Donations to CM Relief Fund : తెలుగు రాష్ట్రాల్లో భారీ వరదలు.. సీఎంల సహాయనిధికి విరాళాలు.. ఎవరెవరు ఎంత ఇచ్చారో తెలుసా?
03 September 2024, 17:45 IST
- Donations to CM Relief Fund : తెలుగు రాష్ట్రాలను వరదలు వణికించాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు వరదల్లో కలిసిపోయాయి. వందల సంఖ్యలో ఇళ్లు నేలమట్టం అయ్యాయి. వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో.. ప్రముఖులు విరాళాలు ప్రకటించారు.
ముఖ్యమంత్రికి తన విరాళం అందజేస్తున్న విద్యార్థిని
తెలుగు రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఏపీ, తెలంగాణలోని ప్రధాన నగరాలతో పాటు.. పల్లెలు కూడా వరదల్లో చిక్కుకున్నాయి. భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఇంకా అనేక మంది వరదల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వారికి ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరద బాధితులకు తమ వంతు సాయం చేయడానికి చాలామంది ముందుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి విరాళాలు ఇస్తున్నారు.
పదో తరగతి విద్యార్థిని..
మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన పదో తరగతి విద్యార్థిని ముత్యాల సాయి సింధు.. వరద సహాయక కార్యక్రమాల కోసం తన ఔదార్యాన్ని చాటుకున్నారు. వరదల్లో సర్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలవడానికి.. తన కిట్టీ బ్యాంకులో పొదుపు చేసుకున్న రూ.3 వేలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించారు. మహబూబాబాద్ కలెక్టరేట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఈ సహాయాన్ని అందజేశారు. సీఎం రేవంత్ ఆ అమ్మాయిని అభినందించారు.
ఎవరెవరు ఎంతెంత ఇచ్చారంటే..
తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు తమ ఒక రోజు వేతనం రూ.130 కోట్ల చెక్కును ముఖ్యమంత్రికి అందించారు.
జూనియర్ ఎన్టీఆర్ ఇరు రాష్ట్రాల సీఎం సహాయనిధికి చెరో రూ. 50 లక్షల చొప్పున కోటి విరాళం ప్రకటించారు.
విశ్వక్ సేన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రూ. 5 లక్షల చొప్పున రూ. 10 లక్షల విరాళం ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు రూ.15 లక్షల చొప్పున సిధ్ధూ జొన్నలగడ్డ రూ. 30 లక్షల విరాళం ప్రకటించారు.
రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.25 లక్షల చొప్పున రూ.50 లక్షలు త్రివిక్రమ్ , రాధాకృష్ణ, నాగవంశీ ప్రకటించారు.
దర్శకులు అట్లూరి వెంకీ.. ఏపీ, తెలంగాణకు రూ. 5 లక్షల చొప్పున రూ.10 లక్షల విరాళం ప్రకటించారు.
రెండు రాష్ట్రాలకు రూ.50 లక్షల చొప్పు రూ.కోటి విరాళం ప్రకటించారు నందమూరి బాలకృష్ణ.
నిర్మాత అశ్వినీదత్ ఏపీ సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ప్రకటించారు.