Sangareddy Police: కిడ్నాప్ అనుమానాలతో అమాయకులపై దాడులొద్దు.. సంగారెడ్డి ఎస్పీ వార్నింగ్…
Sangareddy Police: కిడ్నాప్ వదంతులు Kidnap Rumours, అనుమానాలతో అమాయకులపై దాడులు చేస్తే కేసులు తప్పవని సంగారెడ్డి జిల్లా పోలీసులు Police వార్నింగ్ ఇచ్చారు.
Sangareddy Police: కిడ్నాప్‌లకు పాల్పడుతున్నారనే అనుమానాలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని సంగారెడ్డి జిల్లా పోలీసులు హెచ్చరించారు.
చిన్న పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారనే అనుమానంతో గ్రామాల్లోకి కొత్తగా వచ్చే వారిని కొంతమంది కిడ్నాపర్లు అని ఆరోపిస్తూ కొడుతున్నారని, శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అలాంటి వ్యక్తులపై చట్టరీత్య కఠిన చర్యలు తీసుకుంటామని సంగారెడ్డి ఎస్పీ రూపేష్ Rupesh IPS హెచ్చరించారు.
సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నిర్మూలన, ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో కొండాపూర్ పోలీసు స్టేషన్‌లో Kondapur PS ప్రజా అవగాహన కార్యక్రమంలో ఎస్పీ జిల్లా ప్రజలను ఉద్దేశించి పలు సూచనలు చేశారు.
గత కొన్ని రోజులుగా చిన్న పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారని సోషల్ మీడియాలో వదంతులు వినిపిస్తున్నాయని, ఈ నేపథ్యంలో కొంతమంది అమాయక ప్రజలను కొడుతూ వారిని మానసికంగా, శారీకంగా హింసిస్తున్నారని, అలాంటి వారిపై కేసులు తప్పవని హెచ్చరించారు.
జిల్లాలో కొండాపూర్ మండలంలో మ్యూజియం సందర్శనకు వచ్చిన యాత్రికులను కొంత మంది స్థానికులు కిడ్నాపర్స్ అని ఆరోపిస్తూ కొట్టారని వివరించారు. ఎవరైనా చిన్న పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారనే అనుమానం వస్తే అలాంటి వ్యక్తులను పట్టుకొని డయల్ 100 కు , సమీప పోలీసు స్టేషన్ కు గాని సమాచారం అందించాలని సూచించారు.
కిడ్నాప్ చేస్తున్నారనే అనుమానంతో అమాయక ప్రజలను కొట్టి, ఇబ్బందులకు గురిచేసి,చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని తెలియజేశారు. కిడ్నాప్ వదంతులను నమ్మొద్దని, కిడ్నాప్స్ జరుగుతున్నది నిజమే అయితే పోలీసు శాఖ తరపున జిల్లా ప్రజలను అప్రమత్తం చేస్తామని చెప్పారు.
ఉద్యోగ అవకాశాలు పోతాయి…
యువత సంబంధం లేని గోడవలలో తలదూర్చి అనవసర ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని ఎస్పీ హెచ్చరించారు. నూతన కానిస్టేబుల్ నియామకాల్లో చాలా మంది పోలీస్ వెరిఫికేషన్‌లో ఉద్యోగాలు కోల్పోయారని ప్రకటించారు.
యువత చిన్న, చిన్న గొడవలతో కేసుల్లో చిక్కుకుని ఉద్యోగానికి దూరమయ్యారని అన్నారు. యువత ఏ ఉద్యోగం సాధించాలన్నా ముందుగా పోలీసు వెరీఫికేషన్ తప్పనిసరి ఉంటుందని గుర్తుంచుకోవాలన్నారు. చిన్న, చిన్న, తప్పిదాలతో పోలీసు రికార్డుల్లోకి చేరి ఉద్యోగ అవకాశాలను చేజార్చుకోవద్దని సూచించారు.
అనవసర లింక్‌లు ఓపెన్ చేయొద్దు...
స్మార్ట్ ఫోన్ ల వాడకం విపరీతంగా పెరిగిన నేటి సమాజంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకీ మితిమీరి పోతున్నాయని ఎస్పీ తెలిపారు. ప్రజలలో సైబర్ నేరాల గురించి అవగాహన లేకపోవడం వల్ల డబ్బులు ఫ్రీ గా వస్తాయని చెప్పగానే ఆశపడి సైబర్ నెరగాళ్లకు OTP, PASSWARD చెబుతున్నారన్నారు.
ఆన్లైన్లో అపరిచిత వ్యక్తులతో పరిచయాలకు దూరంగా వుండాలని సూచించారు. ఆన్లైన్ మోసాల గురించి అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలన్నారు. అనవసర లింక్ లు ఓపెన్ చేసి కష్టాలు కొని తెచ్చుకోవద్దన్నారు.
ఎవరైనా సైబర్ నేరాలకు గురైనట్లైతే వెంటనే 1930 నెంబర్ కు ఫిర్యాదు చేయాలన్నారు. నేరాల నియంత్రణతో పాటు నేరతలో దోహదపడే సి.సి. కెమెరాల ఆవశ్యకతను ప్రజలకు తెలియజేస్తూ, చాలా వరకు కేసులు సిసి కెమెరా ఆధారంగానే ఛేదించడం జరుగుతుందని అన్నారు.
(రిపోర్టింగ్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి)