Kidney Donors: పరస్పర సమ్మతితో కిడ్నీ రోగులకు ప్రాణదానం… ఒకరికొకరు ఆసరాగా నిలుస్తున్న దాతలు
23 February 2024, 8:14 IST
- Kidney Donors: కిడ్నీ రోగుల ప్రాణాలు నిలిపేందుకు పరస్పర సమ్మతితో అవయవదానం చేసేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. కిడ్నీ రోగుల పాలిట ఈ విధానం వరంగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు.
కిడ్నీ రోగుల పాలిట వరంగా మారిన స్వాపింగ్ విధానం
Kidney Donors: పరస్పర సమ్మతితో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలకు సహకరించుకుని రెండు కుటుంబాలు ఒకరికొకరు ఆసరాగా మారాయి. కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సల్లో సరికొత్త విధానాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించారు. కిడ్నీ వ్యాధుల బారిన పడి ఎంతో మంది అవయవ దానం కోసం ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో కొత్త ప్రక్రియ ఎంతో మందికి ఊరట కలిగించనుంది.
మూత్రపిండాల మార్పిడి కోసం రెండు కుటుంబాలకు చెందిన దాతలు తమ మూత్రపిండాలను ఒకరికొకరు మార్పిడి చేసుకునే ప్రక్రియను హైదరాబాద్‌లో ప్రారంభించారు. కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కు ఇది చాలా ఆశాజనకమైన పద్ధతి అని శస్త్రచికిత్స నిర్వహించిన హైదరాబాద్ స్టార్ హాస్పటల్ చీఫ్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీధర్ అన్నారు.
కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని భారతదేశంలో మూత్రపిండాల మార్పిడి అవసరమయ్యే 100 మంది రోగులలో, 3% నుండి 5% మంది మాత్రమే అవయవ మార్పిడి జరుగుతోందని వివరించారు. కిడ్నీ చికిత్సలో ఉత్తమ పరిష్కారాలు అందుబాటులో ఉన్నా, దాతతో పాటు అవయవ గ్రహీత యొక్క రక్త నమూనాలు సరిపోలకపోవడంతో 95% మందికి మార్పిడి చేయలేకపోతున్నట్టు వివరించారు.
దాతకు స్వీకర్తకు మధ్య కిడ్నీ సరిపోలక పోతే చికిత్సలు సాధ్యం అయ్యేవి కాదని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కొత్త విధానాలు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. ప్రస్తుతం వేర్వేరు మూత్రపిండాలను కూడా మార్పిడి చేయించుకోవచ్చని అలాంటి వారికి కొన్ని వైద్య విధానాలు మరియు మందులతో కిడ్నీలు సరిపోయేలా చేస్తామన్నారు. కిడ్నీల పనితీరును మార్పిడికి అనుకూలంగా మారుస్తామని తెలిపారు.
రెండో విధానంలో కిడ్నీ ఎక్స్ఛేంజ్ లేదా స్వాప్ కిడ్నీ ఎక్స్ఛేంజ్ విధానాన్ని అనుసరిస్తామన్నారు. మొదటి పద్ధతిలో కుటుంబ సభ్యుల్లో దాత తన కిడ్నీని రెండవ కుటుంబానికి ఇస్తాడు. ప్రతిగా అవతలి కుటుంబం నుంచి తన కుటుంబ సభ్యుడికి అవసరమైన కిడ్నీ స్వీకరిస్తారని వివరించారు.
తీవ్రమైన కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న దాదాపు 40% మందికి మెరుగైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయని, ఆరోగ్యశ్రీ పథకం కింద ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్సలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ శ్రీధర్ తెలిపారు.
కిడ్నీ మార్పిడిలో భాగంగా మరో కుటుంబానికి చెందిన వ్యక్తికి తన కిడ్నీని దానం చేసిన దాతలు సంతోషం వ్యక్తం చేశారు. తమకు సరిపోయే అవయవాలు లభిస్తాయని అనుకోలేదని పరస్పర సహకారం, అవగాహనతో రెండు కుటుంబాల మధ్య అవయవ దానానికి వీలు కలిగిందని దాతలు, అవయవ గ్రహీతలు చెబుతున్నారు. జీవితం చివరి దశలో ఎలాంటి భరోసా లేని వారికి ఈ విధానం కొత్త ఆశలు కల్పిస్తోందని చెబుతున్నారు.