్యంగా పట్టుకుని గంజాయి స్వాధీనం చేసుకున్నందుకు గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి రాయపోల్ ఎస్ఐ, రఘుపతిని, సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా తొగుట సీఐ లతీఫ్, రాయపోల్ ఎస్ఐ రఘుపతి ఇరువురు మాట్లాడుతూ గ్రామాలలో, హోటళ్లలో కల్లు డిపోల వద్ద ఇతర ప్రదేశాలలో ఎవరైనా గంజాయి అమ్ముతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఏం చేస్తున్నారని, ఎక్కడికి వెళుతున్నారని వారి కదలికలపై ఒక కన్నేసి ఉంచాలని తెలిపారు. గ్రామాలలో మరే ఇతర ప్రదేశాలలోనైనా గంజాయి కలిగి ఉన్న, విక్రయించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
దాబాలో తనిఖీలు అక్రమ మద్యం పట్టివేత
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలోని పోచాపూర్ గ్రామ శివారులోని మధు ఫ్యామిలీ దాబాలో అధిక ధరలకు మద్యం అమ్ముతున్నట్లు సమాచారంతో సంగారెడ్డి(Sangareddy) జిల్లా టాస్క్ఫోర్స్, సీసీఎస్ సిబ్బంది తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 58 లీటర్ల మద్యం బాటిళ్లను(Illegal Liquor) స్వాధీనం చేసుకున్నారు. సిర్గాపూర్ ఎస్ఐ మహిపాల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పోచాపూర్ కు చెందిన దాబా యజమాని రాములు సిర్గాపూర్ వైన్స్(Wines) నుంచి ఎమ్మార్పీ ధరలకు మద్యం కొని దాబాలో అధిక ధరలకు అమ్ముతున్నట్లు సమాచారం రాగానే తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. యజమాని రాములును అదుపులోకి తీసుకొని 58 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. యజమాని రాములును తదుపరి విచారణకై సిర్గాపూర్ పోలీసు స్టేషన్ కు తరలించారు.