AP NEW DGP: ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా ద్వారకా తిరుమలరావు నియామకం-dwarka tirumala rao appointed as the new dgp of andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap New Dgp: ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా ద్వారకా తిరుమలరావు నియామకం

AP NEW DGP: ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా ద్వారకా తిరుమలరావు నియామకం

Sarath chandra.B HT Telugu
Jun 20, 2024 06:00 AM IST

AP NEW DGP: ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా ద్వారకా తిరుమల రావును నియమిస్తూ బుధవారం రాత్రి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీ నూతన డీజీపీగా ద్వారకా తిరుమల రావు
ఏపీ నూతన డీజీపీగా ద్వారకా తిరుమల రావు

AP NEW DGP: ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా ద్వారకా తిరుమల రావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో 1086 జారీ చేశారు. ద్వారకా తిరుమలకు రావుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్న ద్వారకా తిరుమలరావు ఏపీ నూతన డీజీపీగా గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు.

1989 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ద్వారకా తిరుమల రావు గతంలో పలు హోదాల్లో పనిచేశారు. సౌమ్యుడు, విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉంటారనే పేరుంది. రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారుల్లో సీనియర్‌‌గా ఉన్న ద్వారకా తిరుమల రావును హెడ్ ఆఫ్‌ పోలీస్ ఫోర్సెస్‌‌గా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్‌ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

ద్వారకాతిరుమల రావు ధర్మవరంలో ఏఎస్పీగా తొలుత పనిచేశారు. నిజామాబాద్ జిల్లా ఆపరేషన్స్ విభాగం ఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఎస్పీ పదోన్నతి లభించిన తర్వాత అనంతపురం, కడప, మెదక్‌ జిల్లాల్లో పనిచేశారు. విజయవాడ రైల్వే ఎస్పీగా, సీఐడీ, సిబిఐలలో పనిచేశారు. అనంతపురం, హైదరాబాద్ రేంజ్‌‌తో పాటు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో‌లో బాధ్యతలు నిర్వర్తించారు. ఆక్టోపస్, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ విభాగాల్లో ఐజీగా పనిచేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సైబరాబాద్‌ పోలీస్ కమిషనర్‌గా, రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలునిర్వర్తించారు. గతంలో అగ్రిగోల్డ్ వంటి కీలకమైన కేసుల దర్యాప్తును పర్యవేక్షించారు. 2021 జూన్‌ నుంచి ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వర్తిస్తున్నారు.

మాజీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు పదవీ విరమణ సమయంలో ఆయనకు వీడ్కోలు పలికిన వారిలో ద్వారకా తిరుమలరావు కూడా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని దృష్టిలో ఉంచుకుని సహచరులు, పోలీస్ ఉన్నతాధికారులు ఎవరు ఏబీ వెంకటేశ్వరరావుకు వీడ్కోలు పలికేందుకు కూడా రాలేదు. ద్వారకా తిరుమలరావుతో పాటు అతి కొద్ది మంది మాత్రమే ఏబీ వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

మాజీ డీజీపీపై ఈసీ వేటు...

ఏపీలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత డీజీపీగా ఉన్న రాజేంద్రనాథ్‌ రెడ్డిపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రధాని మోదీ చిలకలూరి పేట బహిరంగ సభకు ఏర్పాట్లు చేయడంలో విఫలం కావడం, ట్రాఫిక్ నియంత్రణలో అధికారుల వైఫల్యంతో పలువురు అధికారులపై ఈసీ వేటు వేసింది. సీనియారిటీలో దిగువన ఉన్నా ఏపీ ప్రభుత్వం రాజేంద్రనాథ్‌ రెడ్డికి డీజీపీగా అవకాశం కల్పించింది. ప్రస్తుతం సీనియారిటీ ప్రాతిపదికన హరీష్ కుమార్ గుప్తా స్థానంలో ద్వారకా తిరుమలరావును డీజీపీగా నియమించారు.

Whats_app_banner