14 hours working : ‘ఉద్యోగులు రోజుకు 14 గంటలు పనిచేయాలి'- ప్రభుత్వాన్ని కోరిన ఐటీ కంపెనీలు..-karnataka it firms propose 14 hour work in a day employees fume ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  14 Hours Working : ‘ఉద్యోగులు రోజుకు 14 గంటలు పనిచేయాలి'- ప్రభుత్వాన్ని కోరిన ఐటీ కంపెనీలు..

14 hours working : ‘ఉద్యోగులు రోజుకు 14 గంటలు పనిచేయాలి'- ప్రభుత్వాన్ని కోరిన ఐటీ కంపెనీలు..

Sharath Chitturi HT Telugu
Jul 21, 2024 11:43 AM IST

IT firms working hours : ఐటీ ఉద్యోగులకు కంపెనీలు షాక్​ ఇస్తున్నాయి! ఉద్యోగులు 14 గంటలు పనిచేసే విధంగా అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించాయి. పూర్తి వివరాలు..

ఉద్యోగులకు రోజుకు 14 గంటల పని!
ఉద్యోగులకు రోజుకు 14 గంటల పని!

ఇప్పటికే ఉద్యోగంలో నలిగిపోయి అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఐటీ ఉద్యోగులకు చేదు వార్త! ఉద్యోగులు ఇక నుంచి రోజుకు 14 గంటలు పని చేయాలని కర్ణాటకలోని అనేక ఐటీ సంస్థలు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్​ చేస్తున్నాయి.

రోజుకు 14 గంటల పని..!

పలు మీడియా కథనాల ప్రకారం.. కర్ణాటక షాప్స్​- కమర్షియల్​ ఎస్టాబ్లిష్​మెంట్స్​ యాక్ట్​ 1961ని సవరించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులు ఇక నుంచి 14 గంటలు పనిచేసే విధంగా చట్టంలో సవరణలు తీసుకురావాలని ఐటీ సంస్థలు డిమాండ్​ చేస్తున్నాయి. ఇది కార్యరూపం దాల్చితే.. ఉద్యోగులు 14 గంటలు (12 గంటల పని+ 2 గంటల ఓవర్​ డ్యూటీ) పని చేయాల్సి ఉంటుంది.

"ఐటీ/ఐటీఈఎస్​/బీపీఓ సెక్టార్​లలో ఉద్యోగులు 12 గంటలకు మించి పనిచేసే విధంగా చట్టాన్ని సవరించాలి. కానీ వరుసగా 3 నెలల పాటు 125 గంటల పనిని మించకూడదు," అని ఐటీ సెక్టార్​లోని కంపెనీలు ప్రతిపాదించాయి.

ప్రస్తుతం లేబర్​ చట్టాల ప్రకారం 12గంటల (10 గంటల పని+ 2 గంటల ఓవర్​ డ్యూటీ) పాటు పని చేసేందుకే అనుమతి ఉంటుంది.

ఐటీ సెక్టార్​ ప్రతిపాదనలపై ప్రభుత్వం ఇప్పటికే చర్చలు మొదలుపెట్టిందని సమాచారం. దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్​ సమావేశాల్లో ఈ విషయం చర్చకు రావచ్చు.

వ్యతిరేకించిన ఐటీ ఉద్యోగ సంఘాలు..

ఉద్యోగులకు 14 గంటల పనిని తీసుకురావాలని ఐటీ సంస్థలు చేసిన ప్రతిపాదనను కర్ణాటక రాష్ట్ర ఐటీ/ఐటీఈఎస్​ ఎంప్లాయీస్​ యూనియన్​ (కేఐటీయూ) వ్యతిరేకించింది. వర్కింగ్​ గంటలను పెంచితే షిఫ్ట్​ టైమింగ్స్​ పెరుగుతాయని, ఫలితంగా ఉద్యోగులను తగ్గించుకునేందుకు సంస్థ ప్రయత్నిస్తుందని అభిప్రాయపడింది.

"ప్రస్తుతం 3 షిఫ్ట్​లు ఉన్నాయి. 14 గంటల పని అంటే అది 2 షిఫ్ట్​లు అవుతుంది. ఫలితంగా మూడింట ఒక వంతు ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోతారు," అని కేఐటీయూ పేర్కొంది.

ఇలా పని గంటలను పెంచేస్తే ఉద్యోగుల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని యూనియన్​ ఆందోళన వ్యక్తం చేసింది.

"నివేదికల ప్రకారం ఐటీ రంగంలోని 45శాతం మంది ఉద్యోగుల మానసిక ఆరోగ్యం బాలేదు. 55శాతం భౌతికంగా అనారోగ్యంతో ఉన్నారు. పని గంటలు పెంచితే, ఈ సమస్యలు మరింత పెరుగుతాయి," అని యూనియన్​ ఓ ప్రకటన విడుదల చేసింది.

రాష్ట్రం, ఐటీ కంపెనీలు.. ఉద్యోగులను మనుషులుగా కాకుండా, గంటల తరబడి పనిచేసే మెషిన్​లుగా పరిగణిస్తున్నాయని యూనియన్​ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐటీ సంస్థల ప్రతిపాదనను అస్సలు అంగీకరించకూడదని తేల్చిచెప్పింది.

"ఉద్యోగులను మనుషులగా పరిగణించేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధంగా లేదని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ఉద్యోగుల వ్యక్తిగత జీవితాన్ని పరిగణించడం లేదు. కార్పొరేట్​ సంస్థలకు లాభాలను తెచ్చిపెట్టే మెషిన్​లుగానే చూస్తున్నారు," అని యూనియన్​ తెలిపింది.

వాస్తవానికి ఐటీ సెక్టార్​లో జీతాలతో పాటు పని గంటల సమయం కూడా అధికంగానే ఉంటుంది. చాలా మందికి లాగిన్​ అయిన తర్వాత ఎప్పుడు లాగౌట్​ అవుతారో కూడా తెలియడం లేదు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంది! ఇక 14 గంటల పని అంటే.. ఉద్యోగుల ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలే ఎక్కువ.

మరి ఈ 14 గంటల పని ప్రతిపాదనపై మీరేం అంటారు?

Whats_app_banner

సంబంధిత కథనం